వైద్య సీట్లలో మరో తొండి ఆట
10-02-2018 01:26:03
  •  ఎన్‌సీసీ కోటా సిఫారసు తారుమారు
  •  వైద్య సీటు కోల్పోయిన విద్యార్థి..
  • ఆర్టీఐతో తేలిన ఎన్‌సీసీ నిర్వాకం
హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): వైద్య సీట్ల వ్యవహారంలో మరో తొండి ఆట వెలుగులోకి వచ్చింది. అధికారుల నిర్వాకంతో మరో విద్యార్థి వైద్య సీటు అవకాశం కోల్పోయాడు. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ తప్పిదం వల్ల ఇప్పటికే ఒక విద్యార్థి సీటును కోల్పోగా ఎన్‌సీసీ కోటాలోనూ ఇదే జరిగినట్లు తాజాగా తేలింది. ఎన్‌సీసీ, క్రీడలు తదితర రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కోటాలో సీట్ల భర్తీకి ఆయా సంస్థలు (ఎన్‌సీసీ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ) ఇచ్చిన జాబితాలే ప్రామాణికం అవుతున్నాయి. వీటిలో తప్పిదాలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. ఇంటర్‌లో రెండు సంవత్సరాల ఎన్‌సీసీ కోర్సు ఉంది. ఎన్‌సీసీ నిర్వహించిన పరీక్షలో ఒక మైనారిటీ విద్యార్థికి 500 మార్కులకు 433 మార్కులు వచ్చాయి. ఈ విద్యార్థికి ‘ఏ’ గ్రేడ్‌ లభించింది. మరో మైనారిటీ విద్యార్థికి 429 మార్కులు వచ్చాయి. ఇతనికి ‘బి’ గ్రేడ్‌ను కేటాయించారు. ‘ఏ’ గ్రేడ్‌ విద్యార్థికి కాకుండా ‘బి’ గ్రేడ్‌ విద్యార్థికి వైద్య కళాశాలలో సీటు దక్కింది. ఆ విద్యార్థి తండ్రి సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) ఆశ్రయించారు. దీంతో ఎన్‌సీసీ సిఫారసుల్లో చోటుచేసుకున్న పొరపాటు వెలుగులోకి వచ్చింది. ఎన్‌సీసీ ఇచ్చిన గ్రేడింగ్‌ మారిపోయింది. ‘బి’ గ్రేడ్‌ విద్యార్థికి తరువాత ‘ఏ’ గ్రేడ్‌ ఇచ్చినట్లు వెల్లడైంది. ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలోనే ఈ రెండు వివరాలూ ఉన్నాయి. అతని పోరాటానికి నెలలు పట్టింది. కానీ ఈలోపు పుణ్యకాలం గడిచిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గత ఏడాది సెప్టెంబరులోనే ప్రవేశాలు ముగిశాయి. కాగా క్రీడా కోటాలో అక్రమాలు నిజమేనని విచారణ కమిటీ తేల్చింది. ‘వైద్య సీట్లలో తొండి ఆట’ అని ‘ఆంధ్రజ్యోతి’లో డిసెంబరులో వచ్చిన కథనంపై ప్రభుత్వం విచారణ జరిపించింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అందింది. ‘క్రీడా కోటాలో సర్టిఫికేట్ల నిర్ధారణకు తగినంత సమయం లేదు. మరోవైపు పని ఒత్తిడి. అందుకే సరిగా చూడలేకపోయాం. ఒక విద్యార్థికి 27(టీ) అని ఇవ్వాల్సి ఉండగా 25(టీ) అని ఇచ్చాం’’ అని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో బాధ్యులపై వేటు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.