ADVT
ఒక రోజు ముచ్చటే...
10-02-2018 01:53:43
  • మళ్లీ గ్లోబల్‌ కలవరం..
  • సెన్సెక్స్‌ 400 పాయింట్లు డౌన్‌
ముంబై : ఏడు రోజుల వరుస పతనాల నుంచి కోలుకున్నట్టే కనిపించిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా తిరిగి నష్టాల్లోకి జారుకుంది. మార్కెట్లో కనిపించిన రికవరీ ఒక రోజు ముచ్చటగానే ముగిసింది. సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ భారీ నష్టాలు నమోదు చేశాయి. నెల రోజుల కనిష్ఠ స్థాయిల్లో ముగిశాయి. అమెరికాలో నిరుద్యోగిత సంఖ్య వరుసగా రెండో వారంలో కూడా తగ్గినట్టు వచ్చిన వార్తలతో ద్రవ్యోల్బణం పోటెత్తుతుందని, వడ్డీ రేట్లు త్వరితంగా పెరుగుతాయన్న భయాలు మార్కెట్లను చుట్టుముట్టాయని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరిగితే వర్థమాన దేశాల మార్కెట్లకు నిధుల వరద తగ్గుతుందని కూడా ఇన్వెస్టర్లు భావించారని వారు వ్యాఖ్యానించారు.
 
ఈ ఆందోళనల నేపథ్యంలో అమెరికా మార్కెట్‌లో భారీ ఎత్తున అమ్మకాలు సాగడంతో డోజోన్స్‌ ఇండెక్స్‌ రెండో పెద్ద పతనాన్ని నమోదు చేయడం భారత మార్కెట్‌పై కూడా ప్రభావం చూపిందని వారన్నారు. ప్రపంచ దేశాల్లో వడ్డీ రేట్ల భయాలు...దేశీయంగా ద్రవ్యోల్బణంపై వాటి ప్రభావం, అంతర్జాతీయ వృద్ధికి సంబంధించిన ఆందోళనలు, నిధుల తగ్గుదలకు సంబంధించిన ఆందోళనలు మార్కెట్‌ సెంటిమెంట్‌పై వారం అంతా ప్రభావం చూపినట్టు బిఎన్‌పి పారిబా మ్యూచువల్‌ ఫండ్‌ సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ కార్తిక్‌రాజ్‌ లక్ష్మణన్‌ అన్నారు.
 
  •  సెన్సెక్స్‌ 407.40 పాయింట్లు దిగజారి 34005.76 పాయింట్ల వద్ద ముగిసింది. జనవరి నాలుగో తేదీ తర్వాత సెన్సెక్స్‌ నమోదు చేసిన కనిష్ఠ స్థాయి ఇదే. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 1061 పాయింట్లు నష్టపోయింది.
  •  నిఫ్టీ 121.90 పాయింట్ల నష్టంతో 10454.95 పాయింట్ల వద్ద ముగిసింది. వారం మొత్తం మీద నిఫ్టీ 305.65 పాయింట్లు నష్టపోయింది.
  •  ఈ భారీ కరెక్షన్‌తో సెన్సెక్స్‌ జనవరి 29న నమోదు చేసిన జీవితకాల గరిష్ఠ స్థాయి 36443.98 పాయింట్ల నుంచి 6.69 శాతం దిగజారగా నిఫ్టీ కూడా అదే రోజు నమోదు చేసిన రికార్డు 11171.55 పాయింట్ల నుంచి 6.41 శాతం దిగజారింది.
  •  వడ్డీ రేట్ల భయాలతో బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ కంపెనీల స్టాక్‌లు భారీగా నష్టపోయాయి. బ్యాంకెక్స్‌, నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.76 శాతం మేరకు నష్టపోయాయి. ప్రధానంగా యస్‌ బ్యాంక్‌ 2.84 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్‌ 2.33 శాతం నష్టపోయాయి. నష్టపోయిన బ్యాంకింగ్‌ షేర్లలో ఎస్‌బిఐ, హెచ్‌డిఎ్‌ఫసి బ్యాంక్‌, హెచ్‌డిఎ్‌ఫషి, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఉన్నాయి.
  • బిఎస్‌ఇలో నష్టపోయిన ఇతర షేర్లలో ఇన్ఫోసిస్‌, భారతి ఎయిర్‌టెల్‌, విప్రో, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్‌ అండ్‌ టి, హీరో మోటోకార్ప్‌, మారుతి సుజుకీ, బజాజ్‌ ఆటో, ఐటిసి, ఆర్‌ఐఎల్‌, మహీంద్రా, ఔన్‌జిసి, ఎన్‌టిపిసి ఉన్నాయి.
  •  ట్రెండ్‌కు ఎదురీది లాభపడిన షేర్లలో టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టిసిఎస్‌, హెచ్‌యుఎల్‌, కోల్‌ ఇండియా ఉన్నాయి. రంగాలవారీగా చూస్తే మెటల్‌, రియాల్టీ, పవర్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ ఉన్నాయి.
  •  ఎక్స్ఛేంజీల వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం గురువారం ఎఫ్‌పిఐలు 2,297 కోట్ల రూపాయల విలువ గల షేర్లు విక్రయించగా దేశీయ సంస్థలు 2,373.59 కోట్ల రూపాయల విలువైన కొనుగోళ్లు జరిపాయి.
గ్లెన్‌మార్క్‌ 8 శాతం డౌన్‌
క్యు3లో అత్యంత నిరుత్సాహపూరిత ఫలితాలు ప్రకటించడంతో ఫార్మా రంగానికి చెందిన గ్లెన్‌మార్క్‌ షేరు 8 శాతం మేరకు నష్టపోయింది. ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్‌ విలువ 1211 కోట్ల రూపాయల మేరకు తుడిచిపెట్టుకుపోయింది. బిఎ్‌సఇలో ఈ షేరు 7.43 శాతం నష్టపోయి 535.10 రూపాయల వద్ద ముగియగా ఎన్‌ఎ్‌సఇలో 7.66 శాతం నష్టపోయి 535.20 రూపాయల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు 9.5 శాతం వరకు నష్టపోయింది.
 
మహీంద్రా శాన్యోలో వాటాల విక్రయం
స్పెషాలిటీ స్టీల్‌ ఉత్పత్తి చేసే తమ అనుబంధ విభాగం మహీంద్రా శాన్యోలో 22 శాతం వాటాలను శాన్యో స్పెషల్‌ స్టీల్‌ కంపెనీకి విక్రయిస్తున్నట్టు మహీం ద్రా అండ్‌ మహీంద్రా శుక్రవారం ప్రకటించింది. డీల్‌ విలువ 146.32 కోట్ల రూపాయలని కంపెనీ పేర్కొంది.
ఈ విక్రయం అనంతరం జాయింట్‌ వెంచర్‌లో తమ వాటా 29 శాతానికి తగ్గుతుందని, అది అనుబంధ విభాగం హోదాను కోల్పోతుందని తెలిపింది.
 
మాక్స్‌ ఫైనాన్షియల్‌ రూ.5,000 కోట్ల సమీకరణ
ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ ద్వారా 5 వేల కోట్ల రూపాయలు సమీకరించాలనుకుంటున్నట్టు మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. అనుబంధ సంస్థ మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విస్తరణకు, జీవితబీమా రంగంలో అందుబాటులోకి వచ్చే కంపెనీలేవైనా ఉంటే వాటిని కొనుగోలు చేయడానికి ఈ నిధులు ఉపయోగించుకోనున్నట్టు తెలిపింది. మాక్స్‌ లైఫ్‌ నిర్వహణలోని నిధుల పరిమాణం తొలిసారిగా 50 వేల కోట్ల రూపాయల మైలురాయిని దాటిందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.