ADVT
లైట్‌ తీస్కోండి!
10-02-2018 00:03:50
శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే భక్తి...ముక్తి..సిరిసంపదల్ని శివుడు అనుగ్రహిస్తాడనేది భక్తుల గాఢ నమ్మకం. అందుకే ఆ రోజు లక్షలాది మంది ఉపవాసం ఉంటారు. పళ్లు, ఫలాలు, డ్రైఫ్రూట్లు తింటారు. ద్రవపదార్థాలు, జ్యూసులు తాగుతారు. అయితే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేవాళ్లకి కొన్ని ప్రత్యేక రెసిపీలున్నాయి. అలాంటివారికి ఇవి ఆరోగ్యపరంగా బాగుంటాయి. కొన్ని శివరాత్రి రెసిపీలను ఈ వారం ‘నవ్య’ మీ ముందు ఉంచుతోంది... మీరూ ఆస్వాదించండి...
 
రైతా
కావలసినవి: తాజా గడ్డ పెరుగు-ఒక కప్పు, ఉడకబెట్టిన చిలకడదుంప-ఒకటి (తరిగి), ఉడకబెట్టిన బంగాళాదుంప-ఒకటి (తరిగి), కీరకాయ-ఒకటి, వాటర్‌ చెస్ట్‌నట్స్‌ (శింఘారా)- ఐదు(ఉడకబెటి పైనున్న తొక్క తీసి సన్నటి ముక్కలుగా చేయాలి), కొత్తిమీర-గుప్పెడు (తరుగు), పచ్చిమిర్చి- ఒకటి (సన్నటి ముక్కలుగా తరిగి), బాగా వేగించిన పల్లీలు- ఒక టేబుల్‌స్పూను, జీలకర్ర పొడి- అర టీస్పూను, జీలకర్ర-అర టీస్పూను, నూనె- ఒక టీస్పూను, చక్కెర-రుచికి సరిపడా, ఉప్పు-తగినంత.
తయారీ:
 •  బాగా లోతుగా ఉండే సలాడ్‌ బౌల్‌లో గడ్డ పెరుగును తీసుకుని చిక్కగా చేయాలి.
 •  అందులో జీలకర్ర పొడి, ఉప్పు, చక్కెర, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి.
 • తర్వాత రెడీగా పెట్టుకున్న కూరముక్కలు, పల్లీలు అందులో వేసి బాగా కలపాలి.
 • ఇలా తయారైన రైతాను ఫ్రిజ్‌లో ఉంచాలి.
 • రైతాను తాగాలనుకునే ముందు చిన్న మూకుడులో కొద్దిగా నూనె వేసి జీలకర్ర వేయాలి.
 •  చిటపటలాడుతున్న జీలకర్రను కూల్‌ కూల్‌గా ఉన్న రైతాపై చల్లాలి.
 • రెడీగా ఉన్న కొత్తిమీరను రైతాను దాని మీద చల్లి కొద్ది కొద్దిగా సిప్‌ చేస్తూ తాగితే శరీరానికి కొత్త శక్తి వచ్చినట్టు ఉంటుంది.

సాబుదానా కిచిడి
 
కావలసినవి: సగ్గుబియ్యం- రెండు కప్పులు, వేగించిన పల్లీలు- అర కప్పు, పచ్చిమిర్చి- ఆరు, నూనె- పావు కప్పు, కొత్తిమీర తరుగు- గుప్పెడు, పసుపు, ఉప్పు- తగినంత, టొమాటో, బంగాళాదుంప-చెరొక్కొక్కటీ (పెద్దవి).
తయారీ:
 •  సగ్గుబియ్యాన్ని బాగా కడిగి నీరు లేకుండా డ్రై చేసి గంటపాటు అలాగే ఉంచాలి.
 •  వేగించిన పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి గ్రైండ్‌ చేయాలి. ఈ పొడిలో నీళ్లు కలపొద్దు.
 •  ఆరబెట్టిన సగ్గుబియాన్ని పల్లీ, మిర్చీపొడితో బాగా కలపాలి.
 • పాన్‌లో నూనె పోసి అది వేడెక్కిన తర్వాత అందులో ఈ మిశ్రమాన్ని వేసి సన్నని మంటపై అరగంటసేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో దీన్ని కలపడం మరవొద్దు.
 •  బంగాళాదుంప తరుగు, టొమాటో ముక్కలు ఇందులో వేయాలి.
 •  రెడీ అయిన సాబుదానా కిచిడీపై కొత్తిమీర తురుము చల్లి పెరుగుతో వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
సొరకాయ హల్వా
 
కావలసినవి: పాలు- అర లీటరు (చిక్కటివి), తొక్క తీసిన సొరకాయ-అర ముక్క, చక్కెర- మూప్పావు కప్పు, కోవా-వంద గ్రాములు, ఏలకుల పొడి-ఒక టీస్పూను, డ్రై ఫ్రూట్స్‌- ఒక టేబుల్‌స్పూను (బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పులు).
తయారీ:
సొరకాయపై నుండే తొక్క తీసేసి సన్నగా తురమాలి.
చాలా కొద్ది నీళ్లల్లో సొరకాయ తరుగును ఉడకబెట్టాలి.
 మెత్తగా ఉడికిన సొరకాయ తరుగులోంచి నీళ్లను పూర్తిగా తీసేయాలి.
 స్టవ్‌ మీద పాన్‌ పెట్టి అందులో పాలు పోసి సన్నని మంటపై 20 నిమిషాలు ఉడకనివ్వాలి.
మెత్తగా ఉడికిన సొరకాయ తురుమును అందులో వేసి బాగా సెమి-సాలిడ్‌ రూపుకు వచ్చేదాకా (అంటే దాదాపు 20 నిమిషాలు)ఉడకనివ్వాలి.
అదే సమయంలో కోవాను తురిమి దాన్ని కూడా పాన్‌లో వేసి బాగా కలపాలి.
 ఆ తర్వాత చక్కెర వేసి అందులో బాగా కరగనివ్వాలి.
చివరిగా ఏలకుల పొడి, డ్రైఫ్రూట్‌ ముక్కలను అందులో వేయాలి.
 సొరకాయ హల్వా రెడీ.
 
పెసర వేపుడు
 
కాలసినవి: పెసరపప్పు- ఒక కప్పు, నీళ్లు- మూడు కప్పులు, పాలకూర- రెండు టేబుల్‌స్పూన్లు (ఆకులు సన్నగా తరిగి), నూనె- ఆరు టేబుల్‌స్పూన్లు, ఆవాలు- ఒక టేబుల్‌స్పూను, ఎండు మిర్చి-తగినంత, ఉప్పు-తగినంత.
తయారీ:
 •  పెసరపప్పును ముద్దగా కాకుండా సరైన పదునులో ఉడకబెట్టాలి.
 • ఉడికిన పప్పును పక్కన పెట్టాలి.
 • పాన్‌ తీసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో నూనె పోయాలి.
 • ఆవాలు, ఎండుమిర్చి, పాలకూర తురుము వేసి వేగించాలి.
 • అది సరిగా వేగిన తర్వాత అందులో ఉడికిన పప్పును, తగినంత ఉప్పును వేయాలి.
 • అలాగే దీంట్లో కొద్దిగా నిమ్మరసం కూడా పిండి పెసర ఫ్రైని బాగా కలపాలి. పెసర వేపుడు రెడీ.

ఆలూ మఖానా సబ్జి
 
కావసినవి: బేబీ బంగాళాదుంపులు- ఒక కప్పు, పూల్‌ మఖానా-(తామరగింజలు) ఒక కప్పు, జీలకర్ర- ఒక టీస్పూను, సోంపు- ఒక టీస్పూను, పచ్చిమిర్చి-2 (సన్నగా తరిగి), కారం- ఒకటిన్నర టీస్పూను, పసుపు- అర టీస్పూను, ధనియాలపొడి- ఒక టీస్పూను, ఉప్పు- తగినంత, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ:
 •  బేబీ బంగాళాదుంపల్ని నీళ్లల్లో ఉడకబెట్టాలి. తర్వాత వాటిపైనున్న పొట్టు తీయాలి.
 •  బాగా లోతున్న పాన్‌ తీసుకని నూనె పోసి వేడెక్కాక అందులో మఖానా వేసి క్రిస్పుగా రోస్టు కానివ్వాలి. అది రెడీ అయిన తర్వాత విడిగా ఒక ప్లేటులో తీసిపెట్టుకోవాలి.
 •  పాన్‌లో నూనె వేసి అందులో జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. అందులో సోంపు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగించాలి. తర్వాత అన్ని మసాలాలు ఇందులో వేసి బాగా కలపాలి.
 •  తర్వాత ఉడకబెట్టిన బేబీ బంగాళాదుంపలను ఇందులో వేగనివ్వాలి.
 • బంగాళాదుంపలకు మసాలా బాగా పట్టిన తర్వాత రోస్టెడ్‌ మకానాను అందులో మళ్లీ ఇంకోసారి కలపాలి.
 •  మంటను తగ్గించి నాలుగు నిమిషాల పాటు బంగాళాదుంపలను చిన్న మంటపై టోస్ట్‌ చేయాలి.
 •  స్టవ్‌ మీద నుంచి దించి దానిపై కొత్తిమీర చల్లి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.

మిక్స్‌ ఫ్రూట్‌ స్మూతీ
 
పళ్లతో చేసిన పదార్థాన్నే తిందామనుకునే భక్తులకు మిక్స్‌ ఫ్రూట్‌ స్మూదీ చాలా మంచిది.
కావలసినవి: అరటిపండు- ఒకటి, ఆపిల్‌- ఒకటి, మామిడిపండు- ఒకటి, దానిమ్మ- ఒకటి, పెరుగు- అరకప్పు, తేనె లేదా చక్కెర- ఒక టీస్పూను.
తయారీ:
 •  బ్లెండర్‌ తీసుకుని అందులో పైన పేర్కొన్న పండ్ల ముక్కలను (మీకు నచ్చిన మరేవైనా పళ్లను కూడా ఇందులో కలుపుకోవచ్చు), తేనె లేదా చక్కెర, ఐస్‌క్యూబ్స్‌ వేసి బ్లెండ్‌ చేయాలి.
 •  దీనికి పెరుగును జోడించి మళ్లీ రెండు నిమిషాలసేపు బ్లెండర్‌లో వేసి కొట్టాలి.
 •  తర్వాత జల్లెడతో ఒడగట్టి గ్లాసులో పోసి కొన్ని ఐస్‌ క్యూబులు వేసుకుని తాగితే చిల్‌ మంటూ స్మూదీ గొంతులోంచి దిగుతూ హాయిగా ఉంటుంది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.