ADVT
మళ్లీ మున్రో మోత
04-01-2018 01:47:12
  • టీ-20ల్లో మూడో సెంచరీతో కొలిన్‌ రికార్డు
  • 119 రన్స్‌తో కివీస్‌ విజయం
  • వెస్టిండీస్‌తో సిరీస్‌ 2-0తో కైవసం
మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌ విధ్వంసకర వీరుడు కొలిన్‌ మున్రో మరోసారి రెచ్చిపోయాడు. అంతర్జాతీయ టీ-20ల్లో మూడో సెంచరీ చేసి ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో అతను పరుగుల మోత మోగించాడు. 53 బంతుల్లోనే 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 108 పరుగులతో మోతెక్కించాడు. దీంతో కివీస్‌ 119 పరుగులతో విండీస్‌ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు.. మున్రో ధాటికి 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 243 పరుగులు చేసింది. టీ-20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. మున్రో తో పాటు మరో ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ (38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
 
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కరీబియన్‌ జట్టు 16.3 ఓవర్ల లో 124 పరుగులకే కుప్పకూలింది. ఆండ్రీ ఫ్లెచర్‌ (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ మూడు, ట్రెంట్‌ బౌల్ట్‌, ఇష్‌ సోధి రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ-20ల సిరీస్‌ను కివీస్‌ 2-0తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు నెగ్గగా.. రెండో టీ-20లో వర్షం కారణంగా ఫలితం తేలలేదు. మూడు మ్యాచ్‌ ల్లో కలిపి 223 పరుగులు చేసిన మున్రోకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, సిరీస్‌ అవార్డులు దక్కాయి. మున్రో గతంలో బంగ్లాదేశ్‌, భారత్‌పై సెంచరీలు చేశాడు. కాగా, ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌ను 0-2తో, మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో కోల్పోయిన విండీస్‌ టీ-20ల్లోనూ ఓడి ఈ పర్యటనను తీవ్ర నిరాశతో ముగించింది.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.