ఆరోగ్యంలో రాష్ర్టానికి 11వ స్థానం
10-02-2018 01:19:53
  • ఆరోగ్యంలో తెలంగాణకు 11వ స్థానం
  • కేరళ భేష్‌.. అట్టడుగున యూపీ.. ఏపీకి 8వ స్థానం
  • నీతి ఆయోగ్‌ ఆరోగ్య సూచీ ర్యాంకులు విడుదల
హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యం, వైద్యసేవల విషయంలో తెలుగు రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ విషయంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నవజాత శిశువుల మరణాలు, ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు, వ్యాక్సినేషన్‌, ఆస్పత్రిలో ప్రసవాల విషయంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే కేరళ ఎంతో ప్రగతిపథంలో ఉన్నట్లు నీతి ఆయోగ్‌ తేల్చింది. ‘దేశ ప్రగతి, ఆరోగ్యకర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకింగ్‌’ అనే అంశంపై ఆరోగ్య సూచికను నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌ చివరి స్థానంలో ఉంది. 21 పెద్దరాష్ట్రాల విభాగంలో కేరళ, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఎనిమిది చిన్న రాష్ట్రాలలో మిజోరం, మణిపూర్‌, మేఘాలయ, సిక్కిం, గోవా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ర్యాంకుల్లో అట్టడుగు స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌, ఒడిషా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలున్నాయి. గత ఆరోగ్య సూచికలో 10వ స్థానంలో ఉన్న తెలంగాణ 11వ ర్యాంకుకు పడిపోగా, ఆంధ్రప్రదేశ్‌ 9 నుంచి 8కి చేరుకుంది. ఈ వివరాలను నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు. కాగా, కొత్తగా ఏర్పడిన తెలంగాణ మొత్తం 30 ఇండికేటర్లలో పదింట మెరుగుపడిందని, ఒక ఇండికేటర్‌లో బాగా మెరుగుపడిందని నివేదిక తెలిపింది. నవజాత శిశు మరణాల విషయంలో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. తక్కువ బరువుతో పుట్టే శిశువుల సమస్య అతి తక్కువగా ఉండి, ఈ ఇండికేటర్‌లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వెయ్యికి ఆరు నుంచి ఐదుగురికి తగ్గింది. లింగ నిష్పత్తిలో తెలంగాణ దేశంలో 9వ స్థానంలో నిలిచింది. పిల్లల టీకాల విషయంలో తెలంగాణకు 12వ స్థానం దక్కింది. ఆస్పత్రుల్లో ప్రసవాల విషయంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. 2014-15లో 59 శాతం ఉంటే అది 2015-16కు ఏకంగా 85 శాతానికి చేరి, దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. టీబీ పెరుగుదలలో దేశంలో 15వ స్థానంలో తెలంగాణ నిలిచింది. ఎయిడ్స్‌ బాధితుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య రాష్ట్రంలో పెరిగింది. 2014-15లో దాదాపు 18 నెలల పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నీతిఆయోగ్‌ ర్యాంకులను ప్రకటించింది. ప్రజల జీవితకాలం పెరిగిందని, మాతా శిశు మరణాలు తగ్గాయని అధ్యయనంలో తేలింది.
 
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.