భారత్‌ బయో టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌కు డబ్ల్యుహెచ్‌ఒ ఆమోదం
04-01-2018 00:22:14
  • 8 60-70 దేశాలకు ఎగుమతి చేసే అవకాశం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ మరో ఘన విజయం సాధించింది. విష జ్వరాల (టైఫాయిడ్‌) నియంత్రణ కోసం ప్రపంచంలో తొలిసారిగా కంపెనీ అభివృద్ధి చేసిన టైప్‌బార్‌ టిసివి వ్యాక్సిన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ముందస్తు అర్హత (ప్రీక్వాలిఫైడ్‌) సాధించింది. బుధవారం విలేకరుల సమావేశంలో కంపెనీ చైర్మ న్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ఎల్లా ఈ విషయం చెప్పారు. ‘ఈ గుర్తింపుతో యునిసెఫ్‌, పాన్‌ అమెరికన్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (పిఎహెచ్‌ఒ), గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యునైజేషన్‌ (గవి) నిధులతో నడిచే అంతర్జాతీయ ప్రాజెక్టులకు టైప్‌బార్‌ టిసివి వ్యాక్సిన్‌ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడింది’ ఆయన అన్నారు. ప్రస్తు తం వర్ధమాన దేశాల్లో టైఫాయిడ్‌ నియంత్రణ పెద్ద సమస్యగా మారింది. దీని నియంత్రణకు అవసరమైన వ్యాక్సిన్ల సరఫరా కోసం 2019-20 సంవత్సరానికి గవి సంస్థ ఇప్పటికే 8.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.544 కోట్లు) కేటాయించింది. ఇందులో సగం నిధులను బంగ్లాదేశ్‌, నేపాల్‌, మలావి, కెన్యా దేశాల కోసం ఖర్చు చేయబోతోంది.
 
డోసు ధర రూ.1,500
భారత్‌ బయోటెక్‌ గత మూడేళ్ల నుంచి టైప్‌బార్‌ టిసివి వ్యాక్సిన్‌ను దేశీ మార్కెట్లో విక్రయిస్తోంది. యాంటీ బయాటిక్‌ మందులకు కూడా లొంగని టైఫాయిడ్‌ జ్వరాల నుంచి కూడా టైప్‌బార్‌ టిసివి వ్యాక్సిన్‌ రక్షణ కల్పిస్తుందని కృష్ణ ఎల్లా చెప్పారు. ప్రస్తుతం డోసు రూ.1,500 ధరతో ఈ వ్యాక్సిన్‌ను విక్రయిస్తోంది. ఒక వ్యక్తికి ఒక డోసు వ్యాక్సిన్‌తోనే టైఫాయిడ్‌ జ్వరాలు అదుపులోకి వస్తుంది. ‘కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే మరింత తక్కువ ధరకే ఈ వ్యాక్సిన్‌ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కృష్ణ ఎల్లా తెలిపారు. ఆరు నెలల బాలల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ వ్యాక్సిన్‌ ద్వారా టైఫాయిడ్‌ జ్వరాల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. ఈ వినూత్నమైన వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం 2001 నుంచి కంపెనీ దాదాపు రూ.150 కోట్ల సొంత నిధులు ఖర్చు చేసింది.
 
2013లో ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి కంపెనీకి ప్రభుత్వం నుంచి లైసెన్సు లభించింది. గత మూడేళ్లుగా దేశీయ మార్కెట్‌తో పాటు, పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాలకు సరఫరా చేస్తోంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడయ్యే టాప్‌-10 వ్యాక్సిన్లలో టైప్‌బార్‌ టిసివి వ్యాక్సిన్‌ ఒకటి. డబ్ల్యుహెచ్‌ఒ నుంచి తాజాగా లభించిన గుర్తింపుతో వచ్చే రెండు మూడేళ్లలో 60-70 దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడిందని కృష్ణ ఎల్లా చెప్పారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.