ADVT
‘తలాక్‌’పై మెలిక!
04-01-2018 01:50:14
  • రాజ్యసభలో బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్‌..
  • సెలక్ట్‌ కమిటీకి పంపాలని పట్టు..
  • మద్దతు తెలిపిన తృణమూల్‌, ఎస్పీ
న్యూఢిల్లీ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): తక్షణ తలాక్‌ రద్దు బిల్లుపై కాంగ్రెస్‌ మెలిక పెట్టింది. లోక్‌సభలో బిల్లుకు ఆమోదం తెలిపిన కాంగ్రెస్‌, పెద్దల సభలో మాత్రం బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని పట్టుబట్టింది. బుధవారం ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కాంగ్రె్‌ససహా విపక్షాలు బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేస్తూ సభాకార్యక్రమాలను స్తంభింప చేశాయి. చివరికి సెలక్ట్‌ కమిటీకి పంపాలా.. వద్దా అన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే మహారాష్ట్రలో అల్లర్లపై పెద్ద ఎత్తున రగడ చోటుచేసుకుంది. దీంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత డిప్యుటీ చైర్మన్‌ కురియన్‌ చర్చకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళ పరిస్థితుల నడుమే రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడారు. ‘లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా ట్రిపుల్‌ తలాక్‌ సంప్రదాయం ఆగలేదు. వరకట్నం ఇవ్వలేదన్న కారణంతో మొరాదాబాద్‌లో ఓ మహిళకు తన భర్త ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిల్లు చట్టరూపం దాల్చడం అత్యవసరం’ అని తెలిపారు. ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యలను ఖండించారు. తమ పార్టీ బిల్లుకు వ్యతిరేకం కాదని, కానీ బిల్లులోని అంశాలను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అదే సమయంలో బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్‌ ఉపనేత ఆనంద్‌ శర్మ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తృణమూల్‌ ఎంపీ డెరిక్‌ ఓ బ్రెయిన్‌ కూడా మరో తీర్మానం పెట్టారు. సెలక్ట్‌ కమిటీలో విపక్ష పార్టీల తరఫున సభ్యులతో కూడిన ఓ జాబితాను సభ ముందుంచారు. దీనిపై అధికారపక్షం తీవ్ర అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్‌, తృణమూల్‌ సభ్యుల తీర్మానాలు చెల్లవని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపలేమని స్పష్టం చేశారు. దీంతో విపక్ష సభ్యులు జైట్లీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయినా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘సుప్రీంకోర్టు జడ్జీలు గత ఏడాది ఆగస్టు 22న ట్రిపుల్‌ తలాక్‌ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఇద్దరు జడ్జీలు తమ అసాధారణ అధికారాన్ని ఉపయోగించి ఆరు నెలలపాటు ట్రిపుల్‌ తలాక్‌పై నిషేధం విధించారు. ఆ నిషేధం గడువు ఫిబ్రవరి 22తో ముగుస్తుంది. ఈలోగా ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేస్తూ చట్టాన్ని తీసుకురావాల్సి ఉంది’ అని జైట్లీ వివరించారు. మీ వైఖరిని ప్రపంచమంతా చూస్తోందని వ్యాఖ్యానించారు. తక్షణ తలాక్‌ రద్దు బిల్లును రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీ పరోక్షంగా అడ్డుకుంటోందని విమర్శించారు.
 
తీర్మానాలు చెల్లుతాయి
తీర్మానం ప్రవేశపెట్టడానికి సంబంధించి ముందుగానే నోటీసు ఇవ్వడం వంటి సాంకేతిక అంశాలను చైర్మన్‌ వెంకయ్య నాయుడు పరిగణలోకి తీసుకోలేదని, కాబట్టి ఇద్దరు సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాలు చెల్లుతాయని డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ స్పష్టం చేశారు. దీంతో బీజేపీ సభ్యులు వెల్‌లోకి రావడానికి ప్రయత్నించారు. ప్రతిగా విపక్ష సభ్యులు తమ స్థానాల్లో ఉండి ఆందోళన చేపట్టారు. ఈ గందరగోళం నడుమ సభను గురువారానికి వాయిదా వేస్తున్న కురియన్‌ ప్రకటించారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలన్న విపక్షాల తీర్మానంపై ఎలాంటి రూలింగ్‌ ఇవ్వకుండానే ఆయన సభను వాయిదా వేశారు.
 
లోక్‌సభకు సవరించిన ఓబీసీ బిల్లు
ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగహోదా కల్పించే బిల్లుకు రాజ్యసభలో కాంగ్రె్‌సతోసహా విపక్ష పార్టీలు సవరణలు సూచించిన నేపథ్యంలో మరోసారి ఆ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు సూచించిన సవరణలతో బిల్లును బుధవారం కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తవర్‌ చంద్‌ గెహ్లాట్‌ లోక్‌సభ ముందు ఉంచారు.
 
రాజ్యసభ గ్యాలరీలో ముస్లిం మహిళలు
రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు కొంత మంతి ముస్లిం మహిళలు రాజ్యసభకు వచ్చారు. పాత ఢిల్లీ నుంచి వచ్చిన వారు పబ్లిక్‌ గ్యాలరీలో కూర్చొని సభాకార్యక్రమాలను వీక్షించారు. కాగా, వారంతా ముస్లిం మహిళలు కాదని, కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బీజేపీకి చెందిన మోసగాళ్లంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్‌ అగర్వాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఆ పార్టీలకు కృతజ్ఞతలు: ఏఐఎంపీఎల్‌బీ
తక్షణ తలాక్‌ రద్దు బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని కోరుతున్న పార్టీలకు ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) కృతజ్ఞతలు తెలిపింది. ఆ పార్టీలన్నీ చివరి దాకా తమ వైఖరికి కట్టుబడి ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ బిల్లు రాజ్యాంగానికే కాక, సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమని ఏఐఎంపీఎల్‌బీ అధికార ప్రతినిధి మౌలానాఖలీఉర్‌ రెహ్మాన్‌ నోమానీ పేర్కొన్నారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.