ఎనిమిదేళ్లకే ఎడిటర్‌!
09-02-2018 22:51:35
క్రీడలు, కళలు వంటి పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారుల గురించి మనం తరచూ వింటున్నాం. వారు చేసే అద్భుతాలను ఆశ్చర్యంగా చూస్తాం. ఈ కోవలోనే ఆస్ట్రేలియాకు చెందిన ‘రొక్సానే’ కూడా చిన్న వయసులోనే ఒక పత్రికకు ఎడిటర్‌గా పనిచేసి రికార్డు సృష్టించింది.
 
పత్రికా ఎడిటర్‌గా పనిచేయటానికి వయసు అడ్డంకి కాదని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందిన రొక్సానే అనే 8 ఏళ్ల బాలిక. చాలా చిన్న వయసులోనే ‘ఇట్‌గర్ల్‌’ అనే పత్రికకు ఆమె ఎడిటర్‌గా పనిచేస్తోంది. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన పత్రికా ఎడిటర్‌గా రికార్డు సృష్టించింది. ఇట్‌గర్ల్‌ పత్రిక ప్రతులు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో బాగా అమ్ముడవుతాయి.
 
ఇట్‌గర్ల్‌ పత్రిక చిన్న పిల్లలతోనే వారికి సంబంధించిన విషయాలు రాయించాలనుకుంది. ఆ అవకాశం 8 ఏళ్ల రొక్సానేకు దక్కింది. ఆమె ఎడిటర్‌గా తొలి సంచిక గత ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చింది. ఎడిటర్‌గా ఆమె పలు రకాల బాధ్యతలు నిర్వహించారు. ఎడిటోరియల్‌ కాన్సెప్ట్‌ను రూపొందించటం, మార్కెట్‌ రీసెర్చి, సంపాదకీయం రాయటం, ప్రింటింగ్‌కు ముందు పత్రికను సమీక్షించటం, మ్యాగజైన్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం, రకరకాల ఐడియాలు, క్విజ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రక రకాల వ్యక్తులను ఇంటర్యూ చేసింది. ఎడిటర్‌గా పలు రకాల బాధ్యతలను రొక్సానే సమర్థవంతంగా నిర్వహించి మన్ననలు పొందుతోంది. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు. విద్యార్థినిగా, ఎడిటర్‌గాను మంచి పేరుతెచ్చుకుంది.
 
‘‘ఇట్‌గర్ల్‌ పత్రికకు ఎడిటర్‌గా పనిచేయటాన్ని నేను చాలా ఆనందించాను. నాకు ఏదైనా కొత్త పనిలో పాలు పంచుకోవాలి, సాధించాలి, గుర్తింపు తె చ్చుకోవాలనే కోరిక ఉండేది. ఈ పత్రిక చిన్న పిల్లల గురించి రాస్తుంది. నాకు స్కూల్లో వ్యాసరచన పోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను రోజంతా నా ఈడు పిల్లలతో గడుపుతాను కాబట్టి చిన్న పిల్లలకు ఎలాంటి సమాచారం కావాలి, వారు ఏం కోరుకుంటున్నారు అనే విషయం నాకు తెలుసు’ అని ముద్దు ముద్దుగా వివరించింది రొక్సానే.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.