ADVT
పాద పూజా వైభవం
09-02-2018 01:25:20
‘‘నీ పాద కమల సేవయు
నీ పాదార్చకుల తోడనెయ్యమును నివాం
తాపార భూత దయయును
తాపస మందార నాకు దయచేయగదే’’
 
పోతన భాగవతంలోని ఈ పద్యం ప్రసిద్ధమైంది. భగవద్వర్ణన చేసేటప్పుడుగానీ, నమస్కరించేటప్పుడుగానీ స్వామి దివ్య పాదారవిందాల యందే మన మనస్సును లగ్నం చేయటం ఒక ఆచారం. భగవద్వర్ణన , మనుష్య వర్ణనలను ఎట్లా ఆరంభించాలనేదానిపై మన పూర్వులు ఒక నియమం ఏర్పరచినారు.
 
చిరంతన స్యాసితథా శివచంద్రస్య బాలతా
మానవా మౌళితో వర్ణ్యాదేవాశ్చరణతః పునః
(అలంకార శేఖరం)
వర్ణించేటప్పుడు మానవుణ్ణి శిరస్సు నుండి, దేవతలను పాదాల నుండి అనేది ఈ నియమం. అందుకే- ‘చరణౌ శరణం ప్రపద్యే’ అంటాం. స్తోత్రాల్లోను, శతకాల్లోను ఇట్లా పాద శరణ ప్రసక్తి ప్రభావాలు అధికం. సంస్కృతంలో వచ్చిన స్తోత్ర సాహిత్యం భగవత్‌ పాద వైభవాన్ని విశేషంగా తెల్పింది. ప్రత్యేకంగా పాద స్తుతి రచనలు వచ్చినాయి.
ఉదాహరణకు.. శ్రీరామ పాద స్తుతి,.మూక పండితుని ‘పంచశతి’లోని పాదారవింద శతకం కేవలం కంచి కామాక్షీ దేవి పాద వర్ణనకే రచించబడింది. శంకరాచార్యులవారి ‘పాదావికేశాంతస్తవంలోనూ.. పాద మహిమాభి వర్ణన ఉంది. పాదపూజ- పాద పవిత్రత యింత గొప్పది కాబట్టే- పూర్వ పూర్వులైనవారు, యోగ్యులైనవారికే పాదాభివందనం చేయవలెనన్నారు. కాని ఈ రోజుల్లో అనేక రకాలుగా, అనేక వ్యక్తుల పాదాలను పట్టి నమస్కారాలను పెట్టడం ఆనవాయితీ అయింది. వివాహ సమయంలో వరుణ్ణి ‘లక్ష్మీనారాయణ స్వరూపునిగా అర్చించి’ పాద ప్రక్షాళనం చేస్తారు.
- శ్రీరంగాచార్య

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.