చిరుత పులులకు మైక్రో చిప్‌లు పెట్టినవేళ...సంచలన నిజం వెల్లడి
09-02-2018 08:02:43
మైసూర్ : చిరుతపులులు మనుషుల నివాస ప్రాంతాల్లో సంచరిస్తున్నాయనే సంచలన వాస్తవం తాజాగా వెలుగుచూసింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలో ఉన్న 24 చిరుతపులులకు మైక్రో చిప్ లు ఏర్పాటు చేయడంతో ఆయా చిరుతల కదలికలు వెలుగుచూశాయి. సెంట్రల్ జూ అథారిటీ నిబంధనల ప్రకారం చిరుత పులుల సంచారాన్ని పర్యవేక్షించేందుకు వన్యప్రాణి పరిరక్షణ శాఖ అధికారులు మైక్రోచిప్ లను ఏర్పాటు చేశారు. మైసూర్ తాలూకాలో ఆరు చిరుత పులులు మూడేళ్లుగా సంచరిస్తున్నాయని మైక్రోచిప్ ల ద్వారా తేలింది. నంజన్ ఘడ్ తాలూకాలో 9 చిరుతలు, హెచ్ డీ కోటే తాలూకాలో 9 చిరుతలు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. దేశంలో 7,700 చిరుతలుండగా ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే 1225 ఉన్నాయని మైసూర్ జూ డైరెక్టరు రవిశంకర్ వెల్లడించారు. వ్యవసాయ పొలాలు ప్లాట్లుగా మారడంతోపాటు ఆహార వ్యర్థాలు బయటపడేస్తుండటంతో వాటిని తినేందుకు కుక్కలు వస్తున్నాయి. ఆ కుక్కలను వేటాడేందుకు చిరుతలు నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయని అటవీశాఖాధికారులంటున్నారు. మొత్తంమీద నివాసప్రాంతాల్లో చిరుతపులులు తిరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
----
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.