- మార్కెట్ల తీరుపై బ్రోకరేజ్ సంస్థల అంచనా
- 34500 పాయింట్లతోనే సెన్సెక్స్ సరి
న్యూఢిల్లీ/ముంబై : ఈ ఏడాది దేశీ స్టాక్ మార్కెట్లో సానుకూల పవనాలు కొనసాగవచ్చని పలువురు బ్రోకరేజ్ సంస్థల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలతోపాటు కేంద్ర బడ్జెట్, రుతుపవనాలు, అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలే మార్కెట్ గతిని నిర్దేశిస్తాయనివారన్నారు. అయితే గత ఏడాది ప్రదర్శించినంత జోరు ఉండకపోవచ్చనే అభిప్రాయం వారు సెన్సెక్స్ నిఫ్టీలకు ఇచ్చిన టార్గెట్‌ను బట్టి ఏర్పడుతోంది. ఈ ఏడాది సెన్సెక్స్ 34500, నిఫ్టీ 10800 వరకు వెళ్లే ఆస్కారం ఉన్నదని సెంట్రమ్ బ్రోకింగ్ రీసెర్చ్ అనలిస్ట్ పాయల్ పాండ్యా అన్నారు. గత ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ 7430 పాయింట్లు లాభపడి డిసెంబరు 27 34138 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిని నమోదు చేసిన నేపథ్యంలో ఆమె కొత్త ఏడాదికి ఇచ్చిన అంచనా నిరాశాజనకంగానే ఉన్నదనక తప్పదు. ఈ ఏడాది ఫార్మా, టెక్స్టైల్స్ రంగాలు మెరుగైన పనితీరు ప్రదర్శించవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో దక్షిణాదిన కర్ణాటకతో పాటుగా ఎనిమిది రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించే కేంద్ర బడ్జెట్ ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుంటాయని హెచ్‌డిఎ్‌ఫసి సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ విభాగం అధిపతి దీపక్ జసాని అన్నారు. అంతర్జాతీయ విపణిలో ఆయిల్ ధరలు, ఇతర కమోడిటీ ధరలు, ప్రపంచ దేశాల విధానాలు, వడ్డీరేట్లు స్థిరంగా ఉంటే పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగుతుందని, ఏమాత్రం తేడా వచ్చినా మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయని అరిహంత్ క్యాపిటల్ హోల్ టైమ్ డైరెక్టర్ అనితా గాంధీ అన్నారు. ద్రవ్యోల్బణం కాస్తంత ఎగబాకుతున్నట్టు కనిపించినా ప్రస్తుతానికి స్థూల ఆర్థికాంశాలు సానుకూలంగానే ఉన్నాయన్న అభిప్రాయం కొందరు ప్రకటించారు. పసిఫిక్ సముద్రంపై లా నినా పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ఈ ఏడాది రుతుపవనాలు ఎలా ఉంటాయన్నది అంచనా వేయడం తొందరపాటే అవుతుం దంటున్నారు. రుతుపవనాలు సానుకూలంగా ఉంటే పంట దిగుబడులు బాగుండి గ్రామీణ వినియోగం పెరుగుతుందని యాక్సిస్ సెక్యూరిటీస్ ఎండి, సిఇఒ అరుణ్ తుక్రాల్ అన్నారు. ప్రస్తుత వాతావరణంలో ఇన్వెస్టర్లు సెక్టార్, స్టాక్‌ల వారీ ధోరణి ప్రదర్శించవచ్చునని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
ఎగిసి చప్పబడిన మార్కెట్
దేశీ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం పరుగులు తీసినా చివర్లో లాభాల స్వీకరణతో చప్పగా ముగిశాయి. క్యు3 కార్పొరేట్ ఫలితాల సీజన్ ప్రారంభం కానుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేసే ధోరణి అనుసరించారు. ఆటో, ఐటి, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్, హెల్త్‌కేర్ విభాగాల్లో లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 33998.37 పాయింట్ల వరకు వెళ్లినా చివరికి 18.88 పాయింట్ల నష్టంతో 33793.38 వద్ద ముగిసింది. అయితే నిఫ్టీ మాత్రం ఒకే ఒక్క పాయింటు లాభంతో 10443.20 పాయింట్ల వద్ద క్లోజయింది.
డాక్టర్ రెడ్డీస్ మరో 3 శాతం డౌన్
సెన్సెక్స్ షేర్లలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ 3 శాతం నష్టంతో భారీగా నష్టపోయిన షేరుగా అగ్రస్థానంలో నిలిచింది. బిఎ్‌సఇలో 2.97 శాతం నష్టపోయి 2336.20 రూపాయల వద్ద క్లోజ్ కాగా ఎన్‌ఎ్‌సఇలో 2.91 శాతం నష్టపోయి 2339 రూపాయల వద్ద క్లోజయింది. డాక్టర్ రెడ్డీస్ షేరు నష్టాల్లో ఉండడం ఇది వరుసగా నాలుగో రోజు. నాలుగు రోజుల్లోనూ ఈ షేరు నాలుగు శాతం మేరకు నష్టపోయింది. విశాఖ సమీపంలోని దువ్వాడ ప్లాంట్‌పై ఇఐఆర్లో ప్రస్తావించిన అంశాలకు స్పందనగానే షేరు కదలికలున్నాయని జరుగుతున్న ప్రచారంపై బిఎస్ఇ వివరణ కోరింది. షేరు కదలికలు మార్కెట్లో నెలకొన్న పరిస్థితులకు లోబడి ఉన్నందు వల్ల షేరు కదలికలపై తాము మాట్లాడేదేమీ లేదని బిఎ్‌సఇకి కంపెనీ తెలిపింది.
డిసిబి బ్యాంకు రూ.150 కోట్ల సమీకరణ
ప్రైవేటు రంగంలోని డిసిబి బ్యాంకు ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో బాండ్ల జారీ ద్వారా 150 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్టు ప్రకటించింది. టయర్ 2 నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డు, షేర్‌హోల్డర్ల అనుమతి ఇప్పటికే పొందినట్టు బ్యాంకు తెలిపింది.
లక్ష్మీవిలాస్ బ్యాంకు రైట్స్ ఇష్యూ
రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా 780 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్టు ప్రైవేటు రంగంలోని లక్ష్మీవిలాస్ బ్యాంకు ప్రకటించింది. బుధవారం జరిగిన పెట్టుబడుల సమీకరణ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్టాక్ ఎక్స్ఛేంజిలకు పంపిన సమాచారంలో తెలిపింది.
నాస్డాక్ రికార్డు
టెక్నాలజీ ఇండస్ర్టీ బుల్లి్‌షగా ఉండడంతో అమెరికాకు చెం దిన టెక్నాలజీ ఇండెక్స్ నాస్డాక్ తొలిసారిగా 7000 పాయింట్ల పైన ముగిసింది. ఇండెక్స్ 1.5 శాతం వృద్ధితో 7006.90 పాయింట్ల వద్ద క్లోజయింది. కేవలం ఎనిమిది నెలల కాలంలోనే ఇండెక్స్ వెయ్యి పాయింట్లు పెరిగిందని, టెక్నాలజీ బూమ్‌లో కూడా ఇంత జోరు లేదని వాల్‌స్ర్టీట్ జర్నల్ తెలిపింది.