ADVT
‘హైకోర్టు’పై కమిటీలు!
04-01-2018 02:35:36
  • భవనాల పరిశీలనకు 4 బృందాలు.. 
  • రెండో వారంలో అమరావతికి రాక
  • చంద్రబాబు లేఖపై ఫుల్‌ కోర్టు భేటీ.. 
  • సహచర జడ్జీలతో ఏసీజే విస్తృత చర్చ
హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. హైకోర్టు ఏర్పాటుకు అనువైన భవనాల పరిశీలనకు అమరావతికి రావాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌కు సీఎం చంద్రబాబు ఇటీవల రాసిన లేఖపై కదలిక మొదలైంది. ఈ లేఖపై బుధవారం జస్టిస్‌ రమేశ్‌ రంగనాథ్‌ సహచర న్యాయమూర్తులతో భేటీ అయ్యారు. ఈ నెల రెండో వారంలో రెండు కమిటీలు అమరావతిలో పర్యటించి భవనాలను పరిశీలించే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సీఎం చంద్రబాబు రాసిన లేఖను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ బుధవారం సహచర జడ్జీలకు
సర్క్యులేట్‌ చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం 4.45 గంటలకు హైకోర్టు అడ్మినిస్ర్టేటివ్‌ భవనంలో సమావేశం అవుదామని సమాచారం పంపారు. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులతో జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ ప్రత్యేకంగా సమావేశమై.. చంద్రబాబు రాసిన లేఖపై సహచర న్యాయమూర్తుల అభిప్రాయాలను కోరి, వాటిపై చర్చించారు. ఈ భేటీలో.. బిల్డింగ్‌ కమిటీ, మార్గదర్శకాల రూపకల్పన కమిటీ, మౌలికసదుపాయాల కమిటీ, సిబ్బంది విభజన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా కమిటీల్లో ఎవరు సభ్యులుగా ఉండాలనే అంశాన్ని జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయానికి వదిలిపెట్టినట్లు తెలిసింది. బిల్డింగ్‌ కమిటీ, మౌలిక సదుపాయాల కమిటీ సభ్యులు ఈ నెల రెండో వారంలో అమరావతిలో పర్యటించి అనువైన భవనాలను పరిశిలించే అవకాశం ఉంది. ఆ కమిటీ చేసిన సూచనల మేరకు హైకోర్టు ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ఉమ్మడి హైకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఈ సమాచారాన్ని ఉమ్మడి హైకోర్టు.. భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళుతుంది. అనంతరం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనలతో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత ఏపీ హైకోర్టు అమరావతికి తరలనుంది.
 
కమిటీలో న్యాయవాదుల సంఘానికీ చోటు!
ఇదిలా ఉండగా.. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చల్లా ధనుంజయ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం బుధవారం భోజన విరామ సమయంలో జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను కలిసింది. ఏపీ హైకోర్టు భవన పరిశీలనకు వెళ్లే కమిటీల్లో న్యాయవాదుల సంఘానికి స్థానం కల్పించాలని కోరుతూ ఓ వినతిపత్రాన్ని సమర్పించింది. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఏసీజే.. గురువారం తనను కలవాలని ఏపీ న్యాయవాదుల సంఘానికి సూచించినట్లు సమాచారం. కాగా, ఏపీలో హైకోర్టుకు పక్కా భవనం నిర్మించిన తర్వాతే తరలించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు సంతకాలు సేకరించినట్లు తెలిసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏపీ హైకోర్టును అమరావతికి తరలిస్తే.. తాత్కాలిక భవనం పరిసర ప్రాంతాల్లోకి ఒకసారి, పక్కా భవనంలోకి తరలించిన తర్వాత మరోసారి తమ నివాసాలను, కార్యాలయాలను మార్చుకోవాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. పక్కా భవనం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీ హైకోర్టును తరలించాలని గతంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర పునర్‌ విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాద్‌లోని హైకోర్టును వినియోగించుకునే అవకాశం ఉన్నందున పక్కా భవనం పూర్తయిన తర్వాతే ఏపీ హైకోర్టును ఏర్పాటు చేయాలని ఒక వర్గం న్యాయవాదులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈమేరకు హైకోర్టులో పిటిషన్‌ వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.