అగ్ర నేతలతో చెట్టపట్టాల్‌!
10-02-2018 01:40:57
  • కొత్వాల్‌గూడను తాకట్టుపెట్టిన సౌమిత్‌కు పెద్దల అండ
  •  కేజ్రీవాల్‌, ఆడ్వాణీ, మోహన్‌ భగవత్‌,
  • మురళీధర్‌రావు తదితరులతో సంబంధాలు
  •  మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు వెళ్లే యత్నం
  •  రాజకీయాల్లోకి దిగిన భార్య ప్రీతి జెనా
  •  ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెల్లడి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): సౌమిత్‌ రంజన్‌ జెనా! కొత్వాల్‌గూడను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పీఈసీకి తాకట్టు పెట్టిన పైసీస్‌ ఎగ్జిమ్‌ కంపెనీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌. ఊరిని తనఖా పెట్టి రూ.332 కోట్లు నొక్కేయడమే కాదు.. పీఈసీకి దాదాపు రూ.650 కోట్ల బకాయిలు ఎగ్గొట్టాడు! ప్రభుత్వాన్ని, జనాన్ని నిండా ముంచి ఖరీదైన కార్లు, బంగళాలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. అయినా, అతనిపై ఈగ వాలడం లేదు. ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇందుకు కారణం.. అతనికి ఉన్న రాజకీయ సంబంధాలే! ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌ రావు, కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి రమేశ్‌ చందప్ప సహా పలువురు ప్రముఖులు, అధికార పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయ నాయకులతోపాటు సినీ, ఇతర రంగాల ప్రముఖులతో కూడా సౌమిత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెల్లడైంది. అధికార అండదండలు ఉండడంతోనే కేసులు పెట్టేందుకు కూడా అధికారులు జంకుతున్నారని తెలుస్తోంది. తప్పుడు పత్రాలతో గ్రామానికి గ్రామాన్నే తాకట్టు పెట్టి వందల కోట్ల రుణాన్ని తీసుకున్న సౌమిత్‌ రంజన్‌ జెనా ఇప్పటికీ ఢిల్లీలో రాజభోగాలు అనుభవిస్తూనే ఉన్నాడు. అధికార పార్టీ పెద్దలతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూనే ఉన్నాడు. అధికార పార్టీల్లోని అగ్రశ్రేణి రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. సినీనటి రవీనా టాండన్‌తోపాటు అనేకమంది సినీ ప్రముఖులతో సౌమిత్‌ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఒడిసాలో సౌమిత్‌ కుటుంబానికి కొంత రాజకీయ సంబంధాలుండడం అతనికి కలిసివచ్చింది. అడ్డగోలుగా సంపాదించిన డబ్బు చేతిలో ఉండడంతో రాజకీయ నేతలను విందులు, విలాసాలతో ముంచుతూ ఢిల్లీలో సంబంధాలు పెంచుకున్నాడు. తన ఆర్థిక నేరాల నుంచి బయటపడేందుకు, భవిష్యత్తులో ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నాడు. ఒడిసాకు చెందిన సౌమిత్‌ మహారాష్ట్రలోనూ పాగా వేశాడు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడో అక్కడి నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేందుకు కొన్నాళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ కావాలంటూ కొందరు అధికార పార్టీ పెద్దల చుట్టూ తిరిగాడు. ఇంతలో ఆయనపై కర్ణాటకలో మైనింగ్‌ కేసు నమోదు కావడంతో కథ అడ్డంతిరిగింది. మైనింగ్‌ అక్రమాల కేసులో సిట్‌ ఇతనిపై విచారణ జరిపి అరెస్ట్‌ చేసింది. దాంతో, అతని కోరిక నెరవేరలేదు.
 
భార్య ప్రీతి జెనా తక్కువేం కాదు
తన రాజకీయ కోరిక నెరవేరకపోవడంతో సౌమిత్‌ తన భార్యను రాజకీయాల్లోకి తీసుకువచ్చాడు. పైసీస్‌ ఎగ్జిమ్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న ప్రీతి జెనా ఇప్పుడు ఆలిండియా ఉమెన్‌ యునైటెడ్‌ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. జనాన్ని నిండా ముంచి విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న ప్రీతి జెనా ఇప్పుడు మహారాష్ట్రలో మహిళలను ఉద్దరిస్తామన్నట్లుగా ప్రసంగాలు చేస్తోంది. ఆమె ప్రసంగాలు యూట్యూబ్‌లో కూడా ఉన్నాయి.
గ్రామస్థులు భయపడొద్దు: ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌
 కొత్వాల్‌గూడ గ్రామాన్ని ఓ ప్రైవేటు కంపెనీ తాకట్టుపెట్టిన వ్యవ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌గౌడ్‌, ఆర్డీవో శ్రీనివాస్‌, తహసీల్దారు సురేశ్‌ శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులు భయపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ చెప్పారు. కాగా, ఊరు ఊరునే తాకట్టుపెట్టి రుణం తీసుకున్న ఘరానా మోసగాళ్లను వదలొద్దని మాజీ మంత్రి సబితారెడ్డి డిమాండ్‌ చేశారు. భూ కుంభకోణాన్ని వెలికితీసిన ఆంధ్రజ్యోతి దినపత్రికను అభినందించారు.
 
గొల్లపల్లి భూకుంభకోణం వార్తలో నిజంలేదు: ఆర్డీవో శ్రీనివాస్‌
గొల్లపల్లి ఖుర్దులోని సర్వే నంబర్‌ 24 సయ్యద్‌గూడలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని, 261 సర్వే నంబర్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారని ఓ దినపత్రిక (ఆంధ్రజ్యోతి కాదు)లో ప్రచురితమైన వార్తలో వాస్తవం లేదని ఆర్డీవో శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. అసలు 261 సర్వే నంబర్‌లో రిజిస్టర్‌ చేసినట్టు లేదన్నారు. ఒకవేళ రిజిస్టర్‌ జరిగినా అది చెల్లదని చెప్పారు. సదరు వ్యక్తులు చేసుకున్న అగ్రిమెంట్‌ ఆఫ్‌ సెల్‌ ద్వారా 215 సర్వే నంబర్‌లో వాళ్లకి పాసుబుక్కు వచ్చినట్టు పేర్కొన్నారు. దాన్ని పెట్టి రోజిలిన్‌ అనే వ్యక్తి అచ్చేశ్వరి అనే వ్యక్తికి అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ చేశారన్నారు. అయితే అది ప్రభుత్వ భూమి కాదని ఆర్డీవో వివరించారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.