ADVT
తాజా గడువు 5!
10-02-2018 02:21:57
 • వెంకయ్య జోక్యంతో మారిన చిత్రం
 • షా, జైట్లీలతో కీలక చర్చలు..
 • ప్రతిష్టంభన సరికాదని హితవు..
 • కీలక అంశాలపై జైట్లీ సానుకూల స్పందన
 • లోటు భర్తీకి మరిన్ని నిధులు..
 • ఈఏపీలకు కేంద్ర సంస్థల ద్వారా సాయం..
 • జోన్‌, ఉక్కు కర్మాగారానికీ ఓకే!?
 • దుగరాజపట్నం కాకుండా మరోచోట పోర్టు..
 • 5 వరకు వేచి చూసే ధోరణిలో టీడీపీ.. తేడా వస్తే మళ్లీ పోరు
 • రైల్వేజోన్‌, ఉక్కు కర్మాగారం, పోర్టుపై ప్రకటన
 • కీలక అంశాలన్నింటిపై మార్చి 5లోపు కార్యాచరణ
 
ఏపీకి సహాయం విషయంలో కేంద్రం వైఖరిలో మార్పు కనిపిస్తోంది. నవ్యాంధ్రకు సహాయంపై ముఖ్యమైన అంశాలకు సంబంధించి నిర్దిష్టత, స్పష్టతతో కూడిన ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధమైంది. మరీ ముఖ్యంగా... రైల్వేజోన్‌, లోటు భర్తీ, ఈఏపీలకు నిధులపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. అటు పార్లమెంటులో ప్రతిష్టంభన తొలగించడంతోపాటు, ఇటు నవ్యాంధ్రకు తగిన సహాయం అందేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రంగంలోకి దిగడంతో శుక్రవారం పరిస్థితిలో మార్పు కనిపించింది. వచ్చేనెల 5వ తేదీన మొదలుకానున్న మలి విడత బడ్జెట్‌ సమావేశాల్లోపు అన్ని అంశాలపై నిర్దిష్ట ప్రకటనలు చేసి, కార్యాచరణ కూడా మొదలుపెట్టేలా కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో... కేంద్రం వైఖరిపై వేచి చూసి, మార్చి 5లోపు సంతృప్తికరమైన ఫలితాలు రాకపోతే మళ్లీ పార్లమెంటు వేదికపైనే గళమెత్తాలని టీడీపీ సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది.
 
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఏపీ విషయంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు శుక్రవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీలను పిలిచి మాట్లాడారు. మధ్యలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరితోనూ చర్చించారు. సుమారు రెండున్నర గంటలపాటు ఈ చర్చలు జరిగాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ‘‘ఎన్డీయే భాగస్వామి అయిన తెలుగుదేశం ఎంపీల ఆందోళనతో పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొనడం సరికాదు.
 
వారిని ఏదో రకంగా సంతృప్తిపరచి ఈ అనిశ్చితికి తెరదించేలా... బీజేపీ తరఫున నిజాయితీతో కూడిన ప్రయత్నం జరగాలి’’ అని వెంకయ్య పేర్కొన్నట్లు తెలిసింది. కేంద్రం ఏం చేయాలనుకుంటున్నదీ, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అసంతృప్తిగా ఉన్నదీ అనే విషయాలపై స్పష్టత అవసరమని... తెగేదాకా లాగడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. అదే సమయంలో... అధికారపక్షంలో ఉంటూ ప్రతిపక్షంగా పనిచేయడం సరైంది కాదని కూడా సుజనాకు సూచించారు. ఈ నేపథ్యంలో జైట్లీ స్పందిస్తూ... విదేశీ సహాయంతో అమలు అయ్యే ప్రాజెక్టులు (ఈఏపీ), రెవెన్యూ లోటు, వంటి కీలక అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు అంగీకరించారు.
 
వెంకయ్యతో భేటీ ముగిసిన తర్వాత... సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ కూడా అమిత్‌ షా, అరుణ్‌ జైట్లీ, పియూష్‌ గోయెల్‌లతో వేర్వేరుగా మాట్లాడారు. రాజ్యసభలో చేసే ప్రకటనలో స్పష్టత ఉండాలని కోరారు. పార్లమెంటు నిబంధనల ప్రకారం పలు మంత్రిత్వ శాఖలకు చెందిన నిర్ణయాలను సభా వేదికపై చేయలేనని చెబుతూనే... జైట్లీ తన ప్రకటనలో మార్పుచేర్పులు చేశారు. పలు అంశాలపై ‘కొంత స్పష్టత’ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి నొక్కి చెప్పారు. ‘‘ప్రాజెక్టుకు నాబార్డు నుంచి నిధులు అందిస్తున్నాం. అది నిరంతర ప్రక్రియ. ప్రాజెక్టు పనులు ఆగవు’’ అని స్పష్టం చేశారు.
 
ఇక ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక సహాయం అందించేందుకు కేంద్రం అంగీకరించిందని జైట్లీ తెలిపారు. ఈఏపీలకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధులు ఇవ్వడంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. 2014-15లో పది నెలల రెవెన్యూ లోటుకు సంబంధించి 3975.50 కోట్లు ఇప్పటికే ఇచ్చామన్నారు. ఈ లోటుకు సంబంధించి ‘తుది’ మొత్తాన్ని చెల్లించే విషయంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రం అడుగుతున్న దానికీ, కేంద్రం ఇస్తామన్న దానికీ మధ్య వ్యత్యాసం తగ్గిపోయిందని జైట్లీ తెలిపారు. దుగరాజపట్నం పోర్టు, పెట్రోలియం కెమికల్‌ కాంప్లెక్స్‌ , రైల్వే జోన్‌, మొదలైన అంశాలపై ఆయా శాఖలు నిర్ణయం తీసుకునే ప్రక్రియ ‘అడ్వాన్స్‌’ దశలో ఉందని చెప్పారు.
 
కాగా, తాజా ప్రకటనతో కేంద్రం మళ్లీ పాత పాటే పాడిందని అనడానికి వీల్లేదని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. శనివారం జైట్లీతో మరోమారు చర్చలు జరుపుతామని... హామీలన్నీ అమలయ్యేదాకా పోరాటం ఆగదని సీఎం రమేశ్‌ చెప్పారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీలో ప్రకటించిన మొత్తాన్ని అనుకున్నంత మేరకు ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ విలేకరులతో చెప్పారు.
 
ఇంతకీ ఏమిస్తారట...
రైల్వేజోన్‌..
ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ‘రైల్వే జోన్‌’పై కేంద్రం ఏ రోజైనా సానుకూల ప్రకటన చేసేలా అంగీకారం కుదిరినట్లు తెలిసింది.
 
 
పోలవరం ప్రాజెక్టు..
రాష్ట్రానికి జల-జీవ నాడి వంటి పోలవరం ప్రాజెక్టుకు ఏ ఇబ్బందీ ఉండదని, కేంద్రమే బాధ్యత వహించి నిరంతరాయంగా నిధులిస్తుందన్నది జైట్లీ తాజా మాట.
 
ఉక్కు కర్మాగారం
కడపలో ఉక్కు ఫ్యాక్టరీపై టాస్క్‌ ఫోర్స్‌ సానుకూల నివేదిక ఇచ్చిందని... దానికనుగుణంగా త్వరలో ప్రకటన ఉంటుందని తెలిసింది.
 
రాజధాని నిర్మాణం
రాజధానికి 4 వేల కోట్లు ఇవ్వాలని ఇప్పటికే అంగీకారం కుదిరిందని... ఇప్పటికే ఇచ్చిన నిధులు పోగా, మిగిలినవి ఇస్తామంటోంది కేంద్రం.
 
విదేశీ సహాయ ప్రాజెక్టులు
ఈఏపీలకు నాబార్డు నిధులను ఇప్పించాలని ఏపీ కోరుతోంది. నాబార్డుతోపాటు కేంద్ర సంస్థల నుంచి నిధులు ఇవ్వడం, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సడలించి విదేశీ రుణం పొందే పరిమితిని పెంచడంపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.16వేల నుంచి 18 వేల కోట్లు లభిస్తాయని అంచనా. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీలో తదుపరి కసరత్తు కొనసాగిస్తారు.
పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌
దీనిని ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ ద్వారా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి నిధుల ఇబ్బంది ఉందంటూనే... సంబంధిత ప్రతిపాదనలపై యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవాలని చమురు సంస్థలకు ఇంటర్‌ ఆఫీస్‌ మెమో పంపాలని తీర్మానించారు.
రెవెన్యూ లోటు భర్తీ
2014-15 సంవత్సరానికి రెవెన్యూ లోటు 16వేల కోట్లు అని రాష్ట్రం, అంత లేదని కేంద్రం చెబుతున్నాయి. రాష్ట్రం అదనంగా కోరుతున్నదానికీ, కేంద్రం ఇవ్వాలనుకుంటున్న దానికీ మధ్య ‘గ్యాప్‌’ బాగా తగ్గించేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ పద్దు కింద ఇప్పటికి దాదాపు రు. 4వేల కోట్లు ఇచ్చారు. ఇది మరో రూ.1600 కోట్ల వరకు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. 2015-16 సంవత్సరానికి ఫైనాన్స్‌ కమిషన్‌ రాష్ట్రానికి 6900 కోట్లు కేటాయించగా, 2014-15 రెవెన్యూ లోటు కూడా ఇదే దామాషాలో ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనిపై రాష్ట్రప్రభుత్వ అధికారులు కేంద్రంతో తదుపరి చర్చలు జరుపుతారు.
ఓడరేవు
నెల్లూరు జిల్లా దుగరాజపట్నం రేవు సాధ్యం కాదని, దీనిపై ఇస్రో అభ్యంతరాలు వ్యక్తం చేసిందని కేంద్రం తెలిపింది. దీని బదులు రాష్ట్రం ప్రతిపాదించిన మరెక్కడైనా రేవు కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.