ADVT
శాంతి సూచికలు
04-01-2018 00:28:00
ప్రతి ఏటా క్షిపణిపరీక్షతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ ఈ మారు అందుకు భిన్నమైన వైఖరి చూపడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నది. జనవరి ఒకటిన ఆయన ప్రసంగంతో పాటు ధరించిన దుస్తులు కూడా భిన్నంగా ఉన్నందున కిమ్‌లో కొందరికి సమూలమైన మార్పు కనిపించింది. నన్ను చూసి వొణికిపోతున్నాడు, నెమ్మదిగా దిగివస్తున్నాడు అని అమెరికా డాంబికాలకు పోతున్నప్పటికీ, అమెరికా ఆయనను ఎంత లొంగదీసుకోగలిగిందో అందరికీ తెలిసిందే. ఉభయకొరియాల విలీనం దిశగా కిమ్‌ పావులు కదుపుతున్నాడని కొందరి అనుమానం. ఈ ఊహాగానాలన్నింటికీ కారణం ఆయన హఠాత్తుగా దక్షిణకొరియా విషయంలో సానుకూలంగా మాట్లాడటం. కిమ్‌ చూపిన చొరవను అందిపుచ్చుకొని దక్షిణకొరియా కూడా చర్చలకు సిద్ధపడటంతో ఈనెల 9వతేదీన ఉభయదేశాల సరిహద్దుల్లోని పన్‌ముంజామ్‌లో ఇరుదేశాలూ చర్చలు జరపబోతున్నాయి. ఈ చర్చల పరిధి స్వల్పమే కావచ్చును కానీ, ఏడాది కాలంగా ఉద్రిక్తతలు గడ్డకట్టుకుపోయి ఉన్న తరుణంలో రెండు దేశాలూ ఇలా ముందుకు రావడం విశేషం.
 
దక్షిణకొరియాకు స్నేహహస్తం అందిస్తూనే, కిమ్‌ తన ప్రసంగంలో యధావిధిగా అమెరికాను ఏకేశారు. తన టేబుల్‌ మీద ఉన్న నూక్లియర్‌ బటన్‌ నొక్కితే అమెరికా సర్వనాశనమైపోతుందని ఆయన చేసిన హెచ్చరికకు ప్రతిగా ట్రంప్‌ కూడా తన టేబుల్‌మీద మరింత పెద్ద బటన్‌ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. పైగా తన దగ్గర ఉన్న బటన్‌ చక్కగా పనిచేస్తుందని కూడా ఎగతాళి చేశారు. ఇటువంటి పనికిరాని ప్రగల్భాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే మీడియా ఈ బటన్‌ బాగోతాలమీద కూడా పుంఖానుపుంఖానులుగా కథనాలు రాస్తున్నది. కిమ్‌ అన్నట్టుగా ఆయన బటన్‌ నొక్కితే అణ్వాయుధాలు అడ్డూ ఆపూ లేకుండా దూసుకొస్తాయి కానీ, అమెరికా అధ్యక్షుడికి బటన్‌కు మాత్రం బోలెడు అడ్డంకులు ఉన్నాయంటూ అక్కడి మీడియా విశ్లేషిస్తున్నది. అణ్వాయుధ ప్రయోగానికి నిర్ణయించుకున్న పక్షంలో అమెరికా అధ్యక్షుడు పెంటగాన్‌కు వచ్చి కోడ్స్‌ అందించడం నుంచి, పాటించవలసిన పలు నియమాల వరకూ ఈ కథనాలు ఏకరువుపెడుతున్నాయి. కిమ్‌ ఏదో నోరుపారేసుకుంటే, అతడినీ, ఆ మాటలనూ బేఖాతరు చేయవలసిన అమెరికా అధ్యక్షుడు కూడా అంతకంటే దిగజారుడు వ్యాఖ్యలు చేయడమేమిటని కొందరు అమెరికన్ల బాధ. ఈ విషయంలో ట్రంప్‌, కిమ్‌ల మధ్య తేడా ఎప్పుడూ లేదు కానీ, ఇప్పుడు కిమ్‌ ఒక్కసారిగా దక్షిణకొరియా విషయంలో మంచిమాటలు మాట్లాడటమే ఆశ్చర్యం కలిగిస్తున్నది.
 
కొరియా ద్వీపకల్పంలో ఏర్పడిన ఉద్రిక్తతలను చల్లార్చడానికి రెండు దేశాలూ కృషిచేయాలనీ, సమస్యల పరిష్కారానికి ఉభయదేశాల అధికారులు సాధ్యమైనంత వేగంగా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని కిమ్‌ అన్నారు. ఫిబ్రవరిలో దక్షిణకొరియా తూర్పు రాష్ట్రమైన ప్యాంగ్‌చాంగ్‌లో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌లో ఉత్తరకొరియా పాల్గొని దానిని విజయవంతం చేస్తుందని కిమ్‌ అనడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఎక్కడ, ఎప్పుడు జరిపినా ఎటువంటి ముందస్తు డిమాండ్లూ లేకుండా చర్చలకు సిద్ధమని దక్షిణకొరియా చెప్పడంతో సమావేశం ఖరారైపోయింది. ఈ చర్చలు కనుక జరిగితే, రెండేళ్ళ తరువాత ఒక ఉన్నతస్థాయి సమావేశం రెండు దేశాల మధ్యా జరిగినట్టు. రెండు దేశాల మధ్యా 2016 ఫిబ్రవరిలో మూతబడిన హాట్‌లైన్‌లు బుధవారం తెరుచుకొని పరస్పరం సంభాషించుకోవడంతో క్షేత్రస్థాయిలో కదలిక కూడా ఆరంభమైంది.
 
ఉభయ కొరియాల చర్చల ప్రతిపాదనను చైనా స్వాగతించింది. అమెరికా వీటిని తేలికగా తీసిపారేయడం సహజమే. ఈ చర్చల కారణంగా ఉత్తరకొరియా విషయంలో తమ వైఖరిలో మార్పేమీ రాదనీ, కిమ్‌ తన దగ్గరున్న అణ్వాయుధాలను తుడిచిపెట్టేస్తే కానీ తాను దిగిరానని అమెరికా ప్రకటించింది. ఉత్తరకొరియా మరో క్షిపణి పరీక్షకు సిద్ధపడుతున్నదనీ, అదే కనుక జరిగితే దానిని వొదిలిపెట్టేది లేదంటూ ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి నిక్‌హాలీ ఇదే సందర్భంలో చేసిన వ్యాఖ్యలు నిఘా సమాచారంతో చేసినవో, చల్లారిన కిమ్‌ను రెచ్చగొట్టడానికి ఉద్దేశించినవో తెలియదు. దక్షిణకొరియాను తనకు దూరం చేసే కిమ్‌ కొత్త వ్యూహం అమెరికాకు సహజంగానే రుచించదు. కిమ్‌ ఇలా ఓ మంచిమాట అనగానే, దక్షిణకొరియా అధ్యక్షుడు ముందుడుగువేయడమూ దానికి నచ్చలేదు. మూన్‌ జే ఇన్‌ అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే కాస్తంత స్వతంత్ర వైఖరి ప్రదర్శిస్తున్నారు. ట్రంప్‌ కయ్యానికి కాలుదువ్వే నిర్ణయాలు చేసినప్పుడల్లా ఆయన తన అసమ్మతిని ప్రకటిస్తున్నారు. కిమ్‌ను రెచ్చగొట్టడం వల్ల అమెరికాకు పోయేదేమీ లేదనీ, తానూ జపాన్‌ మాత్రమే దెబ్బతింటామని ఆయన వాదన. ఉత్తరకొరియాతో సంబంధాల విషయంలో సానుకూలత ప్రదర్శిస్తున్న ఆయన గత పాలకుడి మాదిరిగా తాను ఎవరిచేతిలోనో కీలుబొమ్మను కాబోనని కూడా అంటూంటారు. పక్షం రోజులు క్రితమే చైనాలో నాలుగురోజులు పర్యటించివచ్చిన మూన్‌ ఇప్పటికప్పుడు అమెరికాను దూరంపెట్టగలిగే స్థితిలో లేకపోవచ్చు గానీ, ఉభయ కొరియాల మధ్య శాంతికి అవకాశం ఇచ్చే ఈ సందర్భాన్ని మాత్రం చేజార్చుకోవద్దని అనుకుంటున్నారు. తమ ఆటగాళ్ళకు భద్రత ఉండదన్న పేరిట శీతాకాల ఒలింపిక్స్‌ నుంచి అమెరికా తప్పుకోవాలని చూస్తున్న తరుణంలో కిమ్‌ చూపిన చొరవ రెండు దేశాల మధ్య సయోధ్యకు కాస్తంత అవకాశం ఇస్తున్నది. అమెరికా అనుమానిస్తున్నట్టుగా కిమ్‌ శాంతి సందేశంలో దుష్టతలంపులు, ఎత్తుగడలు, ప్రమాదకరమైన పన్నాగాలు ఉండవచ్చునేమో కానీ, దానివల్ల దక్షిణకొరియా తక్షణమే నష్టపోయేది ఏమీ ఉండదు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.