ADVT
ఎట్టకేలకూ కేంద్రాన్ని ఒప్పించిన సుజనాచౌదరి
09-02-2018 22:26:40
న్యూ ఢిల్లీ: ఏపీ ఎంపీల పోరాటం కొంతమేరకు ఫలించింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి గత మూడు రోజులుగా కేంద్రంలో ముఖ్యమైన వారితో వరుసగా భేటీ అయి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని క్లుప్తంగా వివరించి ఆపదలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌‌ను ఆదుకోవాలని కోరారు. ఆఖరికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో కూడా వాగ్వాదానికి దిగినట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
 
ఫలించిన చర్చలు..
శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పియూష్ గోయల్‌‌, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో అత్యవసరంగా భేటీ అయిన సుజనా చౌదరి ఏపీకి రావాల్సిన నిధుల విషయమై ఆఖరి సారిగా అడిగి తేల్చేశారు. సుజనా ముమ్మర ప్రయత్నాలు, సుదీర్ఘ చర్చలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టకేలకు సుజనా ఒప్పించారు. శుక్రవారం రాత్రి రెండున్నరగంటల పాటు పార్లమెంట్ వేదికగా చర్చలు ఉత్కంఠగా కొనసాగాయి. ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, సంస్థలు, రైల్వేజోన్‌ ప్రకటన, దుగరాజపట్నం పోర్టు లాంటి అంశాలపై కీలక చర్చలు జరిగాయి.
 
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం 
పార్లమెంట్‌ నిబంధనల ప్రకారం పలు మంత్రిత్వశాఖల అంశాల ప్రస్తావన చేయకూడదని జైట్లీ స్పష్టం చేశారు. అయితే రెండో దశ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం లోపు అన్ని ప్రకటనలు పూర్తిచేసి కార్యాచరణకు వెళ్లాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఏపీ రెవెన్యూలోటు భర్తీకి సమావేశంలో అంగీకారం లభించింది. 14వ ఆర్థికసంఘం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన మొత్తం నిధులు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మూడేళ్ల నుంచి రావాల్సిన నిధులు త్వరలో ఏపీకి అందనున్నాయి. మిగిలిన మొత్తాన్ని ప్రతి యేటా విడుదల చేయాలని కేంద్రం అంగీకరించింది.
 
ఒకేసారి ఇచ్చేందుకు..
హోదా వల్లే వచ్చే నిధుల మొత్తాన్ని ఒకేసారి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రులు సుజనాకు వివరించారు. ఈఏపీ నిధులు కూడా సర్దుబాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి ఇస్రో అభ్యంతరం తెలిపడంతో.. మరోచోట పోర్టు నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చింది. పెట్రో కెమికల్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు 12 శాతం నుంచి సాధ్యమైనంత ఐఆర్‌ తగ్గించుకోవాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీచేయనున్నట్లు కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే ఇంట‌ర్ ఆఫీస్ మెమోను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని నిర్ణయం తీసుకుంది.
 
త్వరలో ఏపీకి రానున్న ప్రకటనలివే..
ప్రభుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యంతో క‌డ‌ప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 12 నాటికి మెకాన్‌ సంస్థ నివేదిక సిద్ధం చేయనుంది. ఇవన్నీ అటుంచితే త్వరలో రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు కేంద్రం సంచలన ప్రకటన చేసింది. అయితే ఇది విశాఖ రైల్వే జోనా లేకుంటే మరొకటా అనే విషయం మాత్రం కేంద్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అమ‌రావ‌తి నిర్మాణానికి చేసిన ఖ‌ర్చు వివ‌రాలు పంపితే నిధులు విడుద‌ల చేయాల‌ని కేంద్రం నిర్ణయించింది. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల ఇబ్బంది లేకుండా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని... పోలవరంను అనుకున్న సమయానికి పూర్తిచేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.