శబరి ఎంగిలి పండ్లు పెట్టలేదు!
18-01-2018 00:37:30
రామాయణంలోని కొన్ని చిన్న పాత్రలు ఆనాటి సామాజిక విలువల్ని సూచిస్తుంటాయి. అలాంటి పాత్రలకు ఒక ఉదాహరణ.. శబరి. ఆమె గిరిజన జాతికి చెందిన స్త్రీ. గురువులు చెప్పిన మాటపై శ్రద్ధ వల్ల మోక్షాన్ని పొందుతుంది. ఈమె మతంగముని ఆశ్రమంలో మునులకు సేవ చేసేది. వాళ్లు చెప్పిన విషయాలను వింటూ యోగాభ్యాసం చేసేది. ‘శ్రమణీం ధర్మనిపుణాం’ అని ఈమెను వాల్మీకి వర్ణిస్తాడు(శ్రమణి అంటే సన్యాస జీవితంలో ఉన్న స్త్రీ. ధర్మం విషయంలో కూడా ఆమెకు సంపూర్ణ అవగాహన ఉంది).
 
రాముడు అరణ్యానికి వెళ్లిన విషయం అరణ్యాల్లో ఉన్న రుషులకు వారి తపశ్శక్తి ద్వారా తెలుస్తుంది. అలా తెలుసుకున్న మతంగముని శిష్యులు తాము స్వర్గానికి వెళుతూ శబరికి ఆ విషయం చెబుతారు. వనవాసంలో ఉన్న రాముడు ఒకానొక సందర్భంలో ఆశ్రమానికి వస్తాడని, ఆయన దర్శనం తర్వాత శబరి కూడా శరీరాన్ని వదలవచ్చని వివరిస్తారు.
 
అప్పట్నుంచీ.. రాముడి కోసం ఆమె దాదాపు 13 సంవత్సరాలు శ్రద్ధగా నిరీక్షిస్తుంది. గురువులు లేదా శాస్త్రం చెప్పిన మాటపై విశ్వాసమే శ్రద్ధ. ఆధ్యాత్మిక సాధన అనేది ఒక ప్రయాణం అనుకుంటే.. ఆ మార్గంలో దారి ఖర్చులకు అవసరమయ్యే ధనమే శ్రద్ధ. ‘శ్రద్ధా విత్తో భూత్వా’ అని ఉపనిషత్తు వాక్యం. అలా, గురువులు చెప్పిన మాటను విశ్వసించి శ్రద్ధగా యోగసాధన చేస్తూ రాముడి కోసం నిరీక్షిస్తుంది శబరి.
 
రాముడు ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి ఎంగిలి పండ్లను ఇవ్వడం వాల్మీకి రామాయణంలో లేదు. అడవిలో దొరికిన ఆహారంతోనే ఆమె రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇస్తుంది. ఆ తరువాత రాముని అనుమతితో ఆమె తన శరీరాన్ని యోగాగ్నిలో అర్పించుకుని మోక్షాన్ని పొందుతుంది. ఈ కథలో సామాజిక దృష్ట్యా మనం చూడాల్సిన విషయం.. శబరి గిరిజన స్త్రీ. ఆమెకు వేదం తెలియకపోవచ్చు, యజ్ఞయాగాదులు చేసే అధికారం ఆనాడు లేకపోవచ్చు. అయినా యోగసాధనకూ, జ్ఞానానికీ, మోక్షాన్ని పొందడానికీ అందరూ అర్హులే అని నిరూపించే ఘట్టమే రామాయణంలోని శబరి కథ.
 
 
-కె.అరవిందరావు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.