పిపెట్‌, బ్యూరెట్‌ తెల్వదు
04-01-2018 01:53:41
  • ప్రయోగాలకు దూరంగా ఇంటర్‌ విద్యార్థులు
  • అన్ని కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్‌కు పాతర
  • కార్పొరేట్‌ కాలేజీల్లో మరీ దారుణం
  • ల్యాబ్‌లు ఉండవు.. ఉన్నా అరకొర
  • వార్షిక ప్రాక్టికల్స్‌ తూతూ మంత్రం
  • దాదాపు అందరికీ పూర్తి మార్కులు
  • జేఈఈ, నీట్‌ కోసం థియరీకే ప్రాధాన్యం
‘‘ఈ రోజుల్లో ఇంటర్‌ విద్యార్థులకు పిపెట్‌, బ్యూరెట్‌ అంటే ఏమిటో కూడా తెలియదు. కాలేజీల్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యమే లేకుండా పోయింది. విద్యార్థులతో ప్రయోగాలు చేయించడం పూర్తిగా మానేశారు. కొన్ని కాలేజీల్లోనైతే అసలు ల్యాబ్‌ సౌకర్యమే లేదు. నేను అధ్యాపకుడిగా ఉన్నరోజుల్లో ప్రయోగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. విద్యార్థులతో ప్రయోగాలు చేయించేవాళ్లం’’.. ఓ సమావేశంలో సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలివి!!

హైదరాబాద్‌, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్‌కు పాతరేస్తున్నారు. విద్యార్థులతో ప్రాక్టికల్స్‌ చేయించకుండానే విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయిస్తున్నారు. తెలంగాణలో దాదాపుగా 1,500 ప్రైవేటు కాలేజీలు, 402 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సైన్స్‌ గ్రూప్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల సంఖ్య సుమారుగా 2లక్షల వరకు ఉంటారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ తప్పనిసరి. అయితే ప్రాక్టికల్స్‌ అనే మాట విద్యా కేలండర్‌లో మాత్రమే కనిపిస్తోంది. ప్రాక్టికల్స్‌ను ప్రాధాన్యం లేని సబ్జెక్టుగా గుర్తిస్తున్నారు.
 
దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో పూర్తిగా నాలెడ్జి లేకుండా పోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్‌లో పిపెట్‌, బ్యూరెట్‌లు ప్రాథమిక పరికరాలు. రసాయన ప్రయోగాలకు ఈ రెండింటి వినియోగమే ఎక్కువగా ఉంటుంది. అయితే, విద్యార్థులను ప్రాక్టికల్స్‌కు దూరం పెడుతుండడంతో వారికి పిపెట్‌, బ్యూరెట్‌ అంటే ఏమిటో కూడా తెలియకుండా పోతోంది. వచ్చే నెలలో ప్రాక్టికల్స్‌ ప్రారంభం కానున్నాయి. కానీ చాలా కాలేజీల్లో విద్యార్థులను ప్రయోగాలకు సిద్ధం చేయలేదు. ప్రాక్టికల్స్‌ విషయంలో కార్పొరేట్‌ కాలేజీలైతే మరీ దారుణం. ఒకరకంగా ఆ కాలేజీల్లో ప్రాక్టికల్స్‌ అనే మాట నిషిద్ధ పదం అయిపోయింది.
 
విద్యార్థులకు కాలేజీలో అసలు ప్రయోగశాల ఎక్కడ ఉంటుందో తెలియని స్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ కాలేజీల్లో ఏడాదిలో ఒకసారైనా విద్యార్థులు ల్యాబ్‌ గడపతొక్కని పరిస్థితి ఉంది. ప్రాక్టికల్స్‌ను పూర్తిగా పక్కనబెడుతున్న కాలేజీలు ఆ సమయాన్ని జేఈఈ, నీట్‌ జాతీయ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి వినియోగిస్తున్నాయి. ప్రాక్టికల్స్‌పై దృష్టి పెట్టొద్దని, ఆ విషయం తాము చూసుకుంటామని విద్యార్థులకు అధ్యాపకులే నేరుగా చెబుతున్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్‌ కోసం ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులు(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ 30 చొప్పున) మార్కులు కేటాయిస్తారు.
 
బైపీసీ విద్యార్థులకు 120 మార్కులు(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి 30 మార్కుల చొప్పున) కేటాయిస్తారు. ఈ మార్కులు వార్షిక పరీక్షల్లో వచ్చే మొత్తం మార్కుల శాతాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో విద్యార్థులు సహజంగానే ప్రాక్టికల్స్‌ మార్కులపై ఎక్కువ దృష్టి పెడతారు. కానీ విద్యార్థులు ఏ విధమైనా ప్రాక్టికల్స్‌ చేయకుండానే పరీక్ష పరిశీలకులు(ఎక్స్‌టర్నల్స్‌) వారికి మార్కులు ఇస్తున్నారు. విద్యార్థి ప్రాక్టికల్‌ సామర్థ్యంతో సంబంధం లేకుండా అడ్డగోలుగా మార్కులు వేస్తున్నారు. తరగతిలో దాదాపు 70-80శాతం విద్యార్థులకు 100 శాతం మార్కులు వేస్తుండడం గమనార్హం. మిగతా 20 శాతం విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో 2-5 మార్కులు తక్కువగా వేస్తుంటారు. విద్యార్థులకు థియరీ నాలెడ్జి తప్ప ప్రాక్టికల్‌ నాలెడ్జి ఉండడం లేదని.. దీంతో కెరీర్‌లో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ల్యాబ్‌లే కరువు
కార్పొరేట్‌ కాలేజీల్లో అసలు ప్రాక్టికల్స్‌ నిర్వహించేందుకు కావాల్సిన ప్రయోగశాలలే లేకపోవడం గమనార్హం. రెండు మూడు బ్రాంచులకు కలిపి ఒకచోట చిన్న ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయం ఇటీవల ఇంటర్‌బోర్డు అధికారుల తనిఖీల్లోనూ తేలింది. మెజారిటీ కాలేజీల్లో ల్యాబ్‌లే లేవని అధికారులే స్వయంగా తెలపడం గమనార్హం. చిన్న ప్రైవేటు కాలేజీల్లో ల్యాబ్‌లు ఉన్నప్పటికీ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలోని దాదాపు 1500 ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీల్లో 70-80 శాతం కాలేజీల్లో ల్యాబ్‌ సౌకర్యాలు అఽధ్వాన్నంగా ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ కాలేజీల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.