హరీశ్‌ సారు ఊపిరి పోశారు
04-01-2018 03:16:29
  • ఆయన గొప్ప మానవతావాది..
  • ఆర్నేళ్ల నుంచి కంటికిరెప్పలా కాపాడారు
  •  ’ఆంధ్రజ్యోతి‘ చేసిన మేలును మరువను
  • కిడ్నీ బాధితురాలు సుష్మ ఆనందం
  •  బాధితురాలి దైన్యంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం
  •  ఖరీదైన వైద్యం అందేలా మంత్రి చొరవ
  •  కోలుకుంటున్న డిగ్రీ విద్యార్థిని
సిద్దిపేట, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ‘‘రెండు కిడ్నీలూ పూర్తిగా చెడిపోయాయి. కిడ్నీ మార్పిడి చేస్తే తప్ప మీ అమ్మాయి బతకదు’’.. వైద్యులు చెప్పిన ఈ మాటలు విని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తమ కూతురుకు 19 ఏళ్లకే నూరేళ్లు నిండనున్నాయని తెలిసి గుండెలవిసేలా రోదించారు. చిన్నప్పటి నుంచి కనీసం సూది మందు కూడా ఎరుగని తమ బిడ్డ.. రోజుల వ్యవధిలోనే చిక్కి శల్యం కావడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో కూతురుకు ఖరీదైన వైద్యం ఎలా అందించాలో తెలియక తలలు పట్టుకున్నారు.
 
8 నెలలు గడిచాయి. మృత్యు ముఖానికి దగ్గరైన ఆ అమ్మాయిలో ఇప్పుడు ఎంతో మార్పు! మంచం పట్టిన ఆమె చక్కగా తన పనులు తాను చేసుకుంటోంది. డిగ్రీ పరీక్షలకు సిద్ధం అవుతోంది. అప్పట్లో ఆ అమ్మాయి అనారోగ్య స్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తే... మంత్రి హరీశ్‌ రావు బాధితురాలికి ఖరీదైన వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనమే తన జీవితంలో కొత్త వెలుగు ప్రసరించేలా చేసిందని, దేవుడి రూపంలో మంత్రి హరీశ్‌ రావు చేసిన సాయం మరువనని, ఆ అమ్మాయి అంటోంది. తన పాలిట హరీశ్‌ రావే నిజమైన వైద్యుడు అని చెబుతోంది. ఆమే.. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన సుష్మ (19). డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తండ్రి రాజలింగం బీడీ కంపెనీలో కూలీ. ఎప్పుడూ చలాకీగా ఉండే సుష్మ 8 నెలల క్రితం ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. సుష్మ కిడ్నీలు పాడయ్యాయని వైద్యులు తెలిపారు. డయాలసిస్‌ చేసినా.. ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. సుష్మ బతకాలంటే కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ తప్పనిసరి అని, అయినా ఆమె శరీరం సహకరించే స్థితిలో లేదని వైద్యులు తేల్చారు.
 
సుష్మ దయనీయస్థితిపై నిరుడు మే 7న ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సుష్మ పరిస్థితిని తెలుసుకొని హరీశ్‌రావు స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి.. ‘‘నీకు ఏమీ కాదు. పూర్తిగా కోలుకుంటావు. నాదీ పూచీ’’ అని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. స్వయంగా సుష్మను తోడ్కొని వెళ్లి నిమ్స్‌లో చేర్పించారు. మెరుగైన చికిత్స చేయాలని అక్కడి వైద్యులకు సూచించారు. ఆమె తల్లిదండ్రులకు వసతి, ప్రయాణ, తదితర ఖర్చులను ఆయనే సమకూర్చారు. సుష్మకు అవసరమైన వైద్యానికి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తున్నారు. సుష్మకు ఏదో ఒక రోజు కిడ్నీ మార్పిడి తప్పకున్నా.. ప్రస్తుతమైతే హోం డయాలసిస్‌ లిక్విడ్‌ మార్పిడి చికిత్సతో నెట్టుకొస్తోంది. కూతురు కోసం ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లోనే ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
 
హరీశ్‌ సారు దేవుడు
 
‘‘కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేస్తే తప్ప బతకను అని వైద్యులు నా ముందే చెప్పేశారు. రెండు కిడ్నీలూ చెడిపోయి మంచం పట్టిన నాకు డాక్టర్ల మాటలు మరింత కుంగదీశాయి. త్వరలో చావు తప్పదనుకున్న స్థితిలో మంత్రి హరీశ్‌ సారు గొప్ప అండగా నిలిచారు. ‘ఆంధ్రజ్యోతి’ లో నాగురించి రాసిన తర్వాత హరీశ్‌ సారు స్వయంగా మా ఇంటికి వచ్చారు. నీకేమీ కాదు.. అనుకున్నది సాధిస్తావు’’ అని ధైర్యం చెప్పారు. ఒక వైద్యుడిలా నాలో మానసిక స్థైర్యాన్ని నింపారు.
 
ఆయన ఇచ్చిన భరోసాతోనే వైద్యం చేయించుకున్నాను. నిమ్స్‌కు కూడా వచ్చి నా గురించి డాక్టర్లతో మాట్లాడేవారు. ఎన్నో దేవుళ్లను ప్రార్థించాను. వారంతా హరీశ్‌సార్‌ రూపంలో నన్ను బతికించారు. నాకు ఊపిరి పోసిన ఆయన గొప్ప మానవతావాది. త్వరలోనే కిడ్నీ కూడా మార్పిస్తానని ఆయన చెప్పారు. హరీశ్‌ సారును, ‘ఆంధ్రజ్యోతి’ని జీవితంలో మరువను’’
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.