ADVT
చెత్త మీడియా అవార్డులిస్తా
04-01-2018 02:06:56
  • 8వ తేదీన ప్రకటిస్తా: ట్రంప్‌
  • బరిలో 3 మీడియా సంస్థలు!
  • ఏబీసీ, సీఎన్‌ఎన్‌, టైమ్‌తో వైరం
వాషింగ్టన్‌, జనవరి 3: అమెరికా ప్రధాన స్రవంతి మీడియా అంటే అగ్గి మీద గుగ్గిలమయ్యే అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక సంచలన ప్రకటన చేశారు. అత్యంత కపట, అవినీతి మీడియా అవార్డులను ప్రకటించబోతున్నానని బుధవారం ట్విటర్‌లో తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన ఈ అవార్డులను సోమవారం(8వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తానని పేర్కొన్నారు. ‘అబద్ధపు వార్తా సంస్థల’కు వివిధ విభాగాల్లో కపటత్వం, చెత్త రిపోర్టింగ్‌కు ఈ అవార్డులు ఉంటాయని తెలిపారు. అయితే ఈ అవార్డుల వ్యవహారం నుంచి తన అభిమాన ‘ఫాక్స్‌ న్యూస్‌’ను మినహాయించారు. అధ్యక్ష ఎన్నికల నాటి నుంచి దేశంలోని ప్రధాన స్రవంతి మీడియాతో ట్రంప్‌కు వైరం కొనసాగుతోంది. న్యూస్‌ నెట్‌వర్క్‌ల మధ్య ‘అబద్ధపు వార్తల ట్రోఫీ’ గురించి ట్రంప్‌ గత నవంబరు 27న తొలిసారిగా ప్రకటించారు. ‘‘మీ అభిమాన అధ్యక్షుడి (నేను) రాజకీయ వార్తల కవరేజీలో అత్యంత బూటకంగా, అవినీతితో వ్యవహరించిన న్యూస్‌ నెట్‌వర్క్‌ ఏదో (సీఎన్‌ఎన్‌ సహా) తేల్చాలి. విజేతకు ‘ఫేక్‌ న్యూస్‌ ట్రోఫీ’ దక్కుతుంది’’ అని నాటి ట్వీట్‌లో ట్రంప్‌ పేర్కొన్నారు. సాయంత్రానికల్లా ఫాక్స్‌ న్యూస్‌ ఇతర వార్తా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాల జాబితాను ప్రకటించింది. ఇవన్నీ ఆ తర్వాత రోజుల్లో నిజం కాదని రుజువైనవి. నవంబరు 28 నుంచి ట్రంప్‌ ప్రచార దళం తన పని మొదలుపెట్టింది. ‘కింగ్‌ ఆఫ్‌ ఫేక్‌ న్యూస్‌’ ట్రోఫీ కోసం నామినేషన్లు పంపాలంటూ ఆయన మద్దతుదారులకు ఈ-మెయిల్స్‌ పంపింది. ‘‘అమెరికన్లను తెలివి తక్కువ వాళ్లు అని కొందరు జర్నలిస్టులు, ఉదారవాద పండితులు అనుకుంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని మార్చేయగలమని భావిస్తున్నారు’’ అంటూ ఆ మెయిల్‌లో న్యూస్‌ నెట్‌వర్క్‌లను ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు. ‘రష్యా అధికారులను సంప్రదించవలసిందిగా మైఖేల్‌ ఫ్లిన్‌ను ట్రంప్‌ ఆదేశించార’న్న ఏబీసీ న్యూస్‌ కథనం; ‘వికీలీక్స్‌ నుంచి హ్యాక్‌ చేసిన పత్రాలు అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, ఆయన కుమారుడు డోనాల్డ్‌ జె ట్రంప్‌ జూనియర్‌కు అందుబాటులో ఉన్నాయ’న్న సీఎన్‌ఎన్‌ కథనం; ‘ఓవల్‌ ఆఫీసు నుంచి మార్జిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ విగ్రహాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ తొలగించార’న్న టైమ్‌ కథనం ఈ జాబితాలో ఉన్నాయి. ప్రతి కథనానికీ ముందు తప్పుడు కథనమంటూ మెయిల్‌లో నొక్కి చెప్పారు. అంతేకాదు... ‘2017 సంవత్సరానికి వీటిని మించి తప్పుడు కథనమేదైనా ఉందని మీరు భావిస్తే... ఆ విషయాన్ని అధ్యక్షుడు తెలుసుకోవాలనుకుంటున్నార’ని ఆ మెయిల్‌ కోరింది. ఇదంతా జరిగి సుమారు 40 రోజులు గడిచిపోయింది. వచ్చే సోమవారం నాడు అవార్డులు ప్రకటిస్తానన్న ట్రంప్‌... మీడియా సంస్థలతో తన వైరం సమసిపోయేది కాదని చాటారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.