ADVT
టీబీ చంపేస్తోంది
04-01-2018 02:38:24
  • క్షయ మృతుల్లో రెండో స్థానంలో ఏపీ
  • 2016లో 3,997 మంది మృతి
  • దేశ సగటుకు మించిన మరణాలు
  • ఆరోగ్యశాఖ నిర్లక్ష్యమే కారణం!
  • రోగులకు మందులు నిలిపివేత
  • పర్యటన బృందాలు నిర్వీర్యం
  • పక్కదారి పడుతున్న నిధులు
అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇండియా వర్సెస్‌ టీబీ. ఈ పోరాటంలో ఇండియా గెలుస్తుంది’’ క్షయ వ్యాధిపై ప్రజలను చైతన్య పర్చేందుకు అమితాబ్‌ బచ్చన్‌ చేసే ‘ప్రకటన’ ఇది. కానీ... మన రాష్ట్రంలో మాత్రం క్షయే గెలుస్తోంది. ఏపీ ఓడిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీబీ (క్షయ) వ్యాధిగ్రస్తుల మరణాల సంఖ్య మొత్తం దేశ సగటును కూడా మించి పోయే విధంగా ఏటా నమోదు అవుతోంది. 2016 లెక్కల ప్రకారం దేశంలో లక్ష మంది టీబీ రోగుల్లో 32 మంది చనిపోతున్నారు. ఆ ఏడాది క్షయ మరణాల సంఖ్యలో ఏపీది నాలుగో స్థానం. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్‌ ఉన్నాయి. 2017లో ఏపీ రెండో స్థానానికి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో 2015లో 2,764 మంది చనిపోతే, 2016 అక్టోబరు నాటికే 3,997 మరణాలు నమోద అయ్యాయి. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో 2015 సంవత్సరంలో 1,926 మంది మృతి చెందగా... 2016లో మాత్రం ఒక్కరూ కూడా చనిపోలేదు.
 
కారణం ఏమిటి?
రాష్ట్రంలో ఈ స్థాయిలో మరణాలు పెరగడం వెనుక ఆరోగ్యశాఖ నిర్లక్ష్యమే కారణం. క్షయ నివారణ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యమైంది. గ్రామాల్లో వైద్యుల పర్యటనలు నిలిచిపోయాయి. ‘సవరించిన జాతీయ క్షయ నివారణ ప్రోగ్రామ్‌’ పేరుతో కేంద్రం రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తుంది. వాటిని సక్రమంగా ఉపయోగించడం లేదు. ఉన్న కాస్త నిధులను ఇతర పథకాలకు బదలాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో రోగులకు ప్రతీనెలా మందుల పంపిణీ జరగడం లేదు. టీబీ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఒక్క రోజు ఆపినా వారి శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతారు. ఈ విషయం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2017 నవంబరు-డిసెంబరు మధ్య రోగులకు మందులు నిలిపివేశారు. రాష్ట్రానికి ఏటా సుమారు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకూ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నిధులు వస్తాయి. 2015లో కేంద్రం రూ.22 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే...ఆరోగ్యశాఖ అధికారులు కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2016లో కూడా సుమారు రూ.22 కోట్లు కేంద్రం అందించింది. ఈ ఏడాది కూడా ఆరోగ్యశాఖ అధికారులు రూ.20 కోట్లే ఖర్చు చేశారు. ఇతర పథకాలకు ఈ నిధులను మళ్లిస్తున్నట్లు సమాచారం.
 
ఇలా అయితే...ఏపీ నెంబరు వన్‌!
వైద్య పరీక్షల కోసం పది టీయూలకు ఒక ఎస్‌టీఎల్‌ఎస్‌ ఉండటంవల్ల వైద్య పరీక్షలు అలస్యం అవుతున్నాయి. రోగులను పర్యవేక్షించే వ్యవస్థా పడకేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే టీబీ విషయంలో దేశంలో నెంబర్‌ వన్‌ స్థానానికి ఏపీ చేరుకుంటుందన్నడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.