ADVT
స్వామి రంగనాథానంద
18-01-2018 22:25:50
శ్రీరామకృష్ణమిషన్‌కి చాలా కాలం అధ్యక్షునిగా వ్యవహరించిన స్వామి రంగనాథానంద శ్రీరమణులను దర్శించుకున్న వారిలో ఒకరు. శ్రీభగవాన్‌ గురించి ఆయన చెప్పిన విషయాలివి.
‘‘నేను శ్రీరమణాశ్రమానికి రెండు సార్లు వెళ్లాను. 1936లో మొదటిసారి వెళ్లాను. ఆశ్రమానికి చేరిన తరువాత అక్కడ మూడు రోజులుండి ఆ తరువాత రైలులో వెళ్లిపోతానని వారికి చెప్పాను. కాని ఆ విషయం మరచిపోయాను. సరియైున వేళకి వారు నా వైపు చూసి నీవు వెళ్లవలసిన వేళ అయింది. నీకోసం బండిని ఏర్పాటు చేశామన్నారు. అంతమంది సందర్శకుల మధ్య ఈ విషయాన్ని వారెట్లా గుర్తుపెట్టుకున్నారో ఆశ్చర్యం వేసింది. వారి గురించి ఏమి చెప్పినా అది అసంపూర్ణంగానే ఉంటుంది. అయినా నాకు తోచినదిది.
 
భాగవతంలో ఒక శ్లోకంలో పుణ్యాత్ముల లక్షణాలు వివరించి ఉంటాయి. పుణ్యాత్ముని పట్ల మమకారం కలిగి ఉండటమే విమోచనం కలిగించ గల శక్తి. అంటే అటువంటి వారు శాంత చిత్తులు, నిశ్చలమైన సముద్రం వంటిది వారి మనస్సు, కరుణాపూరితులు, సకల జీవరాశులకూ హితులు. ఈ అందమైన వర్ణన శ్రీభగవాన్‌కి సరిపోతుంది. వారు అమరులు, నిత్యులు, పరమోన్నతులు అయినా అతి సాధారణుని వలె మనతో మసలేవారు. అరుణాచలంలో వెలసిన జ్యోతికి ఆద్యంతాలు కనుగొనడం అసాధ్యం. అలాగే శ్రీభగవాన్‌ని కూడా అంచనా వేయడం వారు ఎంత ఉన్నతులో, ఎంత గంభీరులో చెప్పలేం. నిత్య సత్యానికి మానవరూపం శ్రీభగవాన్‌. ఒంటరిగా కూర్చున్నా, మౌనముద్రలో ఉన్నా, పేపరు చదువుతున్నా, కూరలు తరుగుతున్నా వారు సంతోషభరితులై ఉండేవారు. ‘‘అహంబ్రహ్మాస్మి’’ అనే వాక్యానికి ప్రత్యక్ష నిదర్శనం వారు. ఆ అనుభవం కలగడం తేలికే అంటారు వారు. నిజమే. దాని కోసం ఏమీ ఆసనాలు వేయక్కర్లేదు. మన భావనల కేంద్రాన్ని మరల్చుకోవాలి. అంతే!
 
రమణమహర్షిని దర్శించాం. భాగవతంలో శకుని గురించి విన్నాం. ఇద్దరికీ ఎంతో పోలిక ఉంది. వారిద్దరూ ఆత్మనిష్ఠులై, ఏ బంధమూ లేక, నిరంతరానంద ముగ్దులై ఉండేవారు. ఇద్దరిలోనూ అవ్యాజమైన ప్రేమ ఉండేది. వారు కడు నిరుపేద కాని ఆనందభరితులు. వారి వెనక ఏ బలగమూ లేదు కాని అపరిమితమైన బలాడ్యులు వారు. అనన్యసములు వారు కాని అందరూ తమకి సమానులే అనుకుంటారు.
 
శ్రీకృష్ణుని గురించి, శ్రీభగవాన్‌ గురించి వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. మనకి తెలియకుండానే మనలో ప్రవేశించే ఆ ఆధ్యాత్మిక శక్తి స్వరూపానికి అర్హులమగుదుము గాక!’’
 
పింగళి సూర్యసుందరం

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.