ఆరు బ్యాంకులకు రూ.7,577 కోట్లు
04-01-2018 00:20:32
న్యూఢిల్లీ: బలహీనంగా ఉన్న అరడజను ప్రభుత్వరంగ (పిఎ్‌సయు) బ్యాంకులకు సర్కారు నుంచి ఆర్థిక దన్ను లభించనుంది. ఈ బ్యాంకులకు 7,577 కోట్ల రూపాయలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. పునఃమూలధనీకరణ ప్రణాళికలో భాగంగా ఈ బ్యాంకులకు ప్రభుత్వం నిధులు అందించనుంది. ఈ నిధులను పొందే బ్యాంకులు భవిష్యత్‌లో మెరుగైన వృద్ధిని సాధించేందుకుగాను దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంద్రధనుష్‌ ప్రణాళికలో భాగంగా 2019 మార్చితో ముగిసే నాలుగేళ్లకాలంలో బ్యాంకులకు 70,000 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించింది. ఇందులో భాగంగానే బ్యాంకులకు నిధులను సమకూర్చుతోంది.
 
ప్రభుత్వం నుంచి నిధులను పొందే బ్యాంకుల్లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్‌, యుకో బ్యాం కులు ఉన్నాయి. ఈ బ్యాంకులు వాటాదారుల నుంచి తగిన అనుమతులు పొందిన తర్వాత వచ్చే కొన్ని వారాల్లో నిధులను పొందడానికి ఆస్కారం ఉంది. యుకో బ్యాంకు 1,375 కోట్ల రూపాయలు ప్రభుత్వంనుంచి పొందితే అందుకు బదులుగా ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు అనుమతిని పొందింది. ప్రభుత్వానికి 3.88 కోట్ల షేర్లను ఒక్కోటి 83.15 రూపాయల (విలువ రూ.323 కోట్లు) చొప్పున కేటాయించాలని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డు నిర్ణయించింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 2,257 కోట్ల రూపాయలు, ఐడిబిఐ బ్యాంకుకు 2,729 కోట్ల రూపాయలు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు 650 కోట్ల రూపాయలు, దేనా బ్యాంకుకు 243 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
మొండిపద్దుల కారణంగా తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు వచ్చే రెండేళ్ల కాలంలో 2.11 లక్షల కోట్ల రూపాయల నిధులు అందించనున్నట్టు ఇంతకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.
 
బ్యాంకులకు రూ.15,000 కోట్ల నష్టం!
మొండి బకాయిల(ఎన్‌పిఎ)తో సతమతమవుతున్న బ్యాం కింగ్‌ రంగానికి మరో కొత్త సమస్య వచ్చిపడింది. ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీ రేట్లు పెరగడంతో బ్యాంకింగ్‌ రంగ ట్రెజరీ ఆదాయానికి గండిపడుతోంది. బ్యాంకులు తమ నిధుల్లో కొంత భాగాన్ని విధిగా ప్రభుత్వ రుణ పత్రాల్లో (ట్రెజరీ బాండ్స్‌) మదుపు చేయాలి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా వీటిపై వచ్చే రాబడి తగ్గుతుంటుంది. ప్రభుత్వ రుణ సేకరణ పెరగడం, చమురు సెగతో ఇటీవల ద్రవ్యోల్బణం మళ్లీ సెగలు కక్కుతోంది. దీంతో ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. గత మూడు నెలల్లోనే ఈ బాండ్లపై వడ్డీ రేట్లు 67 బేసిస్‌ పాయుంట్లు (0.67 శాతం) పెరిగాయి. వడ్డీ రేట్లు పెరగడంతో ఇప్పటికే ఈ బాండ్లు కలిగి ఉన్న బ్యాంకులు, వ్యక్తులు నిర్ణీత గడువుకంటే ముందే బాండ్లను అమ్మేయడం పెరిగింది. ఫలితంగా వీటిపై వచ్చే రాబడులూ తగ్గుముఖం పట్టాయి. వడ్డీ రేట్ల పెరుగుదలతో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశంలోని బ్యాంకులు ట్రెజరీ బాండ్లపై రూ.15,000 కోట్ల ఆదాయం కోల్పోతాయని ఇక్రా రేటింగ్స్‌ సంస్థ తెలిపింది. ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 80 శాతం వరకు ఉంటుందని అంచనా. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎ్‌సబి) మూలధన పునర్‌ వ్యవస్థీకరణ కోసం ప్రభుత్వం మరిన్ని నిధులు సమకూర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇక్రా పేర్కొంది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.