ప్రళయం వస్తే...!
11-01-2018 23:01:18
ప్రళయం సంభవించిన రోజున ఈ ప్రపంచం అంతమైపోతుందని అంతిమ దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతుంది. దీని తరువాత మరో కొత్త ప్రపంచం ఉనికిలోనికి వస్తుంది. మానవులందరూ అక్కడ అల్లాహ్‌ ముందు హాజరవుతారు. ప్రపంచంలో మంచి పనులు చేసిన వారికి బహుమానం, చెడు కార్యాలకు పాల్పడినవారికి కఠిన దండన విధిస్తాడు అల్లాహ్‌.
ప్రళయ దినం గురించి ఖుర్‌ఆన్‌ చెప్పిన విశేషాలు: దైవంపై విశ్వాసం ఉన్నప్పుడే ప్రళయంపై విశ్వాసం పరిపూర్ణం అవుతుంది. ప్రళయదినం పట్ల విశ్వాసం మనిషి మస్తిష్కంలో నాటుకుపోతే మానవ జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రళయం పట్ల విశ్వాసం మానవుల నడవడికకూ, జీవన గమనానికి పవిత్రమైన దశ, దిశలను నిర్దేశిస్తుంది.
 
కర్మల పత్రం: ప్రళయ దినాన ప్రతి మనిషి చేతిలో అతడి కర్మల పత్రం ఉంటుంది. అతడు చేసిన చిన్నా-పెద్దా పనులు, మంచి- చెడ్డ పనులు, పాపపుణ్యాలు ఆ పత్రంలో రికార్డు అయి ఉంటాయి. దైవభీతితో జీవితం గడిపిన పుణ్యాత్ములకు ఆ రోజు వారి కర్మలపత్రం కుడి చేతికి అందిస్తారు. పాపాత్ములకు ఎడమ చేతికి ఇస్తారు. లెక్కలపత్రం కుడి చేతికి అందినవారు ఆ రోజు అమితంగా ఆనందిస్తారు. ఎడమ చేతికి లెక్కల పత్రం అందినవారు దౌర్భాగ్యులు.
 
పవిత్ర దివ్య ఖుర్‌ఆన్‌ ఇలా చెబుతోంది: ‘‘మీరు హాజరుపరచబడే ప్రళయదినాన మీ రహస్యాలేవీ దాగి ఉండవు. అప్పుడు కర్మల పత్రం కుడిచేతిలో అందుకున్న వ్యక్తిని చూడండి, ‘‘నా కర్మల పత్రాన్ని చదవండి. నా లెక్క నాకు తప్పక లభిస్తుందని నేను అనుకుంటూ ఉండేవాడిని’’ అంటాడు. అతడు తనకు ఇష్టమైన భోగభాగ్యాలలో ఓలలాడుతూ ఉంటాడు. అత్యున్నత స్వర్గ వనాల్లో విహరిస్తాడు. ప్రపంచంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా ఎడమ చేతిలో లెక్కల పత్రం అందుకున్న వ్యక్తి ‘‘అయ్యో! ఈ కర్మల పత్రం నాకు ఇవ్వకుండా ఉంటే, నా లెక్క నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండును. నాకు ప్రాపంచిక మరణమే అంతిమం అయివుంటే ఎంత బాగుండేది. నా ఆస్తిపాస్తులు నాకు పనికిరాకుండా పోయాయే! నా అధికారమూ నన్ను రక్షించలేదే!’’ అని వాపోతాడు. అప్పుడు ఇలాంటి ఆజ్ఞ వస్తుంది- ‘‘అతడ్ని పట్టుకొని, మెడకు కంఠపాశం బిగించి, నరకంలో పడవేయండి. సర్వోన్నతుడు, మహోన్నతుడు అయిన దైవాన్ని ఇతడు విశ్వసించలేదు. నిరుపేదలకు అన్నం పెట్టడం కానీ, పెట్టమని ప్రోత్సహించడం కానీ చేసేవాడు కాదు. కాబట్టి ఇక్కడ అతని దుఃఖాల్లో పాలు పంచుకొనే స్నేహితుడు ఎవరూ లేరు. అతడికి అక్కడ గాయాల కడుగు తప్ప తినడానికి, తాగడానికి మరేమీ లేదు. దాన్ని పాపాత్ములు తప్ప మరెవ్వరూ తినరు. (దివ్య ఖుర్‌ఆన్‌ అల్‌హఖ్ఖా 18-38). మానవుల్లో ప్రళయం పట్ల విశ్వాసం దృఢంగా నాటుకుపోతే ఇప్పుడు మనం ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్న అన్ని చెడులూ క్రమంగా అంతరించిపోతాయి.
మహమ్మద్‌ వహీదుద్దీన్‌
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.