ADVT
లాభాల్లోకి విశాఖ ఉక్కు
10-02-2018 01:41:09
  •  రెండేళ్ల నష్టాలకు బ్రేక్‌
  • కంపెనీ సిఎండి మధుసూదన్‌ వెల్లడి
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌-విశాఖ ఉక్కు కర్మాగారం) గత రెండేళ్ల నష్టాలను అధిగమించి ఈ ఏడాది లాభాల బాటలోకి వచ్చిందని సిఎండి పి.మధుసూదన్‌ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నెలాఖరుకు రెండేళ్ల నష్టాలను భర్తీ చేసుకొని బ్రేక్‌ ఈవెన్‌ సాధించామన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల విక్రయాల ద్వారా సుమారు రూ.100 కోట్ల లాభాన్ని నమోదుచేస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఉక్కు పరిశ్రమకు మార్కెట్‌ సానుకూలంగా ఉందన్నారు. గత మూడు నెలల నుంచి ముడి ఇనుము, కోకింగ్‌ కోల్‌ ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, ఆ మేరకు ఉక్కు ధరలు కూడా పెంచాల్సి వచ్చిందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క డిసెంబరు నెలలోనే రూ.2 వేల కోట్ల విలువైన 5.65 లక్షల టన్నుల ఉక్కును విక్రయించామని వివరించారు. ఆధునీకరణ పనులన్నీ పూర్తయిపోయాయని, ఇప్పుడు 63 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అన్ని యూనిట్లు పనిచేస్తున్నాయన్నారు. ఉక్కు విక్రయాలు పెరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు దోహదపడుతున్నాయన్నారు. స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు విశాఖ ఉక్కును వినియోగిస్తున్నారని వివరించారు. అమరావతిలో గత పది నెలల్లో లక్ష టన్నుల విశాఖ ఉక్కు విక్రయించామన్నారు.
 
ఎగుమతుల విస్తరణ
ఇంతకు ముందు పొరుగు దేశాలకు మాత్రమే ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఉత్పత్తులను ఎగుమతి చేశామని, ఈ ఏడాది అమెరికాకు వైర్‌రాడ్లు, ఫిలిప్పీన్స్‌కు రౌండ్లు ఎగుమతి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కోస్టల్‌ షిప్పింగ్‌ (తీర ప్రాంత రవాణా)ను ఉపయోగించుకొని మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటిఎస్‌) ద్వారా మరిన్ని ఎగుమతులు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం సొంతంగా లాజిస్టిక్స్‌ సౌకర్యాలు కల్పించుకునే దిశగా చర్యలు మొదలయ్యాయన్నారు.
 
ఉపసంహరణతో సంస్థకు మేలు
ఆర్‌ఐఎన్‌ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం రెండేళ్ల క్రితమే నిర్ణయం తీసుకుందని, మార్కెట్‌ బాగున్నప్పుడు వాటాల విక్రయం జరిగే అవకాశం ఉందన్నారు. విశాఖ ఉక్కులో కేంద్రం రూ.4,890 కోట్లు పెట్టుబడి పెట్టిందని, అందులో పది శాతం వాటాలు విక్రయిస్తారని, అంటే రూ.489 కోట్ల విలువైన వాటాలను అమ్ముతారని ఆయన చెప్పారు.. ఇది సంస్థకు ఆర్థికంగా నష్టమైనప్పటికీ షేర్‌మార్కెట్‌లో కంపెనీ లిస్టింగ్‌కావడం వల్ల విశ్లేషకులు, నిపుణులు సంస్థపై దృష్టిసారిస్తారని, దానివల్ల పనితీరు మెరుగుపడడంతోపాటు మరింత సమర్థంగా పనిచేసే అవకాశం కలుగుతుందన్నారు.
నీతి అయోగ్‌ అనుమతిస్తే కుక్కునూరు గనులు
నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటైన విశాఖ ఉక్కుకు ఇప్పటివరకు సొంత గనులు లేని విషయమై మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఏ రాష్ట్రం గనులను ఆ రాష్ట్రమే కేటాయించాలని, దీనిపై కేంద్రానికి ఎటువంటి అధికారం లేదన్నారు. వేలంపాటల్లో అందరితోపాటు పాల్గొని దక్కించుకోవలసిందేనన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులోని గనులు కేటాయించడానికి ఎపి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అక్కడ 63 ఎఫ్‌ఈ రకం ముడి ఇనుము లభిస్తుందని, సుమారు 300 లక్షల టన్నులు అక్కడ వుండవచ్చునని అంచనా వేస్తున్నామన్నారు. వీటి కోసం ఎపిఎండిసితో కలిసి జాయింట్‌ వెంచర్‌ కు వెళుతున్నామని, దీనికి స్పెషల్‌ పర్సప్‌ వెహికల్‌ (ఎస్‌పివి) ఏర్పాటు చేసి నీతి అయోగ్‌కు దరఖాస్తు చేయాల్సి ఉందన్నారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.