ADVT
ఎగిరిపోతే.. ఎంత బాగుంటుంది!
03-01-2018 23:31:24
వేల రంగుల్లో, వేవేల రూపాల్లో ఆకాశానికి ఎగరడానికి పోటీ పడుతున్న పతంగులను చూసి ముగ్ధులు కానివారెవరుంటారు? సంక్రాంతి దగ్గరకొస్తోందంటే అందరికీ గుర్తొచ్చేది గాలిపటాలే! ఇల్లిల్లూ గాలిపటాలకు విడిదై, పిన్నాపెద్దా తేడా లేకుండా పొద్దు పొడిచిన దగ్గర్నించీ రాత్రయ్యేదాకా తనివితీరకుండా చేసుకొనే సంబరం అహ్మదాబాద్‌లోని అంతర్జాతీయ పతంగుల ఉత్సవం. ప్రధానంగా అహ్మదాబాద్‌ ఈ వేడుకకు వేదికైనా, గుజరాత్‌లోని ప్రతి నగరం, పట్టణం, పల్లె ఉత్సాహంగా పాల్గొనే పండగ ఇది. నింగికీ, నేలకీ మధ్య గాలిపటాలతో పందిరేసినట్టు కనిపిస్తుంది. అనేక దేశాల నుంచి తరలివచ్చే గాలిపటాల ప్రియులు రూపొందించే అత్యద్భుతమైన ఆకృతులకూ, వారి సృజనాత్మకతకూ ఆకాశమే హద్దు.

ఎక్కడ జరుగుతుంది?: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో

ఎప్పుడు?: జనవరి ఏడో తేదీ నుంచి పదిహేను వరకూ
ఎలా వెళ్ళాలి?: దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచీ అహ్మదాబాద్‌కు రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో చేరుకోవచ్చు.

బస ఎక్కడ?: అన్ని రకాల బడ్జెట్లలోనూ అహ్మదాబాద్‌లో అనువైన వసతి సదుపాయాలున్నాయి.

సందర్భం ఏమిటి?: ఉత్తరాయణ పుణ్యకాలాన్ని (మన ప్రాంతంలో అయితే సంక్రాంతి రోజును) ఆహ్వానిస్తూ గుజరాత్‌లో చేసుకునే వేడుక ఇది. అందుకే దీన్ని ‘ఉత్తరాయణ్‌’ అని కూడా అంటారు. ఆ రాష్ట్రంలో పల్లెల్లో, పట్నాల్లో ఉత్సాహంగా గాలిపటాలు ఎగరేస్తారు. ఈ వేడుకల్లో ప్రతి ఇల్లూ తెల్లారుజామున మేలుకుంటుంది. పిల్లలూ, పెద్దలూ మేడల మీద, వీధుల్లో గాలిపటాలు ఎగరేస్తారు. ఇది సాయంత్రం వరకూ సాగుతుంది. ఇరుగుపొరుగువారి మధ్య గాలిపటాల పోటీలుంటాయి. పక్కవాళ్ళ గాలిపటాలను తెంచేసి నేల కూల్చడానికి ఎత్తులూ పైయెత్తులూ ఉంటాయి. ఇదంతా క్రీడాస్ఫూర్తితో నడిచే వినోదం. పతంగుల దుకాణాలు రోజంతా తెరిచే ఉంటాయి.
 
ఇవీ ప్రత్యేకతలు: 1989 నుంచీ ‘ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌’కు అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇస్తోంది. గుజరాత్‌, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచే కాదు, ఇంగ్లండ్‌, కెనడా, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, అమెరికా, ఫ్రాన్స్‌, చైనా, సింగపూర్‌, ఇటలీ, జపాన్‌, కెనడా, బ్రెజిల్‌... ఇలా అనేక దేశాల నుంచి ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికీ, తిలకించడానికీ సందర్శకులు తరలివస్తారు. రాజకీయ నేతలూ, బాలీవుడ్‌ సెలబ్రిటీల సంగతి సరేసరి. మలేసియా వారి వా-బలాంగ్‌ పతంగులు, అమెరికా వారి భారీ బ్యానర్లతో కట్టిన గాలిపటాలు, జపాన్‌ వారి రొక్కకూ ఫైటింగ్‌ కైట్స్‌, ఇటాలియన్‌ శిల్పకళ ఉట్టిపడేవీ, చైనా ఫ్లయింగ్‌ డ్రాగన్స్‌, ఇండోనేసియా వారి ఇల్లయాంగ్‌-ఇల్లయాంగ్‌హావ్‌ గాలిపటాలు... ఇలా సంప్రదాయానికి ఆధునికతను కలగలిపి రూపొందించే గాలిపటాలు చూపరుల్ని కళ్ళు తిప్పుకోనివ్వవు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నోరూరించే ఫుడ్‌ స్టాల్స్‌, షాపింగ్‌ ప్రియుల కోసం దుకాణాలు ఉండనే ఉంటాయి.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.