హనీమూన్‌ అయిపోయింది కెప్టెన్‌!
04-01-2018 01:45:47
విరాట్‌ కోహ్లీ ‘హనీమూన్‌’ పూర్తయిపోయింది. మనం మాట్లాడుతున్నది టీమిండియా కెప్టెన్‌, నవవధువు అనుష్కతో కలిసి యూరప్‌లో సాగించిన విహార యాత్ర గురించి కాదు. టెస్ట్‌ జట్టు సారథిగా అతని మూడేళ్ల హనీమూన్‌ పీరియడ్‌కు సంబంధించిన ప్రస్తావన అది. అతని నాయకత్వ ప్రస్థానానికి అలాంటి ముద్దు పేరు పెట్టడానికి కారణం ఈ మూడేళ్లూ కోహ్లీకి ఆడింది ఆటగా, పాడింది పాటగా హంస నావలాగ హాయిగా సాగడమే. 2015 జనవరిలో టెస్ట్‌ జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన కోహ్లీ ఇప్పటివరకు ఒక్క టెస్ట్‌ సిరీస్‌ కూడా ఓడిపోలేదు. (2014-15 ఆస్ట్రేలియా సిరీస్‌లో ధోనీ, కోహ్లీ చెరి రెండు టెస్టులకు సారథ్యం వహించారు కా బట్టి అది లెక్కలోనికి రాదు). అజేయంగా కొనసాగడమే కాదు, ఇంటా బయటా వరుసగా తొమ్మిది టెస్ట్‌ సిరీస్‌లు గెలిచి రికా ర్డులు తిరగరాశాడు. అతని హయాంలో టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో కూడా మన జట్టు మళ్ళీ నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాక గలిగింది. 32 టెస్టుల్లో నాయకత్వం వహిస్తే వాటిలో మూడే మూడింటిలో ఓటమి చవిచూశాడు. అంతే కాదు కెప్టెన్సీ బాధ్యత అతని బ్యాటింగ్‌ మరింత పదునెక్కేలా చేసింది. మొత్తంగా అతని బ్యాటింగ్‌ సగటు 53.75 ఉంటే కెప్టెన్‌గా ఆడిన మ్యాచుల్లో 67.44గా ఉంది. ఈ గణాంకాలన్నీ చూస్తే కోహ్లీని మించిన కెప్టెన్‌ లేడనిపిస్తుంది. కానీ అంకెలు చెప్పని అసలు కథ ఇంకొకటుంది. తొమ్మిది వరుస సిరీస్‌ విజయాల్లో మూడు మాత్రమే ఇండియా బయట వచ్చాయి. అవి కూడా శ్రీలంక, వెస్టిండీస్‌ పర్యటనల్లో వచ్చినవే. ప్రస్తుతం ఆ రెండూ నాసిరకం జట్లేనని చెప్పడంలో సందేహాలు ఎవరికీ ఉండవు. స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ లాంటి అతిరథ మహారధులపై సిరీస్‌లు నెగ్గిన మాట వాస్తవమే కానీ సొంత గడ్డ మీద మన స్థాన బలం (దీన్ని స్పిన్‌ బలం అని కూడా అనొచ్చు) ఎంత బాగా ఉపయోగపడుతున్నదన్నది ప్రత్యేకంగా చెప్పకనక్కర్లేదు. అందుకే ఈ మూడేళ్ల విరాటపర్వంలోని వరస విజయాలను పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకూ మనం చూసింది ట్రైలర్‌ మాత్రమే, అసలు సినిమా ఈ కొత్త సంవత్సరంలో మొదలవ్వబోతున్నది.. షారుఖ్‌ఖాన్‌ భాషలో చెప్పాలంటే పిక్చర్‌ అభీ బాకీ హై మేరే దోస్త్‌!
 
2018 సంవత్సరంలో కోహ్లీ సేన మూడు ముఖ్యమైన టెస్ట్‌ సిరీస్‌లు ఆడబోతున్నది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలతో ఈ మూడు సిరీస్‌లు ఆయా దేశాల్లోనే జరగనున్నాయి. ఇంట గెలిచిన విరాటుడు ఇప్పుడు రచ్చ గెలిచి తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. కెప్టెన్‌గానే కాదు, బ్యాట్స్‌మన్‌గా కూడా ఈ మూడు సిరీస్‌లు అతనికి లిట్మస్‌ టెస్ట్‌ లాంటివి. ఇప్పటి దక్షిణాఫ్రికా పర్యటన విషయానికొస్తే ఆ గడ్డపై నెగ్గడానికి పాతికేళ్లుగా విఫల ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. 2010-11 నాటి డ్రా మినహా సౌతాఫ్రికాలో ఆడిన మిగతా ఐదు టెస్ట్‌ సిరీసుల్లో మన జట్టుకు ఓటమి తప్పలేదు. ఆ దేశంలో ఆడిన 17 టెస్టుల్లో ఎనిమిదింటిలో ఓడిపోయి రెండు మాత్రమే నెగ్గగలిగాం. మరి కొరకరాని కొయ్యలాగ ఉన్న ఆఫ్రికన్‌ సఫారీలో ఈసారైనా మన రాత మార్చడం కోహ్లీ చేతనవుతుందా?
 
ఈ ఏడాది ఐపీఎల్‌ తర్వాత మన జట్టు ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడబోతున్నది. అక్కడ మన రికార్డు మరీ దక్షిణాఫ్రికాలో ఉన్నంత దారుణంగానైతే లేదు కానీ చివరి రెండు ఇంగ్లండ్‌ టూర్లలో మాత్రం టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. 2011లో 0-4 తేడాతో, 2014లో 1-3 తేడాతో మన జట్టు చిత్తుగా ఓడింది. ఇక ఈ ఏడాది చివరిలోని ఆస్ట్రేలియా పర్యటన మరింత క్లిష్టమైనది. అక్కడ జరిపిన 11 గజనీ దండయాత్రల్లో ఒక్క టెస్ట్‌ సిరీస్‌ కూడా ఇండియా గెలవలేకపోయింది. పెను సవాలుగా ఉన్న ఈ మూడు టూర్లలో కనీసం రెండు సిరీస్‌లు గెలిస్తే అది కెప్టెన్‌ కోహ్లీకి గొప్ప విజయమే అవుతుంది.
 
నాయకుడిగానే కాదు జట్టులో అతిముఖ్యుడైన బ్యాట్స్‌మన్‌గా కూడా కోహ్లీకి ఈ మూడు టూర్లు చాలా ముఖ్యం. అతను ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఆడినవి రెండే రెండు టెస్టులు కాగా వాటిలో మంచి స్కోర్లే సాధించి 60కి పైగా బ్యాటింగ్‌ సగటు నమోదు చేసుకున్నాడు. కానీ ఇంగ్లండ్‌లో మాత్రం ఆడిన ఐదు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ ఐదింటిలో అతని బ్యాటింగ్‌ సగటు 13 మాత్రమే (అత్యధిక స్కోరు 39!). ఆఫ్‌ స్టంప్‌ అవతల పడే స్వింగింగ్‌ బంతుల్ని ఎదుర్కోవడంలో అతనికి కొన్ని ఇబ్బందులనున్నట్టు ఆ ఇంగ్లండ్‌ సిరీస్‌ బయట పెట్టింది. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు ఆడిన 8 టెస్టులో 5 సెంచరీలు, 62 సగటుతో బాగా రాణించాడు. అయితే కెప్టెన్సీ భారంతో పాటు పెద్దగా అనుభవంలేని బ్యాటింగ్‌ లైనప్‌ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంది. ఇప్పటి జట్టులో పుజారా, ధవన్‌, రాహుల్‌, రోహిత్‌ శర్మ లాంటివారు ఫాస్ట్‌ పిచ్‌లపై బాగా ఆడగలుగుతారా అన్నది సందేహాస్పదమే. అందుకే అలాంటి సమస్యలన్నీ దాటుకుని ఈ మూడు సిరీస్‌ల ‘టెస్టు’ పాసైతే కోహ్లీకి ఇక తిరుగుండదు. కోహ్లీ గట్టివాడని, పట్టుబడితే సాధించి తీరతాడని ఈపాటికే మనకు అర్థమయింది. పైగా ఇప్పటి మన జట్టు కూడా ఫాస్ట్‌ బౌలింగ్‌తో సహా అన్ని విభాగాలలో బలంగా కనిపిస్తున్నది. అందుకే విరాట్‌ మనకు ట్రైలర్‌ కన్నా మంచి సినిమా చూపిస్తాడని ఆశ పెట్టుకోవడంలో తప్పులేదేమో.
- సి. వెంకటేష్‌
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.