ADVT
విలక్షణ గురువు
18-01-2018 22:31:42
ఆధ్యాత్మిక గురువుల్లో ఓషో(ఆచార్య రజనీ్‌ష)ది విభిన్న శైలి. విప్లవాత్మక ఆలోచనలతో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఓషో యోగా, ధ్యానం, జెన్‌, టావోయిజం, తంత్ర, సూఫిజం తదితర అంశాలపై అనేక ప్రసంగాలు చేశారు. బుద్ధుడిని అమితంగా ఇష్టపడే ఓషో తన ప్రసంగాలలో ఎక్కువగా బుద్ధిజం గురించి పేర్కొనేవారు. ఆయన ప్రసంగాలు 600 సంపుటాలుగా రూపొందాయి. ప్రపంచంలోని 50 భాషల్లోకి అనువాదం అయ్యాయి. ‘నా ప్రసంగాలు, రచనలు భవిష్యత్తరాల కోసం’ అని చెప్పిన ఓషో వివిధ అంశాలపై విస్పష్టమైన అభిప్రాయాలు ప్రకటించారు. వాటిలో కొన్ని:
 
స్వాధీనంతో ప్రేమ వికసించదు
‘‘నువ్వొక పుష్పాన్ని ప్రేమిస్తే ఆ పువ్వు అందాన్ని, పరిమళాన్ని ఆస్వాదించాలి.. అంతేకాని పువ్వును కోసుకోవాలని చూస్తే మరుక్షణం ఆ పువ్వు మరణిస్తుంది. పరిమళం అదృశ్యమౌతుంది. దేన్నైనా స్వాధీనం చేసుకోవాలని మనం చేసే ప్రయత్నాలు అంతిమంగా- అవి మన నుంచి దూరం కావటానికే దోహదం చేస్తాయి. ప్రేమ కూడా అంతే. ఒక యువతితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతావు. నువ్వే ప్రపంచమంటావు. మరుక్షణం ద్వేషిస్తావు. ఇది ప్రేమ ఎలా అవుతుంది? అది ప్రేమ కాదు. స్వాధీనం చేసుకునే ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రేమ వికసించదు’’.
 
డబ్బుకు వ్యతిరేకిని కాదు!
‘‘డబ్బు సంపాదనకు మతాలన్నీ వ్యతిరేకమే. ఎందుకంటే అవి జీవితాలకు కూడా వ్యతిరేకమే గనుక. కాని నేను డబ్బుకు వ్యతిరేకం కాదు. సంగీతం వినాలన్నా, కవిత్వం రాయాలన్నా, మంచి పుస్తకం చదవాలన్నా ఆర్థిక బాధలు ఉంటే అవన్నీ దూరమైనట్లే. అందుకే నా దృష్టిలో డబ్బు సంపాదన అవసరమే. కాని కొందరు ఎంత డబ్బు ఉన్నా నిరంతరం అసంతృప్తితో జీవిస్తుంటారు. కానీ... డబ్బుతో అన్ని సౌకర్యాలూ పొందవచ్చు- ఒక్క ప్రేమ, జ్ఞానం, స్వేచ్ఛ, కరుణ తప్ప.’’
 

ఓషో గురించి...
ఓషో 1931 డిసెంబర్‌ 11న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని హోషంగాబాద్‌ జిల్లాలోని కుచ్‌వాడ గ్రామంలో జన్మించారు. అసలు పేరు చంద్రమోహన్‌జైన్‌. 1956లో ఫిలాసఫీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేశారు. 1958లో జబల్‌పూర్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలోనే అనేక ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. 1974లో పుణేలో ఆశ్రమాన్ని నెలకొల్పారు. తన పేరును ‘ఆచార్య రజనీ్‌ష’గా, అనంతరం ‘ఓషో’గా మార్చుకున్నారు. ఆయనకు వేలమంది శిష్యులు ఏర్పడ్డారు. ఓషో ‘డైనమిక్‌ మెడిటేషన్‌’ విశేష ప్రాచుర్యం పొందింది. విదేశాల నుంచి కూడా భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చేవారు. 1981లో అమెరికా దేశానికి చెందిన ఓషో భక్తులు 64వేల ఎకరాల్లో రజనీష్‌ పురాన్ని నిర్మించారు. ఓషో భారతదేశాన్ని వీడి అమెరికాలో తన కార్యక్రమాలను విస్తరింపజేశారు. అక్కడ నెలకొన్న వివాదాల కారణంగా 1987లో తిరిగి స్వదేశానికి వచ్చి పుణే ఆశ్రమంలో తన కార్యక్రమాలను కొనసాగించారు. 1990 జనవరి 19న ఆయన పరమపదించారు.
                                                                                           పుట్టా శ్రీనివాసరావు

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.