ADVT
ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌వర్డ్స్ ఇవేనట..!
06-02-2018 10:14:08
మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ ఏంటి.. ‘అబ్బా...అడగ్గానే చెప్పేస్తారా? పాస్‌వర్డ్‌ సీక్రెట్‌గానే ఉండాలి’... ఎవరైనా చెప్పే సమాధానం ఇదే. అయితే, మీ గురించి ఎంతోకొంత తెలిసినవారికి, మీ పాస్‌వర్డ్‌ను ఊహించడం అంత కష్టమేం కాదు. మొబైల్‌ఫోన్‌, లాప్‌టాప్‌, ఈమెయిల్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, డోర్‌ లాక్‌, బీరువా లాక్‌, డిజిటల్‌ లాకర్‌, వైఫై, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌... ఇలా చాలా చోట్ల పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తుంటాం. ఎన్నని గుర్తుపెట్టుకోగలం? దీంతో, చాలామంది తేలిగ్గా ఉండే పాస్‌వర్డ్‌లపైనే ఆసక్తి చూపుతున్నారని ‘స్ప్లాష్‌ డేటా’ అనే ఆన్‌లైన్‌ సంస్థ వెల్లడించింది. సైబర్‌ నేరాలు పెరిగిపోడానికి పరమచెత్త పాస్‌వర్డ్సే కారణమని తేల్చింది. అస్సలు పెట్టకూడని కొన్ని ‘బ్యాడ్‌ పాస్‌వర్డ్స్‌’ గురించి కూడా నివేదించింది. ఆ విశేషాలు....
 
 • ‘123456’... ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌వర్డ్‌ ఇది. ఆరు అక్షరాల పాస్‌వర్డ్‌ అనగానే మరో ఆలోచన లేకుండా ఒకటి నుంచి ఆరు దాకా వరుస అంకెలను దడదడా కొట్టేస్తున్నారు చాలామంది.
 •  రెండో అతిచెత్త పాస్‌వర్డ్‌... పి.ఎ.ఎస్‌.ఎస్‌.డబ్ల్యు.ఒ.ఆర్‌.డి - పాస్‌వర్డ్‌ ! పాస్‌వర్డ్‌ అనే పదాన్నే పాస్‌వర్డ్‌గా పెడుతున్నారు మహా మేధావులు.
 •  ‘12345678’... ఆరంటే ఆరు అంకెలు పెట్టడం భావ్యం కాదని భావించిన కొందరు, మహా తెలివిగా పెడుతున్న పాస్‌వర్డ్‌. ఇది అత్యంత చెత్త పాస్‌వర్డ్‌గా మూడో స్థానాన్ని సంపాదించింది.
 •  qwerty... కీబోర్డులో వరుసగా ఉండే అక్షరాలివి. దీన్నే చాలామంది పాస్‌వర్డ్‌గా వాడుతున్నారు. అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లలో ఇదో నాలుగో స్థానం పొందింది.
 • ‘12345’ ఐదో స్థానాన్ని, ‘123456789’ ఆరోస్థానాన్ని, ‘1234567’ ఎనిమిదో స్థానాన్ని పొందాయి.
 • ‘వాట్‌ఎవర్‌’ (ఏదైతే ఏం!)... బ్యాడ్‌ పాస్‌వర్డ్స్‌ లిస్టులో ఏడో స్థానాన్ని ఆక్రమించింది.
 • ‘111111’ తొమ్మిదో స్థానంలో ఉండగా, ‘డ్రాగన్‌’ పదో స్థానాన్ని పొందింది.
బ్యాడ్ పాస్‌వర్డ్స్‌లో మరికొన్ని 
 • ఐలవ్‌యూ, హలో, ఫ్రీడమ్‌, మంకీ, ట్రస్ట్‌నెంబర్‌1... ఎక్కువ మంది వాడుతున్న అతితేలికైన పాస్‌వర్డ్స్‌ జాబితాలో ఉన్నాయి. వీటిని పెట్టేవారి మాటల్లోనూ ఈ పదాలు దొర్లుతూ ఉంటాయి.
 • నెటిజన్లలో మూడు శాతం మంది అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు. వీరిలో చాలామంది హ్యాకింగ్‌లూ, సైబర్‌ క్రైమ్‌లూ తమదాకా రావనే ధీమాతో ఉంటారు.
 • ప్రతి పదిమందిలో ఒక్కరు 25 బ్యాడ్‌ పాస్‌వర్డ్‌లలో (‘స్ల్పాష్‌ డేటా’ నివేదిక లోనివి) ఏదో ఒకదాన్ని ఉపయోగిస్తున్నవారే!
 • దాదాపు 50 లక్షల మందికి సంబంధించిన డేటా లీకవుతోంది. దీనికి ప్రధాన కారణం మంచి పాస్‌వర్డ్స్‌ లేకపోవడమే.
 • 40 శాతం మంది నెటిజన్లు ఒకసారి పాస్‌వర్డ్‌ పెడితే, మళ్లీ దాన్ని మార్చుకోవడానికి అస్సలు ఆసక్తి చూపరు.
 • 60 శాతం మంది ఒకే పాస్‌వర్డ్‌ను నాలుగైదు చోట్ల (ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, జీమెయిల్‌ వంటి ఖాతాలన్నింటికీ) ఉపయోగిస్తున్నారు.
 • 90 శాతం మంది ఉద్యోగుల పాస్‌వర్డులు కేవలం ఆరుగంటల్లోనే హ్యాకింగ్‌కు గురవుతున్నాయి.
 • కేవలం 37 శాతం మంది మాత్రమే నెలకోసారి పాస్‌వర్డ్‌ మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
 • కుటుంబ సభ్యుల పేర్ల కంటే, పెంపుడు జంతువుల పేర్లనే పాస్‌వర్డ్‌గా పెట్టడానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.
 • 28.6 శాతం మంది ‘రిమెంబర్‌ మై పాస్‌వర్డ్‌’ ఫంక్షన్‌ను వాడుతున్నారు. మరిచిపోతామనే భయంతోనూ, మళ్లీ మళ్లీ పాస్‌వర్డ్‌ టైపు చేయడం ఇష్టం లేకా... ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
 • అత్యంత గోప్యంగా ఉంచాల్సిన డాక్యుమెంట్లను సేవ్‌ చేసేటప్పుడు, చాలామంది ‘మ్యారీమీ’, ‘లవ్‌యూ’, ‘ఎటర్నిటీ’... వంటి రొమాంటిక్‌ పాస్‌వర్డులను పెడుతున్నారు.
 • 25 శాతం మంది తమ ఇంటిపేరుని పాస్‌వర్డ్‌లో వాడుతున్నారు.
 • కేవలం ఆరు అక్షరాలతో పాస్‌వర్డులు పెడుతున్నవారు 25 శాతం మంది కాగా, 8 అక్షరాలతో పాస్‌వర్డులు పెడుతున్నవారు 20 శాతం మంది, 7 అక్షరాలతో 19 శాతం మంది, 9 అక్షరాలతో 12 శాతం మంది, 10 అక్షరాలతో 9 శాతం మంది పాస్‌వర్డులు సృష్టించుకుంటున్నారు.
 • 11 అంతకంటే ఎక్కువ అక్షరాలతో పాస్‌వర్డులు పెడుతున్నవారు 7 శాతం మాత్రమే!
 
ముగింపు:
పాస్‌ వర్డ్‌ అండర్‌వేర్‌ లాంటిది. పాతబడగానే మార్చేయాలి. మరొకరిది అస్సలు ఉపయోగించకూడదు. ఇంకొకరితో పంచుకోకూడదు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.