ఆగ్రహంలోనూ ఆదరణ
18-01-2018 22:33:46
‘ఆగ్రహించి నిన్ను నేను కొట్టాను. కానీ కటాక్షించి నీ మీద జాలిపడుతున్నాను.’ అంటాడు విశ్వాసితో దేవుడు (యెషయా 60: 10). జాలి, కటాక్షం, కరుణ, ప్రేమ ఉన్న చోట ఆగ్రహం ఉంటుందా అన్నది ప్రశ్న. అవతలి వ్యక్తి మీద పగ తీర్చుకోవడానికి పురికొల్పే ఆగ్రహానికి దేవుడు విశ్వాసుల్లో అనుమతినివ్వలేదు. బైబిల్‌ ఈ విషయాలన్నీ స్పష్టం చేస్తోంది. ‘పగతీర్చుకోవడం నా పని.
 
మీ పని కాదు’ అన్నది దేవుని ఆజ్ఞ!! (రోమా 12: 19-20). మన పట్ల తప్పుగా, అన్యాయంగా ప్రవర్తించిన వారి మీదే కాదు, బద్ధశత్రువుల పట్ల కూడా ఆగ్రహం పనికి రాదనీ, వారితో ఎలా వ్యవహరించాలన్నది తనకు వదిలేసి వారందరినీ క్షమించడమే విశ్వాసి చేయవలసిన పని అనీ దేవుడు స్పష్టం చేస్తున్నాడు. ప్రతీకారేచ్ఛతో రగిలిన వివిధ చక్రవర్తులు, పక్షాలు, సైన్యాలు ఈ మానవచరిత్రను రక్తసిక్తంగా మార్చితే దానికి విరుగుడును దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పంపిన అసమానమైన శాంతి సందేశమిది.
 
‘దేవుని కోపం నిమిషం మాత్రమే! కాని ఆయన దయ ఆయుష్కాలం కొనసాగుతుంది’ అన్నది బైబిల్‌ వివరణ (కీర్తన 30:5). కొన్ని సార్లు ఆయన చూపించే క్షణకాలపు కోపానికే మన జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. అయితే ఆయన దయపొందిన జీవితాల్లో ఆశీర్వాదాలు కూడా అంతే ఘనంగా, అపారంగా, అనూహ్యంగా ఉంటాయి. ‘ఆయనది ప్రతీకారేచ్ఛతో కూడిన ఆగ్రహం కాదు. మనల్ని సరిదిద్దే కోపం’ అన్నది విశ్వాసి జీవితంలో అర్థం చేసుకునే స్థాయికి చేరుకుంటే అసలైన ఆదరణ మనకు లభ్యమవుతుంది.
 
ఆయన సృష్టించిన విశ్వమంతటిలో మనిషే దేవునికి కేంద్ర బిందువు. అందుకే మనిషి తనను తాను సంస్కరించుకొని దేవునికి విధేయుడై మారు మనసు పొందిన ప్రతిసారీ దేవుడు వసించే పరలోకం సంతోషంతో దద్దరిల్లిపోతుందని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు ( లూకా 15 :10). మనిషితో దేవుని అనుబంధం అంత గాఢమైనది. దేవుని బాధ, ఆనందం, మనిషితోనే ముడిపడిన అరుదైన హృదయస్పందన ఆ దేవునిది. దేవుడు దండించినప్పుడు తలవంచిన విశ్వాసి, మరోవైపు ఆశీర్వాదాల వరదలో తడిసి ఆనందిస్తాడు.
  సుశీల్‌సందేశ్‌
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.