అడ్మిషన్లు సెట్‌ చేస్తున్నారు
04-01-2018 03:13:35
  • సింగిల్‌ విండో-3 పేరిట కళాశాలల ఇష్టారాజ్యం
  • కాలేజీల మేనేజ్‌మెంట్లకే సర్వాధికారాలు
  • పరీక్ష, ర్యాంకులు, ప్రవేశాలు...
  • అన్నీ కాలేజీల మేనేజ్‌మెంట్లకే ధారాదత్తం
అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సింగిల్‌ విండో-3 పేరిట నిర్వహిస్తున్న ‘సెట్‌’ కొన్ని కాలేజీల మేనేజ్‌మెంట్లకు వరంగా మారింది. ఇంజనీరింగ్‌తో పాటు పలు వృత్తి విద్యాకోర్సుల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తోన్న ఈ పరీక్ష ద్వారా అక్రమ అడ్మిషన్లకు తెర తీసినట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాలు లీక్‌ చేస్తూ, తమవద్ద పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ఏదో ఒక ర్యాంక్‌ వచ్చేలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగిల్‌ విండో-3లోని కాలేజీల్లో అడ్మిషన్లు కోరుకునేవారికి కావాల్సినచోట సెంటర్‌ అలాట్‌ చేయిస్తున్నట్లు, పేపర్ల మూల్యాంకనం కూడా వారి అధీనంలోనే చేయించుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు అడ్మిషన్లు సైతం మేనేజ్‌మెంట్ల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. కన్వీనర్‌ కోటాతో పాటు మేనేజ్‌మెంట్‌ కోటా అడ్మిషన్లు సైతం వారి ఇష్ట ప్రకారమే జరుగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆఽధ్వర్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి, సింగిల్‌ విండో-1 ద్వారా అభ్యర్థులకు ర్యాంక్‌లు కేటాయించడం, దాంతో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం మొదటి పద్ధతి. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ప్రాతిపదికగా సింగిల్‌ విండో-2 ద్వారా కాలేజీలే వాళ్ల ఇష్టం ప్రకారం అడ్మిషన్లు చేసుకోవడం రెండో పద్ధతి. ఇక సింగిల్‌ విండో-3 ద్వారా కాలేజీల మేనేజ్‌మెంట్లు కలిసి సెపరేట్‌గా సెట్‌ నిర్వహించుకుని, అభ్యర్థులకు ర్యాంకులు ఇచ్చి, అడ్మిషన్లు చేసుకోవడం మూడో పద్ధతి.
 
కాలేజీల కుమ్మక్కు
రాజ్యాంగం ప్రకారం తమకు తామే పరీక్ష నిర్వహించుకునేందుకు, అడ్మిషన్లు చేసుకునేందుకు హక్కు ఉందనే సాకుతో రాష్ట్రంలో కొన్ని కాలేజీలు ఒక సమూహంగా ఏర్పడి సింగిల్‌ విండో-3 ద్వారా వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలు కల్పించుకుంటున్నాయి. పలు కాలేజీలు సింగిల్‌ విండో-3 ద్వారా నిర్వహించి అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. అయితే వృత్తి విద్యా కాలేజీలు కామన్‌ ర్యాంకింగ్‌ ప్రకారమే అడ్మిషన్లు చేపట్టాలని ఏఐసీటీఈ నిబంధనల్లో ఉంది. నీట్‌’ పరీక్షపై చర్చ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా దీనిపై కీలకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.