ADVT
‘వాణిజ్యం’లో భారీ క్విడ్‌ ప్రో కో!
13-01-2018 03:03:19
  • ఓ కంపెనీకి 4.67కోట్ల ఐటీసీ రిటర్న్స్‌
  • చెల్లించడానికి రూ. 25 లక్షల లంచం
  • వాణిజ్యశాఖ రాష్ట్ర కార్యాలయమే వేదిక
  • డీల్‌ చేసుకొన్న అడిషనల్‌ కమిషనర్‌
  • వ్యవహారం నడిపిన కంపెనీ అడ్వైజర్‌
  • హైదరాబాద్‌నుంచి డబ్బుతో ప్రతినిధులు
  • కార్యాలయంలో నగదు అందిస్తుండగా..నలుగురిని అరెస్టు చేసిన ఏసీబీ
  • ఏసీబీ చరిత్రలోనే తొలిసారి 23.20 లక్షల లంచం స్వాధీనం చేసుకొన్న అధికారులు
అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఎవరెవరో ఊళ్లు దోచుకొన్నట్టు అధికారులు, వ్యాపారులు కలిసి ప్రభుత్వ సొమ్ము పంచుకోవాలనుకున్నారు. విజయవాడలోని రాష్ట్ర వాణిజ్య శాఖ కార్యాలయం వేదికగా భారీ క్విడ్‌ ప్రో కోకు తెరతీశారు. రాష్ట్రంలో సంచలన కేసులతో దూసుకు వెళుతున్న అవినీతి నిరోధక శాఖ ఆ సమాచారం అందుకుని మాటువేసింది. ఏదో పని కోసం వచ్చిన వారిని అధికారులు లంచం అడగడం, వారు ఆ సమాచారం ఏసీబీకి చేరవేరడంతో ఆ అధికారి ఆటకట్టడం మామూలే. అయితే, తాజా వ్యవహారంలో మాత్రం తన సొంత నెట్‌వర్క్‌తోనే ఏసీబీ పక్కా వ్యూహంతో రంగంలోకి దిగింది. ఏసీబీ చరిత్రలోనే తొలిసారిగా రూ.23.20 లక్షల నగదుని సీజ్‌ చేసింది. అటు ఇద్దరు అధికారులు ఇటు ఇద్దరు బయటి వ్యక్తులను అరెస్టుచేసింది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వాణిజ్య శాఖ కార్యాలయానికి ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ చేరుకొన్నారు. కేసు వివరాలను స్వయంగా మీడియాకు అందించారు.
 
అలా వచ్చి.. ఇలా దొరికి..
ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీడీ సిమెంటేషన్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ మన రాష్ట్రంలో గంగవరం పోర్టులో కాంట్రాక్టు పనులు చేసింది. సాధారణంగా ముడిసరుకు కొనుగోలు సందర్భంగా చెల్లించే పన్ను(ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌)ని, ఆ తర్వాత వాణిజ్యపన్నుల శాఖ తిరిగి చెల్లిస్తుంది. ఈ శాఖ నుంచి సదరు కంపెనీకి విశాఖ పోర్టు ట్రస్టు, గంగవరం పోర్టు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో 2010 అక్టోబర్‌ నుంచి 2014 మే 31 వరకూ చేసిన పనులకు సంబంధించి, ముందుగా చెల్లించిన వ్యాట్‌లో ఐటీసీ రూ.4.67 కోట్ల ఐటీసీ రావాల్సి ఉంది. వాటిని చెల్లించడానికి కమర్షియల్‌ ట్యాక్స్‌ అడిషనల్‌ కమిషనర్‌ ఏడుకొండలు రూ.25 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. అడిగిన మొత్తం ఇవ్వడానికి ఆ కంపెనీ కూడా అంగీకరించింది. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడం కోసం తన లీగల్‌ అడ్వైజర్‌ గోపాల్‌ శర్మని రంగంలోకి దించింది. తెలంగాణ రాష్ట్ర నాయకుడు ప్రొఫెసర్‌ కోదండరాం నాయకత్వంలోని టీ జేఏసీ నిజామాబాద్‌ కన్వీనర్‌గా గోపాల్‌ శర్మ పనిచేస్తున్నట్టు సమాచారం.
 
వాణిజ్య అధికారి ఏడుకొండలుతో క్విడ్‌ ప్రో కోకు సంబంధించిన వ్యవహారాన్నంతా గోపాల్‌ శర్మ నడిపించాడు. కంపెనీ అందించిన మొత్తంతో విజయవాడకు గోపాల్‌శర్మ బయలుదేరాడు. అతని వెంట కంపెనీ డిప్యూటీ మేనేజర్‌ సత్యనారాయణ చివరిదాకా ఉన్నాడు. వారిద్దరూ ఒక ప్రైవేటు ఇన్నోవా కారులో విజయవాడకు చేరుకుని, గేట్‌వే హోటల్‌లో బస చేశారు. ఏడు కొండలు తన కింద పనిచేసే సూపరింటెండెంట్‌ అనంతరెడ్డిని వారు బసచేసిన హోటల్‌ వద్దకు పంపించాడు. బెజవాడ శివారులోని ఈడ్పుగల్లులోని తమ కార్యాలయానికి వారిని పిలిపించుకొన్నాడు.
 
ఏడుకొండలును గోపాల్‌శర్మ, సత్యనారాయణ వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయంలో కలుసుకొన్నారు. గంటపాటు ఆ మాట ఈ మాట మాట్లాడుకొని, ఏడుకొండలు చేతికి నగదు మొత్తం అందించారు. ఈ వ్యవహారం గురించి ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ డీజీ ఠాకూర్‌కు ముందస్తు సమాచారం ఉండటంతో.. సీఐయూ విభాగం డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. మాటు వేసిన ఏసీబీ అధికారులు.. ఏడుకొండలు రూములోకి వెళ్లి డబ్బు ఇస్తున్న గోపాల్‌శర్మ, సత్యనారాయణతోపాటు తీసుకొంటున్న అడిషనల్‌ కమిషనర్‌ ఏడుకొండలు, సూపరెండెంట్‌ అనంతరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
 
గోపాల్‌శర్మే కీలకం: ఠాకూర్‌
‘‘తాము చేసిన కాంట్రాక్టు పనులకు సంబంధించి, తమకు రావాల్సిన ఐటీసీ రిటర్న్స్‌ కోసం ఐటీడీ సిమెంటేషన్‌ ఇండియా లిమిటెడ్‌ అనే కంపెనీ ప్రతినిధులు, వాణిజ్యశాఖ అధికారులు డిమాండ్‌ చేసిన లంచం అందిస్తుండగా అరెస్టు చేశాం. ఈ వ్యవహారంలో ఈ కంపెనీ లీగల్‌ అడ్వయిజర్‌ గోపాల్‌ శర్మ కీలకంగా వ్యవహరించారు. ఆయన ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వాణిజ్య అధికారి ఏడుకొండలుతో నేరుగా గోపాల్‌ శర్మే వ్యవహారం నడిపారు. ఈ సమాచారమంతా ముందే మాకు చేరిపోవడంతో, సకాలంలో రంగంలోకి దిగాం. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నవారిని పట్టుకున్నాం... అవినీతి ఏ రూపంలో ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తిలేదు’’ అని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ హెచ్చరించారు.
 
ప్రజలను లంచాల కోసం పీడించే వారిని ట్రాప్‌ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తోన్న సొమ్మును మింగేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ‘‘అవినీతి విషయంలో మాకు ఎన్నో మార్గాల్లో సమాచారం వస్తుంది. అది ఇంటర్నర్‌ విజిల్‌ బ్లోయర్‌ సమాచారం కావొచ్చు, ప్రైవేటు వ్యక్తి కావచ్చు, లేక కంపెనీ ప్రతినిధి కావచ్చు. అక్కడ జరిగిందా లేదా అన్నదే ముఖ్యం’’ అని ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎవరికి వారు ఇలా దోచుకుంటే ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.