ADVT
మనోళ్లు ‘స్మార్ట్‌’ గురూ!
03-01-2018 23:28:24
రాజేష్‌, అరుణ ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. ఈ మధ్యే వారికి పెళ్లయింది. వీకెండ్‌లో సరదాగా ట్రిప్‌ వేద్దామనుకున్నారు. వెంటనే స్మార్ట్‌ఫోన్‌ తీసి తనకు కావాల్సిన యాప్‌లో తాము వెళ్లబోయే ప్లేస్‌ కోసం రివ్యూలు చూశాడు. తెలిసిన వాళ్లను అడిగాడు. మొత్తం వివరాలను ఆరా తీశాడు. ఆన్‌లైన్‌లో యాప్స్‌లో ఉన్న సమాచారాన్ని జల్లెడ పట్టాడు. మొత్తానికి ట్రిప్‌ కన్‌ఫర్మ్‌ అయింది. ఇదంతా అతను ఎక్కడికి వెళ్లకుండానే స్మార్ట్‌ఫోన్‌లోనే అన్నీ జరిగిపోయాయి. ప్రపంచమంతా నడుస్తున్న ట్రెండ్‌ ఇదే. కొత్తగా చెప్పేదేం లేదు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనోళ్లు హై‘టెక్‌’గా ఉన్నారని ట్రావెల్‌పోర్ట్‌ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఏకంగా అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని వెనక్కి నెట్టి భారత్‌ మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11,000 మంది ట్రావెలర్స్‌ నుంచి ఆ సంస్థ వివరాలు సేకరించింది. సుమారు 1000 మంది భారతీయులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
 
ఈ-టిక్కెట్లే సో బెటరూ!
టిక్కెట్‌ బుక్‌ కాగానే, వాటి ప్రింటవుట్లను కూడా తీసుకెళ్లడం పాత పద్ధతి. ఫ్లయిట్‌, ట్రైన్‌, బస్‌ అయినా ఏదైనా సరే ఇప్పుడు ఈ-టిక్కెట్‌ చాలు. ఆ విషయంలో మనమే సూపర్‌. ప్రపంచవ్యాప్తంగా వీటిని వినియోగించేవారు 70 శాతమైతే, భారతీయులు 82 శాతం ఈ-టిక్కెట్స్‌, మొబైల్‌ బోర్డింగ్‌ పాసులవైపే మొగ్గు చూపారు.
 
సమీక్షల్లో కూడా ఫస్టే!
సినిమాకి వెళ్లాలన్నా, పుస్తకం చదవాలన్నా ఇలా దేనికైనా ఇప్పుడు రివ్యూలు సాధారణమైపోయాయి. అదే ఇప్పుడు ట్రావెలింగ్‌కీ వర్తిస్తోంది. ఎక్కడికైనా వెళ్లాలంటే చాలు, వెంటనే ఫోన్‌ తీసి, ట్రావెల్‌ యాప్స్‌లో టకటకా సెర్చ్‌ చేస్తున్నారు. కామెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఓ నిర్ణయానికి వస్తున్నారు. అంతకుముందే ఆ ప్రదేశానికి వెళ్లినవాళ్లను వివరాలను అడిగి తెలుసుకుంటున్న వాళ్లు 91 శాతం మంది ఉన్నారు. ఇక 87 శాతం మంది తమ స్నేహితులు, కుటుంబసభ్యులు పోస్ట్‌ చేసిన ట్రావెల్‌ వీడియోలను కూడా చూస్తూ ఉంటారట. ఇక ట్రిప్‌కి వెళ్లాక, తాము వెళ్లిన రెస్టారెంట్‌ లేదా హోటల్‌ ఎలా ఉందో ఆన్‌లైన్‌లోనే అప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తున్నారట. ఇలాంటివారు 92 శాతంమంది ఉన్నారు. చాలా మంది ఏకంగా 12 రకాల యాప్స్‌ను కేవలం ట్రావెలింగ్‌ కోసం వాడుతున్నారట.
 
ఫ్రీ వైఫై కావాల్సిందే!
ప్రపంచం చిన్నదైపోయింది. దానికి కారణం ఇంటర్‌నెట్‌. ఇప్పుడిది విలాసం కాదు ఓ అవసరం. మొబైల్‌ డేటా ప్యాకేజీ ఆఫర్లను టెలిఫోన్‌ నెట్‌వర్క్‌కంపెనీలు పోటీపడి మరీ సరసమైన ధరల్లో అందిస్తున్నాయి. వైఫై సర్వీసులు కూడా ఇప్పుడు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయు. ఇప్పటికే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌ ఇలా అన్ని చోట్లా ఫ్రీ వైఫై మామూలైపోయింది. ట్రిప్స్‌కి వెళ్లేటప్పుడు కూడా అక్కడి హోటల్స్‌లో ఫ్రీ వైఫై సదుపాయం ఉందా లేదా అని తెలుసుకుంటున్నారు చాలా మంది పర్యాటకులు. 69 శాతం మంది ఫ్రీ వైఫై లేని హోటల్స్‌ జోలికే వెళ్లడం లేదు. ఇక 60 శాతం మంది హోటల్‌ రిసెప్షన్‌కి వెళ్లకుండానే రూమ్‌ ఆటోమెటిక్‌గా బుక్‌ అయ్యే హోటల్‌ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు.
 
ఇండియా నంబర్‌ 1...ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలకు చెందిన పర్యాటకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. భారత్‌ నంబర్‌ వన్‌గా నిలిచింది. పొరుగు దేశం చైనా రెండు స్థానం సంపాదించగా, ఇక అమెరికా 11, ఫ్రాన్స్‌ 13, జపాన్‌18, జర్మనీ 19 స్థానాలతో
సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.