ప్రవాసీ ఘర్‌ వాపసీ
04-01-2018 01:36:02
  • అమెరికా నుంచి సామూహిక తిరుగు ప్రయాణమే!
  • 15 లక్షల మంది భారతీయులు ఇంటికి?
న్యూఢిల్లీ, జనవరి 3: అమెరికాలో ఉంటున్న పదిహేను లక్షల మంది భారతీయులు ఒక్కసారిగా ఆ దేశం విడిచి రావాల్సి వస్తే...? పీడకల లాంటి ఈ ఊహ నిజంగానే నిజమయ్యే సంకేతాలు కనబడుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగులో ఉన్న విదేశీయుల హెచ్‌1-బీ వీసాలు ఆటోమాటిక్‌గా రెన్యువల్‌ అయ్యే విధానాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనను హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం సీరియ్‌సగా పరిశీలిస్తోంది. అంటే, హెచ్‌1బీ వీసా పొడిగింపు ఆరేళ్లకు మించి ఉండబోదన్న వార్త భారతీయ అమెరికన్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్‌ సర్కారు ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే వారంతా మళ్లీ అందరితో పోటీపడి హెచ్‌1బీ వీసా దక్కించుకోవాల్సి ఉంటుంది. గ్రీన్‌కార్డు రాక, హెచ్‌1బీ లాటరీలో అదృష్టం దక్కక కనీసం 7.5 లక్షల మంది భారతీయ ఉద్యోగులు ఎలాంటి వీసాల్లేని పరిస్థితుల్లో అమెరికా వదలి వెళ్లి పోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికా చరిత్రలో ఇంత భారీ స్థాయిలో భారతీయ ఉద్యోగులను వెనక్కి పంపేయడం ఇదే ప్రథమం కాగలదు’’ అని ఇమిగ్రేషన్‌ వ్యవహారాలు చూసే ఓ సంస్థ అధికారి చెప్పారు. వీసా పొడిగింపు అనేది మూడేళ్ళ నుంచి ఆరేళ్ళ కాలపరిమితి దాకానే ఉంటుంది. వారితోపాటు మరో ఎనిమిది లక్షల మంది కుటుంబ సభ్యులూ ఇంటిబాట పట్టాల్సిందే. అంటే, 15 లక్షల మంది దశల వారీగా అమెరికాలో ఉన్నత జీవితాన్ని వదులుకొని వచ్చేస్తారు. వారిలో చాలామంది భారతీయ మార్కెట్లో ఉద్యోగాలు వెతుక్కుంటారు. అంటే, భారత్‌ ఉద్యోగ మార్కెట్లోనూ అలజడే. అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్‌ సేవల విభాగం(యూఎ్‌ససీఐఎ్‌స)తాజా ప్రతిపాదనలపై నోరు మెదపట్లేదు. డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు జారీ చేసిన- ‘‘బై అమెరికన్‌- హైర్‌ అమెరికన్‌’’ ఆదేశాలను అమలు చేయడానికి తగిన మార్గాలను అన్వేషిస్తున్నామని, అనేక అంశాలు పరిశీలనలో ఉన్నాయని, దేనిపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదని- యూఎ్‌ససీఐఎస్‌ మీడియా సలహాదారు జొనాథన్‌ వితింగ్టన్‌ చెప్పారు. ఈ సామూహిక వేటుపై భారత సర్కార్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ట్రంప్‌ ప్రభుత్వంతో చర్చించి- ఆందోళన తెలియపర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒక అంచనా ప్రకారం దాదాపు 10 లక్షల మంది వీసా హోల్డర్లు గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో సింహభాగం భారతీయులే. ఇందులో పదేళ్ళనుంచీ ఎదురుచూపులు చూస్తున్న వారూ ఉన్నారు. ఉపాధి-ఆధారిత-గ్రీన్‌కార్డ్‌ వ్యవస్థ నిబంధనల ప్రకారం ఒక దేశానికి ఒక ఏడాదిలో ఏడు శాతం కంటే ఎక్కువ గ్రీన్‌కార్డులు మంజూరు చేయరు. ఇంతవరకూ (కంపెనీలకు) హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాలపై మాత్రం ఎలాంటి పరిమితులూ లేవు. ఒక కంపెనీ 70 శాతం మందిని బయటి దేశాల నుంచి పనిలోకి తీసుకోవచ్చు.. అయితే మొత్తం వీసాల పరిమితి మాత్రం 85,000 మాత్రమే. అమెరికాలో ఉన్న భారతీయులకు తక్షణం ముప్పు లేకున్నప్పటికీ ట్రంప్‌ పట్టుదల చూస్తుంటే కొత్త వీసా విధానాలు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా యూఎ్‌సలో ఉన్న తెలుగువారు మాతృదేశానికి రావడానికి మానసికంగా సిద్ధమవుతున్నారని బంధువులతో మాట్లాడుతున్నపుడు మాటల్లో భావన వ్యక్తమవుతోంది.
 
అప్పుడే ట్రంప్‌ ఉంటే..?
అప్పుడే ట్రంప్‌ ఉంటే... సుందర్‌ పిచాయ్‌, సత్యనాదెళ్ల పేర్లు వినేవాళ్లం కాదు అంటున్నారు. ఇన్నాళ్ళూ అమెరికా సరళీకృత వీసా విధానాలను అవలంబించింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌, ఇతర తయారీ రంగాలకు సంబంధింనంతవరకూ ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. దీని వల్లే సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ళ, ఇంద్రా నూయి, ఎడోబ్‌ ఛీఫ్‌ శంతను నారాయణ్‌, మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ అజయ్‌ పాల్‌ సింగ్‌ బంగా, నెట్‌ఏప్‌ సీఈఓ జార్జ్‌ కురియన్‌, హర్మాన్‌ ఇంటర్నేషనల్‌ సీఈఓ దినేష్‌ పాలీవాల్‌, గ్లోబల్‌ ఫౌండ్రీస్‌ సీఈఓ సంజయ్‌ ఝా ఇన్నేళ్ళూ ఏ ఇబ్బందులూ లేకుండా ఉండగలిగారు.. అందరికీ గ్రీన్‌కార్డులు కూడా వచ్చాయి. ఈ ఆంక్షలు ఓ పదేళ్ళ కిందట వచ్చి ఉండుంటే- వీరంతా కూడా ఇపుడు వెనక్కి తిరిగి రావల్సిన పరిస్థితి ఉండేది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.