ADVT
భూగర్భ జల గోస!
10-02-2018 01:51:14
  •  రాష్ట్రంలో అడుగంటుతున్న నీటిమట్టం
  •  నెల రోజుల్లోనే మీటరు లోతుకు..
  •  24 గంటల విద్యుత్తుతో మరింత పాతాళానికి!
  •  భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు: నిపుణులు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు పథకంతో రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో బోరుబావుల్లోంచి నీటిని అదేపనిగా తోడేస్తుండడం.. రాష్ట్రవ్యాప్తంగా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఈ సమస్య ఏర్పడిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఒక మీటరు మేర నీటి మట్టం పడిపోయిందని అధికారులు తెలిపారు. మున్ముందు నీటి మట్టం మరింతగా పడిపోతుందని హెచ్చరిస్తున్నారు. గత డిసెంబరులో సరాసరి భూగర్భ నీటిమట్టం 9.18 మీటర్లు ఉండగా, ఈ ఏడాది జనవరి నాటికి అది 10.04 మీటర్ల మేరకు పడిపోయింది. వచ్చే రోజుల్లో ఈ నీటిమట్టం మరింత పడిపోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 2017లో సాధారణ వర్షపాతం 852 మిల్లీమీటర్లు కాగా 776 మి.మీ వర్షపాతమే నమోదైంది. అంటే.. సాధారణం కంటే 9 శాతం వర్షాలు తక్కువగా కురిశాయి. దీంతో భూగర్భ నీటిమట్టం పెరగడానికి అవకాశం లేకుండా పోయిందని అధికారులు వివరిస్తున్నారు. నిరుడు జనవరిలో రాష్ట్రంలో సరాసరి భూగర్భ నీటి మట్టం 9.36 మీటర్లు ఉండగా, ఈ ఏడాది జనవరిలో అది 10.04 మీటర్లకు పడిపోయింది. అంటే.. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 0.68 మీటర్ల మేర భూగర్భ నీటి మట్టం తగ్గింది. గత ఏడాది నిజామాబాద్‌ జిల్లాలో నిరుడు జనవరిలో భూగర్భ జలమట్టం 7.95 మీటర్లుగా నమోదవ్వగా.. ఈ జనవరిలో 11.07 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇది నిరంతర విద్యుత్తు ప్రభావమేనని భూగర్భజలవనరుల శాఖ ఉపసంచాలకులు జగన్నాథరావు అన్నారు.
 
 
 

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.