వ్యామోహాల్లో చిక్కకూడదు
18-01-2018 22:28:13
మనస్సు ఏ విధంగా వ్యామోహాలకు లోనవుతుందో, మనస్సును అడ్డం పెట్టుకుని ఏవి మనను పతనం చేసేస్తున్నాయో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మనస్సును అదుపులో పెట్టుకోవడం ఎలాగో ఈ భాగం వింటే అర్థమవుతుంది. చాలా మంది అంటుంటారు.. ‘‘మనసు చెప్పినట్లు వినడం లేదు, కాసేపు ధ్యానం చేద్దామనుకున్నా కుదరడం లేదు’’ అని. దానికి సమాధానం ఇందులో దొరుకుతుంది.
 
శ్రోత్రం చక్షుః స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే!
 
శ్రోతం అంటే చెవి, చక్షుః అంటే కన్ను, స్పర్శనం - చర్మం, రసనం - నాలుక, ఘ్రాణం - ముక్కు.... ఇవి పంచేంద్రియాలు. మొత్తం మోసం చేస్తున్నది ఇవే. అయితే ఇవి వాటంతట అవే మోసం చేయలేవు. వాటంతట అవి ప్రవర్తించవు. మరి ఈ ఐదు వేటిని ఆధారంగా చేసుకుని పని చేస్తున్నాయి? అంటే... మనస్సును ఆధారంగా చేసుకుని పనిచేస్తున్నాయి. ఈ మొత్తం ఇంద్రియ సముదాయం మనస్సును అధిష్ఠానంగా చేసుకుని విషయాలు బోధిస్తున్నాయి. మనస్సు లేకపోతే ఇంద్రియాలు ఏం చేయలేవు. శవంలో లేనిది ఆ మనస్సే. ఆ మనస్సే జీవుడు. ఆ మనస్సే సంకల్పం. ఆ మనస్సుకు మూలమే ప్రాణం.
 
ఇంద్రియాలు కోరే వ్యామోహాల్ని మనం ఆశించి ఎన్ని వంకర పనులు చేస్తామండీ! దాన్నే ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇలా చెబుతున్నాడు. ‘‘ఏముందయ్యా ఇందులో! ఎందుకంత డబ్బు ఆశిస్తున్నావు. ఎందుకా పదవులు? ఎందుకా తప్పుడు పనులు?’’ అంటున్నాడు ధూర్జటి.
 
జాతుల్సెప్పుట, సేవచేయుట, మృషల్‌ సంధించుట న్యాయాప
ఖ్యాతిం పొందుట, కొండెగాడవుట, హింసారంభకుండౌట, మి
ధ్యాతాత్పర్యములాడుటిన్నియు పరద్రవ్యంబునాశించి, యా
శ్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వరా!
 
‘‘జాతి, వంశం గురించి గొప్పగా చెప్పుకోవడం, ఇష్టం లేకపోయినా సేవలు చేయడం, అబద్దాలు ఆడటం, అన్యాయంగా ఖ్యాతిని పొందడం, చాడీలు చెప్పడం, హత్యలు చేయడం, ఏ ఆధారమూ లేనివి చెప్పడం... ఇంత చేసి సంపాదించిన డబ్బులు ఎంత కాలం ఉంటాయి?’’ అని అర్థం. ఆ డబ్బు ఉన్నా నువ్వు ఎంత కాలం ఉంటావు? ఎందుకీ పనిచేస్తున్నావు? నిజమైన ఖ్యాతి పొందే ప్రయత్నం చేయి. నిజాయితీగా ఉండు, చిత్తశుద్ధిగా ఉండు. ఆ చిత్తశుద్ధి నీ జీవితాన్ని బాగు చేస్తుంది.
 
 డా. గరికిపాటి నరసింహారావు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.