ADVT
బోదకాలు బాధితులకు పింఛన్లు
10-02-2018 02:06:05
  • ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపు
  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు
  • రాష్ట్రంలో 46,476 మందికి లబ్ధి
  • ప్రతీ ఊర్లో రోగ నిర్ధారణ పరీక్షలు
  • ప్రభుత్వపరంగా చికిత్స, మందులు
  • కేసీఆర్‌ కిట్‌ను ప్రైవేటు ఆస్పత్రులకివ్వం
  • ఆశా కార్యకర్తలకు మళ్లీ జీతాల పెంపు
  • వారికి గ్రామ సహాయకులుగా గుర్తింపు
  • రెండో ఏఎన్‌ఎంలకు కూడా: కేసీఆర్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): బోదకాలు బాధితులకు ఊరట. వారికి ప్రతి నెలా వెయ్యి రూపాయల పింఛను ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 46,476 మంది లబ్ధి పొందనున్నారు. చికిత్స కంటేనివారణే ముఖ్యమన్న మాటను ప్రభుత్వం ఆచరణలో పెట్టదలచుకుందని, ఇందుకు గ్రామం యూనిట్‌గా ప్రజలందకీ ప్రభుత్వ ఖర్చుతోనే రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలని నిర్ణయించిందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో వైద్యాధికారులు, సిబ్బంది సేవలను మరింత ప్రభావశీలంగా వినియోగించుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
 
మంత్రి తుమ్మల, ఎంపీ కవిత చొరవతో కదలిక
తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో బోదకాలు బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, కాలు తీసి కాలు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల, ఎంపీ కవిత ముఖ్యమంత్రికి విన్నవించారు. తన సొంత జిల్లాలో కూడా బోదకాలు బాధితులు ఎక్కువగానే ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని భావించిన సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారని, రాష్ట్రంలో కూడా అలాంటి అలవాటు చేయించాలని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. ‘‘అవగాహన ఉన్నవారు, ఆర్థిక స్తోమత కలిగినవారు పరీక్షలు చేయించుకుంటున్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు, ముఖ్యంగా పేదలు రోగమొచ్చినప్పుడు తప్ప ఆస్పత్రులకు వెళ్లరు. వైద్య పరీక్షలు చేయించుకోరు. దాంతో, చాలా వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించలేకపోతున్నారు. బోధకాలును కూడా ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేయవచ్చు. కానీ, ముదిరేదాకా గుర్తించరు. ఇకపై అలా జరగడానికి వీల్లేదు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయిస్తుంది. రక్త నమూనాలు సేకరించి, అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తుంది. వ్యాధిని గుర్తిస్తే వెంటనే ప్రభుత్వపరంగానే చికిత్స చేయించాలి. మందులు అందించాలి. ఎంత ఖర్చు అయినా వెనకాడేది లేదు. పేదల ఆరోగ్యం కాపాడడాన్ని మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి ఏదీ లేదు’’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యం తీరు మారింది. ప్రభుత్వ ఆస్పత్రులు ఎంతో మెరుగయ్యాయి. కేసీఆర్‌ కిట్‌ పథకం అద్భుతంగా అమలవుతోంది. తెలంగాణ తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. వైద్య అధికారులు, సిబ్బంది పనితీరుపై సర్వత్రా సంతృప్తి, సంతోషం వ్యక్తమవుతోంది. ఈ ఒరవడి, స్ఫూర్తి కొనసాగాలి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదల ముంగిట్లోకే వైద్యం చేరాలి’’ అని స్పష్టం చేశారు. ఆశా కార్యకర్తలకు ఒకసారి జీతాలు పెంచామని, మరోసారి పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని, వారిని విలేజ్‌ అసిస్టెంట్లుగా గుర్తిస్తామని చెప్పారు. రెండో ఏఎన్‌ఎం జీతాలు పెంచుతామని, వారి సేవలను సమర్థంగా వినియోగించుకుంటామని చెప్పారు.
 
కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రైవేటుకు నో
కేసీఆర్‌ కిట్‌ పథకం అద్భుతంగా అమలవుతోందని, పేదలకు ఎంతో మేలు కలుగుతోందని, అనవసర ఆపరేషన్లు బాగా తగ్గాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అదనపు భారం పడినా సరే వైద్యులు, సిబ్బంది ఓపికగా విధులు నిర్వర్తిస్తున్నారని, వారికి ఇన్సెంటివ్‌ ఇస్తామని తెలిపారు. ‘‘ప్రైవేటు ఆస్పత్రులకు కూడా కేసీఆర్‌ కిట్‌ పథకం వర్తింపజేయాలనే వినతులు వస్తున్నాయి. కానీ, ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అవసరమైన సౌకర్యాలు పెంచుతాం. తప్ప, ప్రైవేటు ఆస్పత్రులకు వర్తింపజేయబోం’’ అని స్పష్టం చేశారు.
 
ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌ పంటి నొప్పికి చికిత్స.. రెండు రోజులు విశ్రాంతి
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు పంటి నొప్పి మళ్లీ తిరగబెట్టింది. గతంలో కూడా పంటి నొప్పితో బాధపడిన ఆయన ఢిల్లీలో ప్రముఖ దంత వైద్యుడి వద్ద చికిత్స పొందారు. మళ్లీ నాలుగైదు రోజుల నుంచి ఆయన పంటి నొప్పితో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌ ఢిల్లీ చేరుకున్నారు. ఈసారి కూడా అదే వైద్యుడి వద్ద చికిత్స చేయించుకోనున్నారు. శనివారం మఽధ్యాహ్నం మూడు గంటలకు వైద్యుడితో అపాయింట్‌మెంట్‌ ఉంది. ఆ తరువాత కేసీఆర్‌ ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటారు. ప్రస్తుతానికి ఆయన ఢిల్లీ పర్యటన మూడు రోజులనే సమాచారం ఉంది. ఆదివారం సాయంత్రం వరకు ఉండి హైదరాబాద్‌ వెళతారని తెలిసింది. అయితే వైద్యుల సూచన మేరకు అవసరమైతే మరో ఒకటి రెండు రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఇది రాజకీయ పర్యటన కాదని టీఆర్‌ఎస్‌ ఎంపీ తెలిపారు. కేంద్ర మంత్రులను కూడా కలవకపోవచ్చని చెప్పారు.
 
పాస్‌ బుక్‌పై నా ఫొటో వద్దు
 రైతు ఫొటో, తెలంగాణ ముద్ర చాలు: కేసీఆర్‌
 ముదురు ఆకుపచ్చ రంగు పుస్తకం ఎంపిక
రైతులకు ఇవ్వనున్న సరికొత్త ‘ఎలకా్ట్రనిక్‌ టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల’పై తన ఫొటో వద్దని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. కొత్త పాస్‌ పుస్తకాల నమూనాలపై శుక్రవారం ప్రగతి భవన్‌లో ఆయన సమీక్షించారు. పంటలకు గుర్తుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పాస్‌ పుస్తకాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పాస్‌ పుస్తకంలో ఆయన ఫొటో ఉన్న న మూనాను అధికారులు ముఖ్యమంత్రికి చూపించగా.. ‘‘పాస్‌ పుస్తకంపై రైతు ఫొటో తప్ప మరెవరి ఫొటో ఉండరాదు. రాజకీయ నాయకుల ఫొటోలు అవసరం లేదు. కేవలం రైతు ఫొటో, తెలంగాణ ప్రభుత్వ ముద్ర మాత్రమే ఉండాలి’’ అని స్పష్టం చేశారు. మరోవైపు, 72 లక్షల పాస్‌ పుస్తకాల ముద్రణ టెండర్లను జాతీయ సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ (ఎస్పీపీ)కి అప్పగించే ఫైలుపై ఆయన సంతకం చేశారు. హైదరాబాద్‌, నోయిడా, నాసిక్‌, పుణేల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పాస్‌ పుస్తకాలు ముద్రించాలని, పంపిణీ రోజున సంబంధిత మండలాల తహసీల్దార్లు ముద్రణాలయం నుంచి పొందాలని సూచించారు. మార్చి 11న పాస్‌ పుస్తకాల పంపిణీకి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.
 
 

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.