పుట్టడమే శంఖ, చక్ర, గదాపద్మాలతో..
21-01-2018 03:31:21
దశావతారాల్లో శ్రీకృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం. అవతారాలన్నీ గొప్పవే అయినప్పటికీ వాటన్నిటిలోకీ గొప్పగా స్తుతించబడే పరిపూర్ణమైన కృష్ణావతారంలో సమస్తం లీనమవుతాయి. అన్నీ ఆయనలోకి వెళ్లిపోతాయి. అందుకే అన్ని మాట్లు విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆయన ఆవిర్భావమే చాలా ఆశ్చర్యకరం. మిగిలిన అవతారాల్లో పుట్టిన తర్వాత మాత్రమే లీలలు ఉంటాయి. కృష్ణావతారంలో ఆయన పుట్టడమే ఒక లీల. ఆ మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మ చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని అనుభవించడం కోసం వచ్చిన ఒక సంఘటన కాదు. పరమేశ్వరుడు తనంత తాను కల్పించుకుని లోకానికి ఒక పాఠం నేర్పడానికి చేసిన లీల. రామావతారంలో ఆయన ఎక్కడా శంఖచక్రాలతో, చతుర్భుజాలతో కనపడలేదు. కృష్ణావతారంలో మాత్రం పుడుతూనే నీలమేఘం వంటి శరీరఛాయతో శంఖ, చక్ర, గదాపద్మాలతో కూడుకున్నవాడై, కటిక చీకటితో ఉన్న కారాగారంలో భాసించాడు.
 
వసుదేవుడు పిల్లవాణ్ని చూసి ఆశ్చర్యపోయి.. ‘సర్వము నీలోనిదిగా సర్వాత్ముడ’ అంటూ స్తోత్రం చేశాడు. అనంతరం ఆ పరమాత్మ ఆనతి మేరకు నందవ్రజంలో వదిలిపెట్టేందుకు ఆ పిల్లవాణ్ని తీసుకుని బయలుదేరాడు వసుదేవుడు. పూర్వం సముద్రం శ్రీరామచంద్రుడికి దారి ఇచ్చినట్లుగా.. కృష్ణ పరమాత్ముని తల మీద పెట్టుకుని వస్తున్న వసుదేవునికి యమునా నది దారిచ్చింది. ఇక నందవ్రజంలో రాక్షస సంహారం, కాళీయ మర్దనం, గోవర్ధనగిరినెత్తడం.. ఇలా ఎన్నో లీలలు ప్రదర్శించిన శ్రీకృష్ణుడు పెద్దవాడైన తర్వాత పాండవులకు ఎంత రక్షణ చేస్తాడో. కృష్ణపరమాత్మ లేకపోతే పాండవులు లేరు. ఎన్ని సందర్భాల్లో వారిని రక్షించాడో! అయితే, పాండవులను రక్షించినందుకు ఆ స్వామి గాంధారి వలన శాపాన్ని పొంది అవతారపరిసమాప్తి చేయాల్సి వచ్చింది.
-చాగంటి కోటేశ్వరరావు శర్మ
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.