ADVT
సాయం తీసుకుందాం!
11-01-2018 23:03:09
యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరమ్‌!
తతస్తతో నియమ్యైతత్‌ ఆత్మన్యేవ వశం నయేత్‌!!
 
చాలా క్లిష్టమైనదిగా మనందరం భావిస్తాం కాబట్టే శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత ‘ద్యానయోగం’లో (6:26) మనస్సులోని ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం గురించే ఎక్కువసార్లు చెప్పాడు. ఎక్కువ ఉదాహరణలతో చెప్పాడు. మెట్టు మీద మెట్టు ఎలా ప్రయత్నం చేయవచ్చో కూడా చెప్పాడు. ఆలోచనలను తగ్గించే విధానం, లేదా ఆపే విధానం, ప్రశాంతంగా ఉండే విధానం, ఒక్క తరంగం కూడా లేని చెరువు ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలంగా మనస్సును ఉంచుకునే విధానాన్ని ఇందులో చెబుతున్నాడు.
 
మనస్సు లక్షణం చంచలం, అస్థిరం. వైద్యుడు రోగి లక్షణం, రోగ లక్షణం తెలుసుకుని మందు ఇచ్చినట్టుగా, ముందు మనస్సు లక్షణం తెలుసుకోవాలి. మనస్సును నిగ్రహించడమనేది పెద్ద మాయ! అది జరిగే పని కాదు! నిగ్రహింపబడిన దశలో అది బుద్ధి గానీ, చిత్తం గానీ, అహంకారం గానీ అవుతుందే తప్ప మనస్సు కాదు. చంచలమైన మనస్సును, అస్థిరమైన మనస్సును మనం నిగ్రహించగలమా? అది అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడికి నీ మనస్సు వెళుతోందో గమనించి దాంతో కూడా నువ్వు వెళ్లి, అక్కడి నుంచి దాన్ని నెమ్మది, నెమ్మదిగా వెనక్కి లాక్కొచ్చి ఆత్మలో పెట్టి మూసేయాలి! ఇదీ ఉపాయం! కష్టమే... కానీ సాధ్యమే! ఎంతో మంది గృహస్థులు కూడా సాధించారు.
 
ఈ ఆలోచన ఏ రకం? దీనివల్ల ఉపయోగమేంటి? అని ఒక్కసారి మనం ఆలోచనలకు ప్రత్యాలోచనలు చేస్తే ఆ ఆలోచన వెనక్కి వెళ్లిపోతుంది. ఇది మనంతట మనకు సాధ్యం కాకపోతే ఒక గ్రంథం సహాయమో, గురువు సహాయమో తీసుకోవచ్చు. దానికి మొహమాట పడక్కర్లేదు. దీన్నే భాస్కరశతకంలో చెబుతున్నాడు.
 
తెలియని కార్యమెల్ల గడతేర్చుటకొక్కవివేకి జేకొనన్‌
వలయునట్లైన దిద్దుకొనవచ్చు బ్రయోజన మాంద్యమేమియుం
గలగదు ఫాలమందు దిలకం బిడునప్పుడు చేత నద్దమున్‌
గలిగిన జక్క జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా!
 
‘మనకు తెలియని పనులు, కష్టమైన పనులు చేస్తున్నప్పుడు మొహమాట పడకుండా మన కంటే పెద్దవాళ్ల దగ్గరకు వెళ్లి సలహా అడగాలి. ఒక్కోసారి చిన్నవాళ్లను అడగాల్సి వచ్చినా అడగాలి. రోజూ పెట్టుకునే బొట్టే అయినా అద్దంలో చూచి పెట్టుకుంటే కాస్త దిద్దుకోవచ్చు’ అలాగే ఆధ్యాత్మిక మార్గంలో గురువు సహాయం గానీ, గ్రంథం సహాయం గానీ తీసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అద్దంలో చూసుకుని ముఖానికి బొట్టు పెట్టుకోవాలే తప్ప అద్దంలో బింబానికి బొట్టు పెట్టం కదా! కానీ ఈ రోజులో అందరూ చేస్తున్నది అదే. రాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొమ్మంటే రామునికి దండలేసి, అగరొత్తులు వెలిగించి, అరటిపండ్లు పెట్టి మొక్కుతున్నాం. పుణ్యమొస్తుంది అంటున్నాం. ఆధ్యాత్మికత అంటే పుణ్యం కాదు జ్ఞానం. గురువు చెప్పిన విషయాలు ఆచరించడమే ముఖ్యం. జాతి ఎందుకు వెనకబడి పోతోంది అంటే గురువులను గౌరవిస్తాం కానీ గురువుల మాటలను ఆచరించం. భగవద్గీత, రామాయణంలో చెప్పిన మాటలను మన జీవితంలోకి అన్వయించుకుందాం అనే ఆలోచన లేకపోతే ఎలా?

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.