ADVT
దక్షిణాదిని ముంచేస్తారా?
10-02-2018 01:13:23
  • మేం విడిపోయే పరిస్థితి తెస్తారా
  • క్రమశిక్షణతో ఉండటమే నేరమా
  • ప్రోత్సహించడం మాని శిక్షిస్తారా
  • ఉత్తరాదిని అభివృద్ధి చేసుకోండి
  • ఆ పేరుతో మాకు నష్టం చేస్తారా
  • దక్షిణాది రాష్ట్రాల ఆగ్రహం
  • ఆర్థిక సంఘం ముందు నిరసన
  • 2011 జనాభా ప్రాతిపదికకు నో


పంచపాండవుల్లా దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక సంఘం తీరును దుయ్యబట్టాయి. ఉత్తరాది రాష్ట్రాలకు సాయం చేస్తే చేసుకోండి. కానీ.. ఆ పేరుతో తమకు అన్యాయం చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. ఆర్థిక సంఘం చెబుతున్న ఫార్ములా ప్రమాదకరమని.. అది ఉత్తరాది రాష్ట్రాలకు అనుకూలంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రతికూలంగా ఉన్నద’ని ఆగ్రహం వ్యక్తం చేశాయి. జాతీయ విధానం పేరిట దక్షిణాదిని ముంచేస్తారా? దక్షిణాది రాష్ట్రాలు దేశం నుంచి పక్కకెళ్లాలని ఉందా? అని 15వ ఆర్థిక సంఘాన్ని తీవ్రస్వరంతో నిలదీశాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సమావేశం వాడివేడిగా జరిగింది.
 
హైదరాబాద్‌/అమరావతి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాది రాష్ట్రాలు వెనకబడ్డాయన్న కారణం చూపి.. ఆ కారణంగా వాటికి నిధులు పెంచి, దక్షిణాది రాష్ట్రాలకు కోత పెడితే ఊరుకునేది లేదని, మరో ఐదేళ్లు నష్టపోయేందుకు తాము సిద్ధంగా లేమని దక్షిణాది రాష్ట్రాలు 15వ ఆర్థిక సంఘానికి స్పష్టం చేశాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 15వ ఆర్థిక సంఘం సంప్రదింపుల సమావేశం జరిగింది. ఇందులో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ‘‘ఉత్తరాదిలోని
వెనుకబడిన రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి కదా! వాటికి నిధులు ఇవ్వకుంటే ఎలా? అభివృద్ధి చెందిన మీకు నిధులు ఎందుకు?’’ అనేలా ఆర్థిక సంఘం ప్రతినిధులు ఈ భేటీలో దక్షిణాది రాష్ట్రాల అధికారులను ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేంద్ర నిధుల కేటాయింపుల ప్రస్తావన తెచ్చారు. దీనిపై దక్షిణాది అధికారులు మండిపడ్డారు. ‘‘ వెనుకబడిన రాష్ట్రాలను ఆదుకోండి. వాటినీ అభివృద్ధి చేయండి. కానీ... దా ని పేరిట దక్షిణాదిలోని ప్రగతిశీల రాష్ట్రాలను శిక్షిస్తారా? మా ప్రాధాన్యాలకు కోతపెట్టి మాకు నష్టం కలిగిస్తారా? క్రమశిక్షణతో ఉండడమే నేరమా? అలా ఉన్నందుకు ప్రోత్సహించడం మాని శిక్షిస్తారా?’’ అని ఒక రాష్ట్రానికి చెందిన అధికారి తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.
 
ఉత్తరాది పెంపు.. దక్షిణాదికి ముప్పు..
13వ ఆర్థిక సంఘం వరకు కేంద్రం నిధులను 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు కేటాయిస్తూ వచ్చారు. దీనిని మార్చి... 2011 జనాభాను పరిగణలోకి తీసుకుంటామని 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదించగా, దక్షిణాది రాష్ట్రాలు ససేమిరా అన్నాయి. దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని తెలిపాయి. దీంతో అప్పుడు ఈ ప్రతిపాదనపై వెనక్కి తగ్గారు. పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు ఇచ్చేలా కొత్త ఫార్ములా తీసుకొచ్చారు. తాజాగా... 15వ ఆర్థిక సంఘం సభ్యులు మరోమారు జనాభా లెక్కల ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాల అధికారులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. 1971 వరకు దేశంలో కుటుంబ నియంత్రణపై అవగాహన లేదు. ఆ తర్వాత ఇద్దరు ముద్దు, ముగ్గురు హద్దు, మేమిద్దరం మాకిద్దరు అంటూ కుటుంబ నియంత్రణను ప్రోత్సహించారు.
 
దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో ముందున్నాయి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితం కావడంతో జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గింది. ఉత్తరాది జనాభా మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉంది. దీంతో... 1971 జనాభా లెక్కల ప్రాతిపదికనే కేంద్ర నిధులను కేటాయిస్తూ వచ్చారు. ఇప్పుడు... 2011 జనాభాను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు మునిగిపోవడం ఖాయమని శుక్రవారం నాటి సమావేశంలో తేల్చి చెప్పారు. ‘‘మేం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. కేంద్రం విధించిన నిబంధనల మేరకు, ఆ ప్రాతిపదికల ఆధారంగా పని చేస్తున్నాం. జనాభాను నియంత్రిస్తున్నాం. అక్షరాస్యతను పెంపొందిస్తున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంటే మమ్మల్ని శిక్షించడమేమిటి? క్రమశిక్షణ లేని రాష్ట్రాలను ప్రోత్సహించడమేమిటి?’’ అని నిలదీసినట్లు తెలిసింది. ‘అది జాతీయ విధానం’ అని ఆర్థిక సంఘం పేర్కొనగా.. జాతీయ విధానమంటే అన్ని రాష్ట్రాలకూ సమన్యాయం చేయాలిగానీ దక్షిణాది రాష్ట్రాల పొట్టగొట్టకూడదని, ఈ పద్ధతి పనికిరాదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇంత గట్టిగా చెప్పినా.. 15వ ఆర్థిక సంఘం అధికారులు మాత్రం తమ పట్టు వీడలేదు. ‘ఇది జాతీయ విధానం. మేమిచ్చిన ఫార్మాట్‌లో మాత్రమే వివరాలను పంపాలి. అప్పుడే మాకు సులువవుతుంది’ అని స్పష్టం చేసింది.
 
తెలంగాణకు నష్టం..
తెలంగాణ లాంటి కొత్త రాష్ట్రాలకు ఎక్కువ నిధుల అవసరం ఉన్నదని.. తమకు ఎక్కువ కేటాయింపులు ఉండేలా చూడాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, షాదీ ముబారక్‌ వంటి ప్రతిష్ఠాత్మక పథకాలను, భారీ నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టిన తెలగాణకు బడ్జెట్‌ కేటాయింపుల విషయంలో నష్టం జరిగిందని గుర్తుచేశారు. ప్రగతిశీల రాష్ట్రాల విషయంలో ఆర్థిక సంఘం తగిన సిఫారసులు చేయాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం తప్పుడు అంచనాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టం గురించి ఆ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రవిచంద్ర 15వ ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. ‘‘పన్నుల్లో వాటా కింద ఈ ఆర్థిక సంవత్సరం రూ.58 వేల కోట్లు వస్తాయన్నారు. కానీ... 44వేల కోట్లే వచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.68 వేలకోట్లు వస్తాయంటున్నారు. ఈ తప్పుడు లెక్కల వల్ల మాకు రెవెన్యూలోటు భర్తీలో అన్యాయం జరిగింది. 14వ ఆర్థిక సంఘం లెక్కలు పక్కాగా ఉండి ఉంటే... ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేలకోట్లు రెవెన్యూలోటు కింద వచ్చేది’’ అని తెలిపారు. దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా తలసరి ఆదాయం త క్కువగా ఉన్నది ఏపీకేనని చెప్పారు. అయితే రాష్ట్ర వృద్ధి 14ు కాగా.. వ్యవసాయ రంగం వృద్ధి 25 శాతమని చెప్పారు. కాబట్టి, వృద్ధిరేటు రెండంకెల్లో ఉన్నా ఖజానాకు తక్షణమే వచ్చే నిధులేవీ లేవని వివరించారు. 14వ ఆర్థిక సంఘం పొరపాటు అంచనాల వల్ల తమకు వాటిల్లిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని తమకు సమంజసమైన కేటాయింపులు జరపాలని రవిచంద్ర కోరారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.