ADVT
పాలస్తీనాకు బాసట
10-02-2018 00:41:46
ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమాసియాలో పర్యటించడం ఇదే ప్రధమం కాదు కానీ, పాలస్తీనాలో భారత ప్రధాని అడుగుపెట్టడం మాత్రం ఇదే తొలిసారి. శుక్రవారం ఆరంభమైన మూడుదేశాల పర్యటనలో భాగంగా మోదీ జోర్డన్‌ రాజధాని అమ్మన్‌ చేరుకొని ఘనస్వాగతాన్ని అందుకున్నారు. జోర్డన్‌లో భారత ప్రధాని అడుగుపెట్టి కూడా ముప్పయ్యేళ్ళయింది. ఇజ్రాయెల్‌ ఆక్రమణలతో సరైన విమానాశ్రయాలు లేని పాలస్తీనాకు చేరుకోవడం కోసం ఇక్కడ తొలుత కాలూనిన మోదీ హెలికాప్టర్‌లో రమల్లా చేరుతారు. పాలస్తీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఒమన్‌ పర్యటనను మోడీ మూడురోజుల్లోనే ముగించబోతున్నప్పటికీ, ఈ యాత్రకు విశేష ప్రాధాన్యం ఉన్నది.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దయవల్ల పాలస్తీనా తిరిగి వేడెక్కింది. జెరూసలేంను రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం నిప్పురాజేసిన స్థితిలో మోదీ పాలస్తీనాలో పర్యటిస్తున్నారు. దశాబ్దాలుగా పాలస్తీనా స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు మద్దతునిస్తూ అంతర్జాతీయ వేదికలపై దానికి అండగా ఉంటూ వచ్చినప్పటికీ, భారత ప్రధానులెవరూ ఇప్పటివరకూ పాలస్తీనాలో కాలూనలేదు. ఇజ్రాయెల్‌తో దౌత్యాన్ని ఆలింగనాల వరకూ తెచ్చిన మోదీ ఈ పాలస్తీనా పర్యటనకు టెలీవీవ్‌ మార్గాన్ని కాక, జోర్డన్‌ దారిని ఎంచుకోవడంలోనే చక్కని సందేశం ఉన్నది. ఇజ్రాయెల్‌తో పెరిగిన సాన్నిహిత్యం కానీ, బెంజమీన్‌ నెతన్యాహూతో వ్యక్తిగతంగా పెంచుకున్న స్నేహం కానీ భారతదేశ దౌత్యవిధానాన్ని పూర్తిగా మార్చివేయలేదని చెప్పడానికి ఈ పర్యటన ఉపకరిస్తుంది. పాలస్తీనాతోనూ, గల్ఫ్‌ సహకార సంఘం సభ్యదేశాలతోనూ భారత్‌ తన ప్రయోజనాలను అనుగుణంగానే వ్యవహరిస్తుందన్న సందేశం ఇందులో ఉన్నది.
 
పాలస్తీనా ఆకాంక్ష విషయంలో భారత్‌ అదే వైఖరి కొనసాగిస్తున్నదన్న సంకేతాలు నిజానికి మొన్నటి డిసెంబరులోనే ప్రపంచానికి విస్పష్టంగా అందాయి. జెరూసలేంను రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి తీర్మానించినప్పుడు మనదేశం పాలస్తీనా పక్షాన నిలిచింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో స్నేహం ఆయుధాలనుంచి ఆలింగనాల వరకూ హెచ్చిన నేపథ్యంలో, భారత్‌ ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయకున్నా, కచ్చితంగా గైర్హాజరవుతుందని అంతా భావించారు. ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య (ఓఐసీ) ట్రంప్‌ నిర్ణయాన్ని తూర్పా్రబట్టడంతోనూ, భద్రతామండలిలో అమెరికా ఆప్తదేశాలే దానిని కాదుపొమ్మనడంతోనూ అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఒక్కటిగా నిలవబోతున్న వాతావరణం కనిపించి భారత్‌ కూడా అదే బాటన నడిచింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు భారత్‌ నిర్ణయం మనస్తాపాన్ని కలిగించినప్పటికీ, పాలస్తీనాకు మరోమారు మనపై నమ్మకం కలిగించింది. మరోవారంలో ట్రంప్‌ జెరూసలేమ్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో లష్కరే తొయ్యబా అధినేత హఫీజ్‌ సయీద్‌ ఆధ్వర్యంలో ఓ భారీ బహిరంగ సభ జరిగినప్పుడు పాకిస్థాన్‌లో పాలస్తీనా రాయబారిగా ఉన్న అలీ దానికి హాజరైనారు. దీనిపై భారత్‌ అభ్యంతరం తెలపగానే, సదరు రాయబారిని పాలస్తీనా వెంటనే వెనక్కు పిలిపించింది. కశ్మీర్‌ విముక్తి నినాదాలు కూడా ఆ సభలో రేగిన మాట నిజమే అయినప్పటికీ, పాలస్తీనా ఈ చర్యతో భారత్‌ పట్ల తన ఆత్మీయతను కనబరచిన మాట వాస్తవం. ఇప్పుడు మోదీ పర్యటన సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను గమనించినట్టయితే, భారత్‌పై ఇంకా ఆ దేశం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నదని అర్థమవుతున్నది. పాలస్తీనా ఆకాంక్షను ఈడేర్చే విషయంలో భారత్‌ క్రియాశీలకమైన పాత్ర పోషించాలని ఆ దేశం కోరుకుంటున్నది.
 
పాలస్తీనా విషయంలో ఏడు దశాబ్దాలుగా భారత్‌ కొనసాగిస్తున్న వైఖరిలో మార్పులేదని ఆ దేశాధ్యక్షుడికీ, ప్రజలకు నేరుగా చెప్పడానికి మోదీ పర్యటన ఉపకరిస్తుంది. అరబ్‌ ఎమిరేట్స్‌, ఒమన్‌ పర్యటనలో అర్థికావసరాలు, ఎగుమతులు దిగుమతుల ప్రయోజనాలు, చమురు అవసరాలు ఉండవచ్చును కానీ, పాలస్తీనా వరకూ దాని పునర్మిణంలో భారత్‌ కీలకభూమిక నిర్వహిస్తుందన్న హామీ ఈ పర్యటన ద్వారా అందుతుంది. పాలస్తీనా కోసం ఇజ్రాయెల్‌ను దూరం పెట్టే గత కాలపు విధానంలో విస్పష్టమైన మార్పు వచ్చినప్పటికీ, మోదీ ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్‌–పాలస్తీనా విషయంలో ఆచితూచి అడుగులు వేయడానికే నిర్ణయించుకున్నట్టు అర్థం. పాలస్తీనా ఆకాంక్షకు నైతిక మద్దతు ఇస్తూనే, ఇజ్రాయెల్‌తో సైనిక, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు కొనసాగించడం మోదీ విధానం కావచ్చును. అయితే, ఈ విన్యాసం ఉపరితలంలో భారత్ ప్రయోజనాల వరకూ ఉత్తమం కావచ్చునేమో కానీ పాలస్తీనాకు మాత్రం మేలు చేయదు.
 
అమెరికా అండతో ఇజ్రాయెల్‌ విర్రవీగుతున్న స్థితిలో ఈ వ్యూహం బలహీనమైన పాలస్తీనాను దాని చావుకు దానిని వదిలివేయడమే అవుతుంది. అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి తీర్మానాలను తుంగలో తొక్కి పాలస్తీనాను ఇజ్రాయెల్‌ రూపుమాపుతున్న స్థితిలో భారత్‌ బలహీనుల పక్షాన విస్పష్టంగా నిలవాల్సిన అవసరం ఉన్నది. జెరూసలేం విషయంలో ట్రంప్‌ దూకుడు నిర్ణయం తీసుకొని ఇజ్రాయెల్‌ పక్షాన స్పష్టంగా చేరిపోయారు. దీని కారణంగా జెరూసలేం వివాదాన్ని తేల్చే విషయంలో మధ్యవర్తిత్వం వహించే హోదాను అమెరికా కోల్పోయింది. అమెరికాతో సంప్రదింపులు జరపడానికి పాలస్తీనియన్లు నిరాకరిస్తున్న స్థితిలో ఆ మధ్యవర్తి స్థానాన్ని భారత్‌ భర్తీ చేయగలిగితే భారత్‌ ప్రపంచశక్తిగా అవతరిస్తుంది. అటు పాలస్తీనాలోనూ, ఇటు ఇజ్రాయెల్‌లోనూ సమాన విశ్వాసాన్ని, ప్రజాదరణను పొందుతున్న భారతదేశం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అవసరం.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.