దుర్యోధన, దుశ్శాసనుల ముందు నిలిపితే..
20-01-2018 01:48:51
ప్రతి వ్యక్తి హృదయంలో సుడిగుండం ఉంటుంది. అది వ్యక్తమైనప్పుడు దాన్ని ఎదుర్కోలేక మనిషి సతమతమవుతాడు. కొన్ని సందర్భాల్లో కుప్పకూలుతాడు. అలాంటిదే అర్జునుడికి ఎదురైంది. మహాభారత సంగ్రామంలో యోధులందరినీ చూడాలనుకున్న పార్థుడి రథాన్ని శ్రీకృష్ణుడు భీష్మద్రోణుల ఎదుట నిలిపాడు. ఇది అత్యంత సున్నితమైన స్థానం. రథాన్ని దుర్యోధన దుశ్శాసనుల ముందు నిలిపి ఉంటే వాళ్లను చూసిన అర్జునుడిలో కోపం దావాగ్నిలా చెలరేగి ఉండేది. అదే, ఒకవేళ రథాన్ని పాండవుల ఎదుట నిలిపి ఉంటే తమకు జరిగిన అవమానాలు, కష్టాలను స్మరించుకుని బడబాగ్నిలా కదనరంగంలోకి ఉరికేవాడు. ఈ రెండు స్థానాలూ అర్జునుడిలో లోతుగా దాగున్న వ్యక్తిత్వాన్ని బయటపెట్టలేవు. భీష్మద్రోణులను చూసిన అర్జునుడిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఏం చేయాలో తోచట్లేదు. చుట్టూ అంతా శూన్యంగా కనపడుతోంది. లోపల ఆలోచన సంఘర్షణ, తట్టుకోలేని భావోద్వేగం.. ఇలా అన్నీ ఒక్కసారిగా అర్జునుడిని చుట్టుముట్టాయి. అతిరథమహారథులను సైతం ఒంటిచేతితో ఎదిరించే మహాయోధుడు కుప్పకూలి పడ్డాడు. దీనికి కారణం బయట లేదు. తన అంతరంగంలో పుట్టిన మమకారపు జాడ్యమే దానికి కారణం. దానిని ఎదుర్కొనలేకే పార్థుడు తలవంచాడు. ఇలాంటి అనుభవం మన జీవితంలో కూడా ఏదో ఒక రోజు తలెత్తవచ్చు. అయితే, అర్జునుడికి ఆ సమయంలో చెంతనే పరమాత్ముడు ఉన్నాడు. మనకు తోడెవరు? అలా అండగా ఉండేందుకే పరమాత్మ మనకు భగవద్గీతను అనుగ్రహించాడు. ఆ గ్రంథం మనకు అత్యద్భుతమైన సందేశాన్ని, మార్గదర్శకత్వాన్ని అందిస్తూ అన్ని విధాలా రక్షణనిస్తుంది.
-స్వామి పరిపూర్ణానంద
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.