మళ్లీ తెరపైకి విశాఖ ఉక్కు ఐపిఒ
04-01-2018 00:27:59
  •  10 శాతం వాటా విక్రయానికి సన్నాహాలు
  •   కేంద్ర మంత్రి విష్ణు దేవసహాయ
విశాఖట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌-ఆర్‌ఐఎన్‌ఎల్‌) పెట్టుబడుల ఉపసంహరణ తప్పదని కేంద్ర ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. సంస్థ ఈక్విటీలో పది శాతం వాటాలను ఐపిఒ ద్వారా విక్రయించేందుకు ఎప్పుడో ఏర్పాట్లు చేసినా మార్కెట్‌ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ప్రతిపాదన వాయిదా పడినట్టు తెలిపింది. ఆర్‌ఐఎన్‌ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన నిజమేనా? అని రాజ్యసభలో వైఎ్‌సఆర్‌సిపి ఎంపి విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్ణు దేవ సహాయ ఈ విషయం చెప్పారు. పనితీరు సరిగా లేని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణకు చర్యలు చేపడుతున్నట్టు ఇటీవల ప్రభుత్వ రంగ సం స్థల శాఖ (డిపిఇ) ప్రకటించింది. అందులో భాగంగానే విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డిసిఐ)ను పూర్తిగా ప్రైవేటీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు ఈ ప్రైవేటీకరణ డిసిఐతో ఆగదని, ఆర్‌ఐఎన్‌ఎల్‌లో వాటాలు కూడా అమ్మేస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దేశంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఒక్కటే. ఇతర సంస్థలతో పోల్చుకుంటే లాజిస్టిక్స్‌ పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటికి తోడు విశాఖ ఉక్కుకు వేల ఎకరాల భూములున్నాయి. కేవలం సొంత ఉక్కు గనులు లేవనే సాకుతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ప్రభుత్వ వాటా కొంత విక్రయించాలని నిర్ణయించడాన్ని తప్పు పడుతున్నారు.
 
పరిస్థితి బాగోలేదనే.....
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వాటాల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం వాదన మరో విధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు మార్కెట్‌ మందగమనంలో ఉంద ని, విశాఖ ఉక్కు ఉత్పత్తులకు లాభదాయకత లేదని, బొగ్గు దిగుమతుల ధర లు బాగా పెరిగిపో యాయని అంటోంది. అందువల్లనే వాటాల విక్రయానికి నిర్ణయించామని తెలిపింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీ 2012లోనే ఇందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్ణు దేవసహాయ రాజ్యసభలో బుధవారం వెల్లడించారు.
 
పరిస్థితి మెరుగుపడింది
గత ఐదేళ్లలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ తన వార్షిక ఉత్పత్తి సామర్ధ్యాన్ని రూ.20,000 కోట్ల పెట్టుబడితో 63 లక్షల టన్నుల నుంచి 71 లక్షల టన్నులకు విస్తరించింది. 2015-16లో అమ్మకాల టర్నోవర్‌ ఐదు శాతం పెరిగినా రూ.1,421 కోట్ల నష్టం వచ్చింది. గత ఏడాది (2016-17)లో రూ.12,781 కోట్ల ఉత్పత్తులను విక్రయించింది. ఈ ఏడాది డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు రూ.12,781 కోట్ల విక్రయాలు నమోదుచేసింది. ఆర్థిక సంవత్సరాంతానికి రూ.15,000 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది నష్టాలను అధిగమించి మళ్లీ లాభాల బాటలోకి వస్తామని సిఎండి మధుసూదన్‌ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కులో వాటాల విక్రయం ప్రతిపాదన నిలిపివేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.