ఎదగాలి.. వదలొద్దు
13-01-2018 02:32:07
సమస్యను వదలడం కాదు. ఎదుర్కొని ఎదగడం నేర్చుకోవాలి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎదగడం నేర్పాడు. వదలడం కాదు. సమస్యకు భయపడి పారిపోవడం లేదా తప్పించుకోవడం ఈ రెండూ వ్యక్తిలో పిరికితనాన్ని ఎత్తిచూపుతాయి. అకస్మాత్తుగా ప్రాణాపాయ స్థితి ఎదురైనప్పుడు ఏదో ఒక విధంగా బయటపడాలనే తపనతో చివరి వరకూ పోరాడుతాం. అలాగే, సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే, ఒకదానిని వదిలినా మరొకటి తగులుకుంటుంది. ఇలా ఎన్నింటిని వదిలించుకోగలం? ఎంతకాలం తప్పించుకోగలం? ఒకవేళ.. తప్పించుకోలేని సందర్భం ఎదురైనప్పుడు, ఏమి చేయాలో తెలియని స్థితిలో మనిషి అనాలోచితంగా ఆత్మహత్యకు పాల్పడవచ్చు. అందుకే.. వదలాలనుకుని అందులో కూరుకుపోకుండా, ఎదగాలనుకుని ప్రయత్నించడమే అసలైన పరిష్కారం.
 
గాలితో నిండిన బుడగ చిన్న గుండుసూది తగిలితే చాలు పగిలిపోతుంది. అలాగే, నిజాన్ని గుర్తించలేనివాడు తనకు తెలిసినదే నిజమని భ్రమిస్తుంటాడు. తన విజయానికి, వైభవానికి తానే కారకుడిననే అపోహతొ తలెగరేస్తూ ఊహాలోకంలో విహరిస్తుంటాడు. కానీ, అది ఎంతో కాలం సాగదు. ఏదో ఒకరోజు తన అవివేకం తొలగి, నేలపై నిలబడి నిలకడగా ఆలోచించేలా చేసే సంఘటన ఎదురవుతుంది. అంతా నాకే తెలుసు, నాకు తిరుగే లేదు అని విర్రవీగేవాడు కచ్చితంగా జీవితంలో గుణపాఠం నేర్చుకోవాల్సిందే. దీనికి భిన్నంగా.. తాను సాధించిన విజయానికి పరమాత్మ అనుగ్రహమే కారణమని భావించినవాడిలో దర్పం ఉండదు. అతడు అనవసరమైన గొప్పలు, డాంబికమైన మాటలు పలుకడు. అహంకార, మమకారాలతో బరువెక్కిన అర్జునుడికి ఈ సత్యాన్ని బోధించాలనే ఉద్దేశంతోనే రథాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కీలకమైన స్థానంలో నిలిపి గీతా బోధ చేశాడు కృష్ణుడు.
-స్వామి పరిపూర్ణానంద
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.