ఏపీ ఎంపీలను లెక్కచేయని కేంద్రం!
09-02-2018 20:06:02
ఢిల్లీ: ఐదు రోజులుగా ఉభయసభల్లో టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన బూదిదలో పోసిన పన్నీరైంది. ఐదు రోజులుగా వివిధ రూపాల్లో టీడీపీ ఎంపీలు చేస్తున్న నిరసనను కేంద్రం పట్టించుకోలేదు. టీడీపీ ఎంపీల ఆందోళనతో గురువారం సాయంత్రం లోక్‌సభలో ఏపీ సమస్యలపై మాట్లాడారు. ‘మై ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని సంబోధిస్తూనే, ‘ఏపీ పట్ల మాకు చాలా సానుభూతి ఉంది’ అంటూనే జైట్లీ మొండిచేయి చూపించారు. దీంతో టీడీపీ, వైసీపీ ఎంపీలు ఒక్కసారిగా ‘వియ్‌ వాంట్‌ జస్టిస్‌’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంట్‌లో జరుగుతున్న తీరుపై దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎంపీల టచ్‌లో ఉంటూ... వారికి అక్కడి నుంచే దిశానిర్ధేశం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఉభయసభలు వాయిదా పడుతాయనే ఉద్దేశంతో టీడీపీ ఎంపీలు తమ ఆందోళనను ఉధృతం చేశారు.
 
ఈ రోజు జైట్లీ రాజ్యసభలో కీలక ప్రకటన చేస్తారని భావించారు. ఈ రోజు మధ్యాహ్నం అరుణ్‌ జైట్లీ, అమిత్‌షాతో కేంద్రమంత్రి సుజనాచౌదరి మంతనాలు చేశారు. రాజ్యసభలో ప్రకటనలో ప్రస్తావించే అంశాలపై సుజనా సుదీర్ఘ చర్చించారు. అయితే రాజ్యసభలో జైట్లీ కీలక ప్రకటన చేస్తారని టీడీపీ ఎంపీలు ఆశగా ఎదురుచూశారు. రాజ్యసభలోనైనా మార్పు వస్తుందని వారు ఆశించారు. అయితే వీరి ఆశలపై జైట్లీ నీళ్లు చల్లారు. ఎలాంటి ప్రకటన చేయకపోగా పాత పాటే పాడారు. లోక్‌సభలోని సీన్‌ రాజ్యసభలోనూ పునరావృతమైంది. లోక్‌సభలో చెప్పిన విషయాలనే రాజ్యసభలోనూ మళ్లీ సేమ్‌ టూ సేమ్ రిపీట్ చేశారు. జైట్లీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఎంపీలు తీవ్ర నిరాశకు గురయ్యారు. టీడీపీ ఎంపీల ఆందోళనను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఐదు రోజులుగా టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళన బూడిదలో పోసిన పన్నీరైందని పలువురు చర్చించుకుంటున్నారు.
Tags : Arun Jaitley, TDP, 2018 budget, Central Governament
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.