సీమ కరువును తరిమేస్తా!
04-01-2018 02:29:52
  • దేశానికే మణిహారం చేస్తా
  • 2029కి అభివృద్ధికి చిరునామాగా నవ్యాంధ్ర
  • సంక్రాంతి తర్వాత 2.50 లక్షల గృహప్రవేశాలు
  • ఐదు రోజుల్లో మూడో విడత ‘మాఫీ’ నిధులు
  • పంచాయతీల్లో నూట్రిషన్‌ గార్డెన్లు: చంద్రబాబు
  • పులివెందుల జన్మభూమిలో పాల్గొన్న సీఎం
  • ట్రాన్స్‌జెండర్లకు ఇళ్ల పట్టాలు అందజేత
  • కడప జిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి సభలో చిన్నారికి బాలామృతం తినిపిస్తున్న సీఎం చంద్రబాబు
కడప, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ‘రాయలసీమను సస్యశ్యామలం చేస్తా. హార్టీకల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేసి దేశానికే మణిహారంలా తీర్చిదిద్దుతా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నీరు బంగారంతో సమానమని, అందుకే కరువుతో అల్లాడే రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకొస్తున్నామని అన్నారు. కడప జిల్లా పులివెందులలో బుధవారం జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు లింగాల మండలంలో చిత్రావతి రిజర్వాయర్‌ వద్ద జలహారతి ఇచ్చి పైలాన్‌ను ప్రారంభించారు. ఈ రెండు చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో సీఎం మాట్లాడారు. ‘ఐదు లిఫ్టులతో గండికోట నుంచి చిత్రావతికి కృష్ణాజలాలు ఇవ్వడం ద్వారా చరిత్ర సృష్టించాం. కడప జిల్లాకు ఇప్పటికి 40 టీఎంసీల నీటిని తీసుకురావడం ఓ చరిత్రే’ అని సీఎం పేర్కొన్నారు. పులివెందుల ప్రాంతంలోని జలాశయాలకు నీటిని ఇవ్వడంతో ఇక్కడ ఉద్యానవన తోటల అభివృద్ధి జరుగుతుందన్నారు. భవిష్యత్తులో కడప జిల్లాలో కరువు అన్న మాటే లేకుండా చేస్తానని సీఎం ప్రకటించారు. కాంట్రాక్టర్లను పరుగులెత్తించి, ప్రాజెక్టుల వద్ద నిద్రలు చేసి పనులు శరవేగంగా పూర్తయ్యేలా చేశామన్నారు. తాము చేస్తున్న అభివృద్ధికి ప్రజల సహకారం కూడా ఉండాలని చంద్రబాబు కోరారు. పోలవరం నవ్యాంధ్ర జీవనాడి అని, అది పూర్తయితే రాయలసీమ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రాయలసీమకు ఇప్పటికే 122 టీఎంసీల నీటిని అందించామని అన్నారు. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అవుకు టన్నెల్‌ కుంగిపోతుండడంతో ప్రత్యామ్నయంగా మరో టన్నెల్‌ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి-పెన్నా అనుసంధానం చేస్తామని, తద్వారా సోమశిలకు గోదావరి నీటిని తీసుకురావచ్చునని, గాలేరి నగరితో కూడా దీనిని అనుసంధానం చేయవచ్చునని పేర్కొన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఉడుంపట్టుతో నదుల అనుసంధానాన్ని పూర్తి చేస్తామన్నారు. 2029కి నవ్యాంధ్ర ప్రదేశ్‌ను అభివృద్ధికి చిరునామాగా మార్చివేస్తానన్నారు.
 
నాలుగైదు రోజుల్లో మాఫీ నిధులు
రాష్ట్రంలో రైతులకు మూడోవిడత రుణమాఫీ నిధులను నాలుగైదు రోజుల్లో విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే రూ.24 వేల కోట్లు రుణమాఫీ చేసి రైతుకు విముక్తి కల్పించినట్లు చెప్పారు. పండ్లతోటలను సాగు చేసే రైతులకు ప్రయోజనం కలిగేలా కోల్డ్‌స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని, పులివెందుల ప్రాంతంలో పండ్ల తోటలకు డిమాండ్‌ పెరిగేలా చూస్తామని, ప్రపంచంలోనే పేరున్న కంపెనీలను ఇక్కడికి తీసుకొస్తామని అన్నారు. అన్ని పంచాయతీల్లో న్యూట్రిషన్‌ గార్డెన్లను ఏర్పాటు చేసి అక్కడ పండించే ఆకుకూరలు, కూరగాయలు గర్భిణులకు, చిన్నపిల్లలకు, విద్యార్థులకు అందించే విధంగా చర్యలు చేపడుతామన్నారు. పొగాకు, బ్రాందీ, విస్కీ లాంటి వాటిని సరదాగా ప్రారంభించి ఆ తర్వాత వాటికి బానిసలు అవుతున్నారని, వాటికి దగ్గరైతే జీవితానికి దూరమవుతారని సూచించారు. ప్రజలకు ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో ఎవరూ అద్దె ఇళ్లలో ఉండే అవసరం లేకుండా చూస్తామన్నారు. సంక్రాంతి తర్వాత 2.50 లక్షల ఇళ్లు గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 6 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. జన్మభూమి పూర్తయ్యేలోపు ఆర్థికపరమైన ఫిర్యాదులన్నీ పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తామని తెలిపారు. ‘నేను ఎవరి మెప్పుకోసం పనిచేసేవాడిని కాదు. ప్రజల కోసం పనిచేసే వాడిని. నాకు దేవుడు ఎంత శక్తి ఇస్తే ఆ శక్తి అంతా ప్రజల కోసమే ఉపయోగిస్తా’ అన్నారు. ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.1500 పింఛను ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. 74 మంది ట్రాన్స్‌జెండర్లకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తున్నట్లు వేదికపై నుంచి వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్లు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 3 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లం ఉన్నామని, తామంతా చంద్రబాబుకే ఓటు వేస్తామని చెప్పారు.
 
చంద్రన్నకు జనహారతి
పులివెందుల: కడప జిల్లా పులివెందులలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనం నీరాజనం పట్టారు. జన్మభూమి కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. సీఎం బహిరంగసభ 2 గంటలకు ప్రారంభం కానుండగా జనం ఉదయం 11 నుంచే సభాప్రాంగణానికి చేరుకోవడం ప్రారంభించారు. పులివెందులలో కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీలు చేపట్టి, ఉత్సాహంగా చిందులు వేస్తూ ఆనందంలో మునిగితేలారు. కృష్ణా జలాలు పులివెందుల నియోజకవర్గానికి రావడంతో స్థానికుల్లో ఆనందం మిన్నంటుతోంది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.