ADVT
యూటీ నంబర్‌ 1327
04-01-2018 01:49:21
  • చంచల్‌గూడ జైలు బ్యారక్‌లో గజల్‌ శ్రీనివాస్‌
  • బెయిల్‌, కస్టడీ పిటిషన్‌లపై తీర్పు నేటికి వాయిదా
  • సాక్ష్యాలు బలంగా ఉన్నాయంటున్న పోలీసులు
  • ఇతర ఖైదీలతో మాట్లాడకుండా ముభావం
  • భోజనం చేయకుండా బిస్కెట్లు, బ్రెడ్‌, పండ్లతో సరి
సైదాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి.. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న గజల్‌ శ్రీనివాస్‌కు జైలు అధికారులు యూటీ నంబరు 1327ను కేటాయించారు. మంగళవారం సాయంత్రం జైలుకొచ్చిన గజల్‌ శ్రీనివా్‌సను బుధవారం ఉదయం వరకూ అడ్మిషన్‌ బ్యారక్‌లో ఉంచి.. అనంతరం వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని ఉంచిన మరో బ్యారక్‌కు తరలించారు. జైలులో ఆయన భోజనం చేయకుండా.. బిస్కెట్లు, బ్రెడ్‌, పండ్లు భుజించినట్లు సమాచారం. అలాగే, ఇతర ఖైదీలతో మాట్లాడకుండా ముభావంగా ఉంటున్నట్లు తెలిసింది. కాగా.. గజల్‌ శ్రీనివాస్‌ తరఫున ఆయన న్యాయవాది బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ వేయగా, ఆయన్ను వారం రోజులపాటు తమ కస్టడీకి అనుమతించాలంటూ పోలీసులూ పిటిషన్‌ దాఖలు చేశారు.
 
శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని అతడి తరఫు న్యాయవాది వాదించగా.. అతనికి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అతను మరికొంత మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోందని కావున వారం రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు వాదించారు. ఇరువురి వాదనలూ విన్న న్యాయస్థానం.. దాఖలైన రెండు పిటిషన్లపై తీర్పును గురువారానికి వాయిదా వేసింది. జైలుకు వచ్చినప్పటి నుంచి తనకు బెయిల్‌ వస్తుందని గజల్‌ శ్రీనివాస్‌ ధీమాతో ఉన్నారని, కానీ బెయిల్‌పై తీర్పు వాయిదా పడటం, పోలీసులు కస్టడీ పిటిషన్‌ వేయడంతో తీవ్ర నిరాశ చెందారని సమాచారం.
 
మరిన్ని వీడియోలు..
గజల్‌ శ్రీనివాస్‌ వేధింపులను రెండునెలలపాటు భరించిన బాధిత మహిళ.. ఆయన రాసలీలలకు సంబంధించి గంటల కొద్ది నిడివిగల 20 వీడియోలను పోలీసులకు అందజేశారు. శ్రీనివా్‌సపై ఫిర్యాదు చేయడానికి ఒంటరిగా భయంతో పోలీస్టేషన్‌కు వెళ్లానని అక్కడ తనకు పోలీస్‌ అధికారులు పూర్తి భరోసా కల్పించి ధైర్యాన్నిచ్చారంటూ వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. బాధిత మహిళనే కాక, మరికొంత మంది స్త్రీలను కూడా శ్రీనివాస్‌ లైంగికంగా వేధించినట్లు తాజా వీడియోల్లో బలమైన ఆధారాలు లభించాయని పోలీసులు అంటున్నారు. బాధితులు ధైర్యంగా బయటకు వస్తే వారితో కూడా మాట్లాడి వివరాలు నమోదు చేస్తామంటున్నారు. ఇక, ఈ కేసులో రెండో ముద్దాయి అయిన గజల్‌ శ్రీనివాస్‌ పనిమనిషి పార్వతి ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఆమెను ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకొని, విచారించే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

‘సేవ్‌ టెంపుల్‌’ అంబాసిడర్‌ హోదా తొలగింపు
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన గజల్‌ శ్రీనివా్‌సకు మరో షాక్‌ తగిలింది. ఏపీలో ‘సేవ్‌ టెంపుల్‌’ కార్యక్రమానికి అంబాసీడర్‌గా ఉన్న శ్రీనివా్‌సను ఆ హోదా నుండి తొలగిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తమ సంస్థలో స్త్రీలను దేవతలుగా భావిస్తామని, మహిళల పట్ల ఇంత నీచంగా ప్రవర్తించిన వ్యక్తికి అంబాసిడర్‌గా ఉండే అర్హత లేదని వెంటనే అతణ్ని తొలగిస్తున్నట్లు ‘గ్లోబల్‌ హిందూ హెరిటేజ్‌ ఫౌండేషన్‌’ అధ్యక్షులు వెలగపూడి ప్రకాశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.