ADVT
లంకయే శరీరం.. సాగరం సంసారం
19-01-2018 03:13:18
శ్లో. దర్వోదగ్ర దశాననేంద్రియ మనోనక్తంచరాధిష్ఠితే దేహేస్మిన్‌ భవ సింధునా పరివృతే దీనాం దశమాస్థితః
అద్యత్వే హనుమత్సమేన గురుణా సంబోధితార్థః సుధీః లంకారుద్ధ విదేహరాజ తనయా న్యాయేన లాలప్యతే
 
ఈ శ్లోకం వేదాంత దేశికాచార్యుల ‘సంకల్ప సూర్యోదయః’ అనే నాటకంలోనిది. ఇందు ‘సుందరకాండ’ పరమార్థం సులభసుందరంగా బోధింపబడింది. లంకయే శరీరం. సాగరం సంసారం. రావణ కుంభకర్ణులు అహంకార మమకారాలు. ఇంద్రజిత్తు, అకంపన, అతికాయాది రావణ పరివారం కామక్రోధాదులు. విభీషణుడు వివేకం. లంకలో రావణునిచే నిర్బంధింపబడిన సీతాదేవి చేతన (జీవ) స్వరూప. హనుమరూప ఆచార్యుని ద్వారా లంకారూప శరీర (దేహాత్మ బుద్ధి) విధ్వంస పూర్వకంగా భగవానుడే జ్ఞానోపదేశం చేయించి చేతనుని (జీవుణ్ణి) ఉద్ధరిస్తాడు. సీతాదేవి లంకలో పతివియోగంతో పరితపిస్తూ సంసారం (జగత్తు)లోని జీవుని దీనస్థితిని తెలియజెప్పింది. సీత లంకా సంబంధమే జీవునికి దేహసంబంధం. వికృత రూపాలతో ఎందరో భయంకర రాక్షసస్త్రీలు ఆమెను చుట్టుముట్టి భయభ్రాంతం చేస్తున్నట్లుగానే అహంకార - మమకార, కామక్రోధ, రాగద్వేషాది అసురభావాలు జీవుణ్ణి పీడిస్తూ బాధిస్తూ ఉన్నాయి. మాయా మారీచుని కారణంగా సీతకు పతివియోగం జరిగినట్లుగా జీవునికి శబ్దస్పర్శాది మాయిక విషయ భోగాసక్తి వలన భగవద్వియోగం కల్గింది. విషయాసక్తుడు భగవద్విముఖుడవుతాడు. మైథిలికి మారుతి దర్శనం వలెనే జీవునికి ఆచార్య-దర్శనం. ఆంజనేయుని రామగుణానువాదం, రామకథాగానం వంటివే భక్తులకు, సాధకులకు పరమ భాగవత - భగవచ్చరిత్ర వర్ణనా ప్రధానాలైన గ్రంథాలు, కథలు, గాథలు, వ్యాఖ్యలు. సీతామాతకు హనుమ ద్వారా రామనామాంకిత ముద్రికా ప్రదానం లాంటిదే జీవులకు గురు కృపాపూర్వక తిరుమంత్ర - రామ మంత్రోపదేశం. వైదేహి లక్ష్మణ దూషణ కారణంగా రామవియోగం పొందినట్లు జీవునికి భాగవత అపచారమే భగవద్వియోగ హేతువు. భగవంతుడు రావణాది శత్రుసంహారం చేసి జానకి చెర విడిపించి అయోధ్యకు తెచ్చినట్లు, తనను శరణన్న భక్తుల వాసనామయ ప్రకృతి బంధాలను తొలగించి వారిని కూడా వైకుంఠధామానికి చేర్చుతాడు. అలా వారికి నిత్యసేవా కైంకర్య భాగ్యం కల్గిస్తాడు. శ్రీ సంప్రదాయ రీత్యా ఈ పరమార్థాలను గ్రహించి అనుభవించు విష్ణు భక్తులకు వారి వారి వాసస్థానమే వైకుంఠధామం.
-తంగిరాల రాజేంద్రప్రసాదశర్మ

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.