ఏప్రిల్‌ 1 నుంచి ‘పెట్టుబడి’ చెక్కులు
10-02-2018 00:48:04
  • 45 రోజులపాటు రైతులకు పంపిణీ
  • వారంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి
  • రూ. 7 వేల కోట్ల రుణం: పోచారం
హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రైతులకు పంట పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ ఏప్రిల్‌ 1 నుంచి మే 15 వరకు 45 రోజులపాటు జరగనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి మరో వారం రోజుల్లో ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రారంభమైన అగ్రిటెక్‌ సౌత్‌-2018 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లో పంటలకు మద్దతు ధరల కన్నా తక్కువ ధర పలికితే.. రైతు సమన్వయ సమితులే మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేస్తాయన్నారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి నుంచి ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. పంటల సేకరణ కోసం రాష్ట్ర రైతు సమన్వయ సమితికి రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు బ్యాంకు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వాలుగా చేయాల్సిన వాటిలో 24 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇవ్వడం ఒకటన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రైతు ఒకరు.. ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడం వల్లనే తన పదెకరాల భూమిలోనూ వరిని సాగు చేసుకోగలుగుతున్నట్లు చెప్పారని, అంతకుముందు ఏడెకరాల్లోనే వరి వేసేవాడినని తెలిపారని పేర్కొన్నారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ఇది ప్రచురితమైన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో వ్యవసాయ యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారని, నాట్లు వేయడం నుంచి హార్వెస్టింగ్‌ వరకూ యంత్రాల ద్వారానే జరగాలన్నారని మంత్రి వెల్లడించారు. నియోజకవర్గానికి ఒక ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైన విషయాన్నీ పోచారం గుర్తు చేశారు. కాగా జయశంకర్‌ వర్సిటీ ఏర్పడిన రెండేళ్లలో 13 వంగడాలను విడుదల చేసినట్లు వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు తెలిపారు. సదస్సు ప్రారంభ కార్యక్రమంలో సీఐఐ నేషనల్‌ వాటర్‌ కమిటీ చైర్మన్‌ రమేష్‌ దాట్ల, అగ్రిటెక్‌ సౌత్‌ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, టాఫే లిమిటెడ్‌ అధ్యక్షుడు కేశవన్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎండీ సమీర్‌గోయల్‌, సీఐఐ వైస్‌చైర్మన్‌ సంజయ్‌సింగ్‌ పాల్గొన్నారు. అనంతరం వర్సిటీ ప్రాంగణంలో ఎగ్జిబిషన్‌ను పోచారం ప్రారంభించారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.