ADVT
దానానికీ అభ్యాసం కావాలి!
18-01-2018 22:29:02
అజ్ఞాతుడు శ్రావస్తి పొలిమేరలో జీవించే ఒక గ్రామవాసి. ఆ గ్రామానికి కొద్దిదూరంలో ఒక మంచి నీటి చెరువు ఉండేది. భిక్ష తెచ్చుకున్న భిక్షువులు మధ్యాహ్నం ఆ చెరువు గట్టు మీద కూర్చొని, తిని, కొద్దిసేపు అక్కడే విశ్రమించేవారు. అది చూసిన అజ్ఞాతునికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వెళ్ళి ఆ ప్రదేశాన్ని చదును చేసి, కూర్చోడానికి వీలుగా రాళ్ళు పరచాడు. భిక్షువులు అజ్ఞాతుణ్ణి అభినందించారు. ఆ ప్రదేశం ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఉంది. ఎండ ఎంత తీవ్రంగా వేసినా భిక్షువులకు ఇబ్బంది ఉండదు. కానీ, ఒక రోజున జోరుగా వర్షం పడింది. భిక్షువులు ఆ వర్షంలోనే తడుస్తూ ఆ చెట్టు క్రిందే తల దాచుకున్నారు. అది చూసిన అజ్ఞాతుడు వెంటనే కలప, ఆకులు, కర్రలు పోగు చేసి తెచ్చాడు. నిట్టాళ్ళు పాతాడు. గాలికీ, వానకీ చెక్కు చెదరని ఒక పర్ణశాల నిర్మించాడు. భిక్షువులు కొన్నాళ్ళు అక్కడే ఉన్నారు. క్రమేపీ భిక్షువుల సంఖ్య పెరిగింది. అప్పటికే ఆ రాజ్యంలో అనాథపిండికుడు, ఆమ్రపాలి, విశాఖలు పెద్ద పెద్ద ఆరామాలు కట్టించారు. ఈ విషయం అజ్ఞాతునికి తెలిసింది.
 
ఆయన వారంతటి ధనవంతుడు కాడు. అయినా తన ‘శక్తి కొలది ఆరామం కట్టించాలి’ అనుకున్నాడు. ఆ చుట్టూ ఉన్న ప్రాంతాన్నంతా చదును చేసాడు. గడ్డిపాకలు ఏర్పాటు చేసి, చక్కని ఆరామాన్ని నిర్మించాడు. ఆరామం అంటే విద్యా ధ్యాన విషయాలు శిక్షణ ఇచ్చే ప్రదేశం, బౌద్ధ గురుకులం. అజ్ఞాతుని దాతృత్వం వల్ల మార్గమధ్యంలో ఉన్న ఒక విశ్రాంతి ప్రదేశం చివరికి విహారంగా మారింది. ఈ విషయం తెలిసి స్వయంగా బుద్ధుడే అక్కడికి వచ్చాడు. ‘‘మనస్సును ప్రశాంతపరిచే అంశాల్లో దానం ఒకటి. దాన గుణం మనలోని దోషాల్ని సైతం క్రమేపీ తుడిచివేస్తుంది. శుద్ధి చేస్తుంది. మొదటిగా గడ్డిపోచతో మొదలుపెట్టి దానగుణాన్ని అభ్యాసం చేస్తే క్రమేపీ అది మనల్ని మహా దాతలుగా మలుస్తుంది. దానం మనకు సహజ నైజంగా రూపొందుతుంది!!’’ అని కొనియాడాడు.
 
 బొర్రా గోవర్ధన్‌

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.